సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ టాలెంట్ లేకపోతే ఎవరూ ఇండస్ట్రీలో రాణించలేరు. చేసే సినిమాలో సమ్‌థింగ్ స్పెషల్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. నటనలో వైవిధ్యం ఉంటేనే హీరోగా స్వీకరిస్తారు. ఆ విషయం బాగా తెలిసిన వ్యక్తి అల్లు అర్జున్. మెగా కుటుంబం నుంచి వచ్చినా.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. తనదైన స్టైల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు. తొలి సినిమా ‘గంగోత్రి’ నుంచి మొన్నటి ‘పుష్ప’ వరకూ బన్నీ చేసిన ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపిస్తూ..మాస్, క్లాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా దగ్గరయ్యాడు. ఎలాంటి పాత్ర అయినా సరే ‘తగ్గేదే లే’ అన్నట్లుగా నటిస్తూ ఐకాన్‌స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ బర్త్‌డే నేడు(ఏప్రిల్ 8). ఈ సందర్భంగా అల్లు అర్జున్ సీనీ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.
చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్
చిరంజీవీ హీరోగా నటించిన విజేత(1985) చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు బన్ని. ఆ తర్వాత స్వాతిముత్యం చిత్రంలోనూ నటించాడు. ఆ సినిమా తర్వాత దాదాపు 15 ఏళ్ల గ్యాప్ ఇచ్చి 2001లో వచ్చిన చిరంజీవి ‘డాడీ’సినిమాలో అతిథి పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో డ్యాన్స్ మాస్టర్ చిరంజీవి స్టూడెంట్‌గా తనదైన స్టైల్లో స్టెప్పులేసి మెప్పించాడు.
రూ.100 అడ్వాన్స్‌తో ‘గంగోత్రి’
ఒకసారి చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో అందరితో కలిసి డ్యాన్స్ చేశాడు బన్ని. అయితే తన డ్యాన్స్ మాత్రం అందరికంటే భిన్నంగా ఉండడంతో అందరి చూపులు బన్నీవైపు తిరిగాయి. అందరితో పాటు అతిథిగా వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చూపులు కూడా బన్నీపై పడ్డాయి. ఆయన వెంటనే బన్నీ తల్లి(నిర్మల)దగ్గరకు వెళ్లి ‘మీవాడు పెద్దయ్యాక.. నేనే హీరోగా చిత్రపరిశ్రమకు పరిచయం చేస్తాను’అని చెప్పారు. అంతేకాదు అప్పుడు వంద రూపాయల నోటుని అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అన్నట్లుగానే రాఘవేంద్రరావు ‘గంగోత్రి’తో బన్నీని హీరోగా పరిచయం చేశాడు. రాఘవేంద్రరావు ఇచ్చిన ఆ వంద రూపాయల నోటు ఇప్పటికీ అల్లు అర్జున్ దగ్గరే ఉందట.
‘బన్నీ’తో హ్యాట్రిక్
క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ 'ఆర్య'(2004) సినిమాలో లవర్ బాయ్‌గా నటించి హీరోగా తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నంది అవార్డు లభించింది. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సెషన్. ఇక మూడో చిత్రం ‘బన్నీ’తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాతే అల్లు అర్జున్‌ని అంతా బన్నీ అని పిలవడం మొదలు పెట్టారు.
టాలీవుడ్‌కి సిక్స్‌ప్యాక్
కరుణాకరన్ డైరెక్షన్ లో బన్ని నటించిన నాలుగో చిత్రం 'హ్యపీ' ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన 'దేశముదురు' చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించడమే కాదు.. అల్లు అర్జున్ కి మాస్ ఇమేజ్ ను, స్టార్ డమ్ ని టాలీవుడ్‌కి సిక్స్‌ప్యాక్‌ని పరిచయం చేసింది అల్లు అర్జునే. బన్నీ తర్వాతే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, నితిన్ ఇలా చాలామంది హీరోలు సిక్స్‌ప్యాక్ చూపించారు.
‘పరుగు’తో ప్యామిలీ హీరో
‘దేశముదురు’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ మరో ప్రయోగం చేశాడు. తనకొచ్చిన మాస్ ఇమేజ్‌ని పక్కనపెట్టి ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడం కోసం ‘పరుగు’ చేశాడు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. మే 1, 2008లో విడుదలైన ఈ చిత్రంతో కుటుంబ ప్రేక్షకులను బాగా దగ్గరయ్యాడు బన్నీ. ముఖ్యంగా అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు పడే బాధలను ఈ సినిమాలో చాలా బాగా చూపించాడు భాస్కర్. ఆ ఎమోషన్స్ కూడా బాగానే వర్కవుట్ అయ్యాయి. అయితే సినిమా ఊహించినంత విజయం సాధించకపోయినా బన్నీకి మాత్రం చాలా ప్లస్ అయింది.
వరుస అపజయాలు..
పరుగు తర్వా త ‘ఆర్య 2’తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. సుకుమార్, బన్ని కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రమిది. 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న వరుడు, బద్రీనాథ్, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలు బక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. 'వేదం' చిత్రం నటుడిగా మంచి పేరు తెచ్చి పెట్టింది కానీ కమర్షియల్‌గా హిట్ కాలేదు. ‘జులాయి’, రేసుగుర్రం’ చిత్రాలు అల్లు అర్జున్ కెరీర్‌ని మలుపుతిప్పాయి. రామ్ చరణ్‌తో కలిసి నటించిన ‘ఎవడు’ కూడా బన్నికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.
‘సరైనోడు’తో సాలిడ్ హిట్
ఆ తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బోయపాటి దర్శకత్వంలో నటించిన ‘సరైనోడు’మూవీ అల్లు అర్జున్‌లోని మరో కోణాన్ని బయటకు తీసింది. పారితోషికం తీసుకోకుండా ‘రుద్రమాదేవి’లో నటించి అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆ చిత్రంలో ‘గోనగన్నారెడ్డి’గా అద్భుతంగా నటించాడు.
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ డిజాస్టర్ కావడంతో రెండేళ్లు గ్యాప్ తీసుకున్న బన్ని.. ‘అల.. వైకుంఠపురము’ తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. 2020లో విడుదలైన ఈ సినిమా బన్ని బాక్సాఫీస్ స్టామినా ఏంటో తెలియజేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది.
‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్
సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ఫ’ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంతో స్టైలీష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్‌గా మారాడు. ఈ బిరుదు ఇచ్చింది కూడా సుకుమారే. ‘పుష్ప’తో నార్త్ ఆడియన్స్‌కి మరింత దగ్గరయ్యాడు బన్ని. నిజం చెప్పాలంటే.. ఈ చిత్రం సౌత్‌తో కంటే నార్త్‌లోనే బాగా ఆడింది. అంతేకాదు బన్నీని పాన్ ఇండియా స్టార్ చేసింది. ఇక ఇప్పుడు పుష్ప చిత్రాకి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్’తో తిరిగి వస్తున్నాడు. బర్త్‌డే సందర్భంగా శుక్రవారం విడుదలైన టీజర్, పోస్టర్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తున్నాయి. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment