జిమ్‌ లేదు..సర్జరీ లేదు.. అలా 21 రోజుల్లోనే బరువు తగ్గాను: మాధవన్‌ | Actor Madhavan Reveals Secret Behind His Weight Loss Method, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

రన్నింగ్‌ లేదు..సర్జరీ లేదు.. అలా 21 రోజుల్లో బరువు తగ్గాను: మాధవన్‌

Published Sat, Jul 20 2024 1:12 PM | Last Updated on Sat, Jul 20 2024 3:44 PM

Actor Madhavan Shares His Weight Loss Method

‘‘వ్యాయామం చేయలేదు. రన్నింగ్‌ చేయలేదు. సర్జరీ అసలే లేదు. మెడికేషన్‌ పాటించలేదు... కానీ 21 రోజుల్లోనే పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యాను. బాగా బరువు తగ్గిపోయాను’’... ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ సినిమాలో తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌ గురించి మాధవన్‌ చెప్పిన మాటలు ఇవి. ఈ ఆసక్తికరమైన విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాధవన్‌ వెల్లడించగా, ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మాధవన్‌ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన బయోగ్రాఫికల్‌ డ్రామా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా మాధవన్‌ ఈ సినిమాను తెరకెక్కించి, టైటిల్‌ రోల్‌ చేశారు. 

ఈ చిత్రంలో మాధవన్‌ వివిధ వయస్సుల్లో కనిపిస్తారు. కొన్ని సన్నివేశాల్లో బాగా బరువు పెరిగి, పొట్ట ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. ఈ లుక్‌ నుంచి మాధవన్‌ మళ్లీ తన సాధారణ లుక్‌కు మారేందుకు కేవలం 21 రోజులు మాత్రమే పట్టిందట. ఆ మార్పు గురించి మాధవన్‌ మాట్లాడుతూ– ‘‘నేనొక డాక్టర్‌లా మాట్లాడుతున్నానని అనుకోవచ్చు. నా శరీరానికి ఏది మంచి ఆహారమని భావించానో దాన్నే తిన్నాను. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’కి దర్శకత్వం వహిస్తున్నప్పుడు కాస్త పొట్టతో కనిపించేవాడిని. ఆ తర్వాత 21 రోజులకు నార్మల్‌గా మారిపోయాను. ఇదంతా నేను తీసుకున్న ఆహారం వల్లే జరిగిందని అనుకుంటున్నాను. చెప్పాలంటే నా జీవితంలోనే సైన్స్‌ ఓ భాగమైపోయిందని అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు. 

ఇంకా ‘ఎక్స్‌’ వేదికగా ఈ విషయంపై మాధవన్‌ స్పందిస్తూ– ‘‘అప్పుడప్పుడూ ఉపవాసం ఉన్నాను. ఆహారాన్ని 45 నుంచి 60 సార్లు బాగా నమిలాను (మీ ఆహారాన్ని తాగండి... నీటిని నమలండి). సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకే రోజులోని నా చివరి భోజనం పూర్తయ్యేది. జ్యూస్‌లు ఎక్కువగా తాగాను. ఆకుపచ్చ కూరగాయలు తిన్నాను. ఉదయాన్నే సుదీర్ఘంగా నడిచేవాడ్ని. నిద్రపోవడానికి 90 నిమిషాల ముందు ఏ స్క్రీనూ చూడలేదు. రాత్రివేళ గాఢంగా నిద్రపోతాను. నా శరీరానికి, నా ఆరోగ్యానికి, నా జీవన శైలికి, జీవక్రియకు తగ్గట్లుగా ఆహారాన్ని తీసుకున్నాను. దాంతో క్రమ క్రమంగా మార్పు వచ్చింది’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement