పుష్ప.. మేక్‌ ఇన్‌ ఇండియా.. తగ్గేదే లే.. ఇంతకీ కథ ఎలా పుట్టిందంటే.. | Allu Arjun Pushpa 2 Mania: How Pushpa Raj Was Born Interesting Details Check Here | Sakshi
Sakshi News home page

Pushpa Mania: ‘మేక్‌ ఇన్‌ ఇండియా’.. తగ్గేదే లే.. ఇంతకీ పుష్ప క‌థ ఎలా పుట్టిందంటే..!

Published Sun, Dec 1 2024 8:12 AM | Last Updated on Sun, Dec 1 2024 9:30 AM

Allu Arjun Pushpa 2 Mania: How Pushpa Raj Was Born Interesting Details Check Here

బాహుబలి తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినిమా గురించి చర్చ సుకుమార్-అల్లు అర్జున్​ల ‘పుష్ప’తోనే నడిచింది. దాదాపు 70 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఎట్టకేలకు ఓ తెలుగు నటుడిని వరించింది ఈ చిత్రంతోనే. మూడేళ్ల కిందట వచ్చిన ఈ చిత్ర మొదటి భాగం ఏ స్థాయిలో హిట్‌ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  అందుకే ఇప్పుడు రెండో భాగం భారీ అంచనాల నడుమ ఆరు భాషల్లో.. 12వేలకు పైగా స్క్రీన్‌లలో డిసెంబర్​ 5న గ్రాండ్​ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ మేనియా నడుమే అసలు పుష్పగాడి కథ ఎలా పుట్టిందో ఓసారి గుర్తు చేసుకుందాం. 

పుష్పరాజ్‌.. తన ఇంటిపేరును కూడా చెప్పుకోలేని స్టేజ్‌లో అవమానాలు ఎదుర్కొనే ఓ మొరటు యువకుడు. అయినా సెల్ఫ్‌ రెస్‌పెక్ట్‌ విషయంలో ‘నీ యవ్వ.. తగ్గేదే లే’’ అంటాడు. ఓనర్‌ ముందే ఇస్టయిల్‌గా కుర్చీలో కూర్చుని ఆ ఉద్యోగానికి కాలదన్ని మరీ ఎర్ర చందనం ముఠాలో చేరతాడు. అడవిలో స్మగ్లింగ్‌ కోసం కూలీగా వెళ్లి..  క్రమక్రమంగా శత్రువుల్ని పెంచుకుంటూ ఆ మాఫియాకి కింగ్‌గా ఎలా ఎదిగాడన్నది పుష్ప  ది రైజ్​ కథ. ఈ మధ్యలో తల్లి పార్వతమ్మ, సవతి అన్న ఫ్యామిలీ సెంటిమెంట్‌..  దానికి సమాంతరంగానే శ్రీవల్లితో ప్రేమాయణం  కూడా నడుస్తుంది. ఆఖర్లో షెకావత్‌ సర్‌తో నడిచే బ్రాండ్‌ ట్రాక్‌తో కథకు కొనసాగింపుగా పుష్పగాడి పెళ్లిలోనే ‘‘శుభం కార్డు’’ పడుతుంది. మొదటిపార్ట్‌లో పుట్టుకొచ్చిన ఎనిమీస్​ మధ్యే పుష్పగాడి రూల్‌ ఎలా నడుస్తుందనే దానితో సుకుమార్​ రెండో పార్ట్​ను చూపించబోతున్నారు!. అయితే..

👉పుష్ప కథ, కాస్టింగ్​ దగ్గరి నుంచి.. చాలా విషయాల్లో దర్శకుడు సుకుమార్‌ అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు!. దశాబ్దాల కిందట ఏపీలో జరిగిన వాస్తవ ఘటనల స్ఫూర్తితో పుష్ప కథను రాసుకున్నాడు సుక్కూ. ఆయన దానిని ఓ వెబ్‌ సిరీస్‌గా తీయాలని భావించాడు. కానీ, ఆ తర్వాత ఎందుకనో నిర్ణయం మార్చుకుని ఫీచర్‌ ఫిల్మ్‌ వైపు మొగ్గు చూపాడు. 

👉ఈ కథతో ఓ అగ్రహీరోను సంప్రదిస్తే.. ఆయన సై అన్నాడు. ప్రాజెక్టు ప్రారంభ పనుల్లోనూ ఆ హీరో సుక్కూతో కలిసి పాలుపంచుకున్నాడు. తీరా.. అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకోగా.. తాను వ్యక్తిగతంగా ఎంతో  ఇష్టపడే హీరో అల్లు అర్జున్‌ దగ్గరకే ఆ కథ చేరింది. అయితే ఆ స్టార్‌ హీరోతో తీయాలనుకున్న కథ వేరైనా.. బ్యాక్‌డ్రాప్‌ మాత్రం ఇదేనని సుకుమార్‌ తర్వాత క్లారిటీ ఇచ్చారు కూడా.

👉కాస్టింగ్​లో విషయంలోనూ సుక్కూ లెక్క తప్పింది. కీలక పాత్రలకు అనుకున్నవాళ్లతో కాకుండా వేరే వాళ్లను ఎంచుకోవాల్సి వచ్చింది. మైత్రి మేకర్స్​ సుకుమార్​తో కొత్త సినిమా అనౌన్స్​ చేసింది 2019 జులైలో. అదే ఏడాది దసరాకు ఈ చిత్రం షూటింగ్​ ప్రారంభం అవుతుందని ప్రకటించింది. ఈలోపు  అయితే అది కాస్త ఆలస్యమై.. అక్టోబర్‌ 30వ తేదీన కొంతమంది కాస్టింగ్​తో పూజా కార్యక్రమం ద్వారా ముహూర్తం షాట్‌తో లాంఛనంగా ప్రారంభమైంది. 

👉ఇక రెగ్యులర్​ షెడ్యూల్​ను అదే ఏడాదిలో కేరళలో యాక్షన్‌ షూట్‌తో ప్రారంభించాలనుకున్నప్పటికీ.. అప్పటికే అల్లు అర్జున్​ అల వైకుంఠపురంలో ఉండడంతో ఆలస్యమైంది. ఆపై 2020 మార్చ్‌లో కేరళ షెడ్యూల్‌తో షూటింగ్‌ మొదలుకావాల్సింది.కానీ,  కరోనాతో సినిమాకు అడ్డుపడింది. అక్కడి నుంచి పుష్పకు సినిమా కష్టాలే నడిచాయి.

👉2020 ఏప్రిల్‌ 8వ తేదీ.. అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా రగ్​డ్​ లుక్​తో పుష్ప ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయ్యి హాట్​ టాపిక్​గా మారింది.


👉అయితే చిత్ర షూటింగ్ ఏరకంగానూ మేకర్స్​ అనుకున్న విధంగా జరగలేదు.  కరోనా పరిస్థితులే అందుకు కారణం. ఆంక్షల కారణంగా లిమిట్​ మెంబర్స్​తో.. ముందుగా అనుకున్న లోకేషన్లలో కాకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో షూట్‌ కానిచ్చారు. ఏపీ, తమిళనాడు అటవీ ప్రాంతంలో 200 రోజులు షూటింగ్​ జరుపుకోవడం, అదీ కరోనా లాంటి టైంలో.. మాములు విషయం కాదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. 

👉కరోనాతో కుదేలైన రంగాల్లో చలన చిత్ర రంగం కూడా ఉంది. షూటింగ్‌లు లేక వేల మంది టెక్నీషియన్లకు ఉపాధి లేకుండా పోయింది. ఆ టైంలో ధైర్యంగా షూటింగ్‌తో ‘పుష్ప’ ఎంతో మందికి ఆసరాగా నిలబడింది. అంతేకాదు విదేశీ టెక్నిషియన్లను ప్రాధాన్యత ఇస్తున్న టైంలో.. స్వదేశీ వాళ్లకు అవకాశం ఇవ్వాలని మేకర్లు భావించారు. అలా కరోనా టైంలో ప్యూర్​ ‘మేక్‌ ఇన్‌‌ ఇండియా’ ప్రాజెక్టుగానూ పుష్ప ది రైజ్‌ గుర్తింపు దక్కించుకుంది. 

👉కరోనా వైరస్​ టైంలో అష్టకష్టాలు పడినా రిలీజ్‌ విషయంలోనూ అనుకున్నది జరగలేదు. 2021 పంద్రాగష్టు వారంలో విడుదల చేయాలనుకుంటే.. అది కాస్త డిసెంబర్‌ 17కి చేరింది. 

పుష్ప ది రైజ్​ లాంటి సినిమా తీయడం అసమాన విషయం. నా ఒక్కడికే కాదు రెండేళ్లపాటు ఈ చిత్రం కోసం పని చేసిన వాళ్లందరికీ ఇది నాలుగు చిత్రాలతో సమానం. 

::: పుష్ప ప్రమోషన్​లో అల్లు అర్జున్​

 



👉2021 డిసెంబర్‌లో అల్లు అర్జున్​ కెరీర్​లో ఫస్ట్​ పాన్​ ఇండియా చిత్రంగా రిలీజ్​ అయ్యింది పుష్ప ది రైజ్​. అయితే.. రిలీజ్​ అయ్యాక తెలుగులో మిక్స్‌డ్‌ రివ్యూస్‌ రాబట్టింది. కానీ, హిందీతో పాటు మిగతా భాషల్లో బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ సంపాదించుకుంది. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.



👉ముఖ్యంగా డీఎస్పీ అందించిన పాటలు.. అన్ని భాషల్లో సూపర్‌ హిట్‌ అయ్యి గ్లోబల్​ వైడ్​గా ట్రెండింగ్​ అయ్యాయి. సెలబ్రిటీలు సైతం ఆ ట్రెండ్​ను ఫాలో అయ్యారు. బన్నీ స్టెప్పులు రీల్స్​ రూపంలో సోషల్‌ మీడియాతో పాపులారిటీ సంపాదించుకున్నాయి.  ఇంకోవైపు.. ‘‘తగ్గేదే లే’’, ‘‘పుష్ప అంటే ఫ్లవర్​ అనుకుంటివా.. ఫైరు”లాంటి డైలాగులు పొలిటికల్​ గానూ ఒక ఊపు ఉపడం గమనార్హం.  

👉సుకుమార్​ ‘పుష్ప ది రైజ్​’..  2022లో రష్యన్​ భాషలో డబ్‌ అయ్యి అక్కడి థియేటర్లలో సందడి చేసింది. అంతేకాదు అదే ఏడాది మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనూ ‘‘బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ ఫ్రమ్‌ ఎరౌండ్‌ ది వరల్డ్‌’’ కేటగిరీలో  ప్రదర్శితమైంది. అలా పుష్ప అంటే నేషనల్​ కాదు.. ఇంటర్నేషనల్​ అని ప్రూవ్​ చేసుకుంది.



👉హిందీలో పుష్ప కేరక్టర్‌కు డబ్బింగ్‌ చెప్పింది నటుడు శ్రేయాస్‌ తల్పడే. తమిళంలో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ కేపీ శేఖర్‌ చెప్పారు. ఇక మలయాళంలో అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు నుంచి మలయాళంలో డబ్‌ అయ్యే ఆయన ప్రతీ చిత్రానికి ఫిల్మ్‌ మేకర్‌ జిస్‌ జాయ్‌ వాయిస్‌ ఇస్తున్నారు. పుష్పకి కూడా ఆయనే డబ్‌ చెప్పారు.


 

👉షెకావత్‌ కేరక్టర్‌కు ఒక్క హిందీలో తప్ప(రాజేష్‌ ఖట్టర్‌) మిగతా అన్ని భాషల్లో ఫహద్‌ ఫాజిల్‌  సొంత వాయిస్‌ ఇచ్చుకున్నారు. ఈ కేరక్టర్‌కు సుకుమార్‌ మొదట బెంగాలీ నటుడు ‘జిషు సేన్ గు‌ప్తా’(భీష్మ ఫేం)  అనుకున్నారు. ఆ తర్వాత కోలీవుడ్​ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతిని తీసుకోవాలనుకున్నారు. ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో.. విక్రమ్‌, మాధవన్‌, ఆర్య, బాబీ సింహా ఇలా పలువురి పేర్లను పరిశీలించారు. చివరకు మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌తో సుకుమార్​ ఫిక్స్‌ అయ్యారు.

:: వెబ్​ డెస్క్​ ప్రత్యేకం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement