69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’కు రెండు అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ కూడా తెలుగు చిత్రసీమకు చెందినవారే కావడం విశేషం. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా గుర్తించి అందుకు గాను జాతీయ అవార్డును ప్రకటించారు. అంతేకాకుండా ఇందులో తన నటనతో మెప్పించిన పల్లవి జోషికి ఉత్తమ సహాయనటి విభాగంలో అవార్డు దక్కింది. ఈ అంశంపై తాజాగ నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్పందించారు.
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాకు రెండు జాతీయ అవార్డ్స్ రావడం చాలా సంతోషంగా ఉందని అభిషేక్ తెలిపారు. ఈ సినిమా ప్రారంభం నుంచి తమకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని ఆయన తెలిపారు. సినిమాను చూసిన కొందరు యాంటీ ముస్లిం అంటూ కామెంట్లు చేశారు.. ఈ విధంగా ఎలా కామెంట్ చేశారో ఇప్పటికీ అర్థం కాలేదని ఆయన అన్నారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా యాంటీ టెర్రరిస్ట్ కథాంశంతో తెరకెక్కిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా డైరెక్టర్ వివేక్ అమెరికాలో ఉన్నారని, ఈ అవార్డుతో ఆయన మరింత సంతోషంగా ఉన్నారని తెలిపారు.
(ఇదీ చదవండి: అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్)
ప్రస్తుతం తెలుగు సినిమా అనేది రాష్ట్రాన్ని దాటి ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని చెప్పారు. కొందరు రాజకీయాల్లో వస్తున్నానంటూ తన గురించి ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని తను ఎప్పటికీ రాజకీయాలకు దూరం అని చెప్పాడు. అంతేకాకుండా అవార్డ్స్ కోసం లాబీయంగ్ చేశారంటూ కొందరు చెబుతున్నారని ఈ అవార్డ్స్ కోసం ఎలాంటి లాబీయింగ్ చెయ్యలేదని అసలు అలాంటి విషయాలు తనకు తెలీయదని అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు.
అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. '69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో మా ‘ది కశ్మీర్ ఫైల్స్’కు రెండు అవార్డులు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ది కశ్మీర్ ఫైల్స్ ఇది ప్రజల సినిమా. ప్రజలు ఎంతో గొప్పగా ఆదరించారు. ఈరోజున దేశ ప్రజలే ఈ అవార్డు గెలుచుకున్నారు. దేశ ప్రజలకు, కశ్మీర్ పండిట్లందరికీ ఈ పురస్కారాల్ని అంకితమిస్తున్నాం. అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డ్ పొందడం చాలా అనందంగా ఉంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆరు జాతీయ అవార్డులు రావడం, ఉప్పెన, కొండపొలం పాటకి చంద్రబోస్‌కు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే కార్తికేయ 2 తర్వాత ప్రస్తుతం నిర్మిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం. పాన్ ఇండియా ఆడియన్స్ అలరించే కంటెంట్ టైగర్ నాగేశ్వరరావులో ఉంది. అక్టోబర్ 20న విడుదల చేస్తున్నాం. దానికి కూడా జాతీయ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం కావాలి.'' అని అన్నారు.
వాస్తవిక అంశాల చుట్టూ ది కాశ్మీర్ ఫైల్స్
ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం 2022లో విడుదలై భారీ కలెక్షన్స్‌తో పాటు పలు వివాదాలను కూడా క్రియేట్ చేసింది. దీనిని వివేక్ అగ్నిహోత్రి రచించి, అతనే దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీరీ హిందువుల వలసలను వర్ణిస్తుంది. వాస్తవిక అంశాలనే కథాంశంగా దీనిని నిర్మించారు. కశ్మీర్ ఫైల్స్ కోసం మొత్తం షూటింగ్ జరిగిపింది నెలరోజులే. కానీ కథ కోసం రెండేళ్లపాటు దర్శకుడు పరిశోధన చేశాడు.
ఈ సినిమా కోసం కశ్మీర్ రాష్ట్రం దాటి వెళ్లిపోయిన ఏడువందల మంది కశ్మీరీ పండిట్లను ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి నటించారు. అగ్నిహోత్రి రూపొందించిన ఫైల్స్ త్రయంలో ఇది రెండవ చిత్రం, దీనికి ముందు ది తాష్కెంట్ ఫైల్స్, తరువాత ది ఢిల్లీ ఫైల్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment