నటి రజినీ చాందీ(ఫొటో కర్టెసీ: ఫేస్‌బుక్)
తిరువనంతపురం: మలయాళ నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ రజిని చాందీను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ వయసులో మీకు ఇలాంటి పనులు అవసరమా అంటూ విద్వేషపూరిత కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఆమె తీయించుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే ఇందుకు కారణం. కాగా 2016లో ‘ఒరు ముతస్సి గాథ’తో రజిని వెండితెరపై రంగప్రవేశం చేశారు. ఆరు పదుల వయసు పైబడిన ఆమె.. ఈ సినిమాలో కీలకమైన బామ్మ పాత్రలో మెప్పించారు. ఈ క్రమంలో మలయాళ బిగ్‌బాస్ సీజన్ 2లో కూడా పాల్గొన్నారు. అయితే గత కొంతకాలంగా బిగ్‌స్క్రీన్‌కు దూరమైన రజినీ, ఫొటోగ్రాఫర్ అథిరా జాయ్ ప్రోత్సాహంతో పాశ్చాత్య వస్త్రధారణలో ఫొటోషూట్ నిర్వహించుకున్నారు. (చదవండి: ‘ఏంటా ఫొటో.. అసలేం చెప్పదలచుకున్నారు’)
ఇక ఎక్కువగా సంప్రదాయ చీరకట్టులో కనిపించే ఆమె.. డెనిమ్స్, ఫ్లోరల్ మాక్సీలు ధరించి ఫొటోలకు ఫోజులిచ్చారు. వాటిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇందుకు కొంతమంది సానుకూలంగా స్పందించి.. ‘‘మీ ఆలోచనా విధానానికి హాట్సాఫ్. మీపై మీకున్న విశ్వాసం అమోఘం’’ అంటూ ప్రశంసలు కురిపించారు. మరికొంత మంది మాత్రం.. ‘‘నువ్వు ఇంకా చచ్చిపోలేదా? ఈ వయసులో ఇదేం బుద్ధి’’ అంటూ విషంకక్కారు. ఇక ఈ నెగటివ్ కామెంట్లపై స్పందించిన రజినీ చాందీ ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను ఆకతాయిగా అభివర్ణించారు. ఇంకా బతికే ఉన్నావా అని అడిగారు. ఇంట్లో కూర్చుని దేవుడికి ప్రార్థన చేసుకోవాలని సూచించారు.
భగవంతుణ్ని తలచుకుని కాలం గడపాల్సిన వయసులో ఇలా స్కిన్ షో ఎందుకు అని ప్రశ్నించారు. ఇలాంటి వారిలో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. నాకు తెలిసి 40-50 ఏళ్ల వయస్సున వాళ్లు నన్ను చూసి అసూయ పడుతున్నారేమో. ముసలావిడ అందంగా కనిపిస్తే బహుశా వాళ్లకు నచ్చడం లేదేమో. నాకు త్వరలో 70 ఏళ్లు నిండుతాయి. నాకు నచ్చిన పనిచేయడంలోనే సంతృప్తి దొరుకుతుంది. యవ్వనంలో ఉన్నపుడు కుటుంబ బాధ్యతలు, పిల్లల బాగోగులు చూసుకోవడంలోనే చాలా మందికి కాలం గడిచిపోతుంది. అలాంటి వారికి ఇలాంటి వ్యాపకాలు స్ఫూర్తిగా నిలుస్తాయనే అనుకుంటున్నా’’ అని ట్రోల్స్‌కు గట్టి సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment