టైటిల్: అలా ఇలా ఎలా
నటీనటులు: పూర్ణ, శక్తి వాసుదేవన్, రాజా చెంబోలు, నాగబాబు, సితార, సీత, షాయాజీ షిండే, రేఖ
దర్శకుడు: రాఘవ ద్వారకి
నిర్మాత: జి.నాగరాజు
విడుదల తేది: 22 జూలై 2023
కథ
అను (పూర్ణ) అబద్దం అంటే సహించదు. అబద్దాలు ఆడదు, ఎవరైనా అబద్ధాలు ఆడి మోసం చేసినా అస్సలు ఊరుకోదు.. అలాంటి అను.. సూర్య (శక్తి వాసుదేవన్ )తో ప్రేమలో పడుతుంది. మరో వైపు కార్తీక్ (రాజా చెంబోలు) జైలు నుంచి తప్పించుకుని వస్తాడు. అలా వచ్చిన కార్తీక్.. మిత్రను చంపాలని అనుకుంటాడు? అసలు కార్తీక్ జైలుకి ఎందుకు వెళ్తాడు? మిత్ర ఎవరు? సూర్య ఎవరు? అనుకి, కార్తీక్‌కి ఉన్న లింక్ ఏంటి? ఆమెను మోసం చేసింది ఎవరు? చివరకు అను ఏం చేసింది? అన్నది కథ.
నటీనటులు
అను పాత్రలో పూర్ణ చాలా బాగా నటించింది. లుక్స్ పరంగానూ మెప్పించింది. ఎమోషనల్ సీన్స్‌లో అయితే ఆమెకు నూటికి నూరు మార్కులు పడ్డాయి. శక్తి వాసుదేవన్ భిన్న పార్శ్వాలను చూపించాడు. కార్తీక్ కారెక్టర్లో రాజా బాగానే మెప్పించాడు. నాగబాబు, బ్రహ్మానందం, అలీ సితార, సీత, షాయాజీ షిండే, రేఖ ఇలా అందరూ చక్కగా నటించారు. ప్రేమ కథల మీద ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని వచ్చినా కూడా కొత్త పాయింట్‌తో తెరకెక్కిస్తే దాన్ని జనాలు స్వీకరిస్తారు. ప్రేమ, మోసం అనే కాన్సెప్టుల మీద గతంలో బోలెడన్ని సినిమాలు వచ్చినా, ఇందులో దాన్ని కాస్త కొత్తగా చూపించినట్లనిపించింది.
విశ్లేషణ
ఇంటర్వెల్ వరకు ఒక సినిమాను చూపిస్తే.. తరువాత ఇంకో రకమైన సినిమాను చూపించినట్టు అయింది. ప్రథమార్దం ఫన్నీగా సాగుతుంది. బ్రహ్మానందం, అలీ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. మొదటి భాగంలో కామెడీకి పెద్ద పీట వేస్తే రెండో భాగంలో మాత్రం కథ మీద దృష్టి సారించారు. సెకండాఫ్‌లో కథ సీరియస్ మోడ్‌లోకి వెళ్తుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందా? అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు కొంత సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. క్లైమాక్స్ అయితే ఎవరూ గెస్ చేయలేరు.
చివర్లో ఇచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది. సినిమాలో అక్కడక్కడా సాగదీసి బోర్ కొట్టించినా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్టులు మాత్రం బాగానే వర్కౌట్ అయ్యాయి. అయితే సినిమా ఎక్కడా కొత్తగా అనిపించకపోవడం పెద్ద మైనస్ అనే చెప్పాలి. సాంకేతికంగా ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. మణిశర్మ పాటలు, సంగీతం మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఇంకొన్ని సీన్లకు కత్తెర పడితే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment