
ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆధ్వర్యంలో జరిగిన 'ఉమెన్ ఇన్ మెడిసిన్ కాంక్లేవ్' కార్యక్రమంలో అక్కినేని అమల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని, ప్రస్తుతం వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి మూవీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన ఆమె చలనచిత్ర రంగంలో రాణించాలంటే ముందుగా ఆ పాత్రకు మనం ఫిట్ అవ్వాలని, అందుకోసం మనల్ని మనం మేకోవర్ చేసుకోవాలన్నారు.
అంతేకాదు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని. దాంతో డైరెక్టర్స్, నిర్మాతలు సినిమాల్లో క్లాసికల్ డ్యాన్సర్ పాత్రల కోసం నన్ను సంప్రదించారు. అలా నాకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ అది అంత ఈజీ కాదు. మనకు ఇక్కడ గుర్తింపు రావాలంటే ఆ పాత్రకు మనం ఫిట్ అవ్వాలి. ఒకవేళ మనం ఆ పాత్రకి ఫిట్ కాకపోతే దురదృష్టవశాత్తు సినీ రంగంలో ఓ మహిళ మూస పద్దతిలో వెళ్లాల్సి వస్తుంది. కానీ అదృష్టం కొద్ది ఇప్పుడు వారికి చాలా అవకాశాలున్నాయి. తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో ప్లాట్‌ఫాంలు వచ్చాయి.
యంగ్ ఫిలిం మేకర్స్ ఉన్నారు, ఉమెన్ ఫిలిం మేకర్స్ కూడా వస్తున్నారు. ఇప్పుడు మహిళలు పురుషులకు సమానంగా ఏ రంగంలోనైనా రాణించగలిగేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు. ఎలాంటి పరిశ్రమలోనైనా పురుషాధిక్యం ఉంటుంది. అలాగే సినీ రంగంలో కూడా. అలాంటప్పుడు ఓ ఫిమేల్ ఆర్టిస్ట్ ఇక్కడ రాణించడం అంటే అంత ఈజీ కాదు. ఆమె సినిమాను ప్రమించాలి, తన నటనను మెరుగుపెరుచుకోవాలి. ఏలాంటి లేవల్లో ఉన్న మనల్ని మనం ప్రూవ్ చేసుకునేందుకు ఓ మహిళ ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి’ అని ఆమె సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment