‘‘నేను వివాహ వ్యవస్థను నమ్ముతాను. పెళ్లి వల్ల మన జీవితంలో కొత్త బంధాలు, బంధుత్వాలు ఏర్పడతాయి. ‘పుష్పక విమానం’లో పెళ్లి గురించి ఓ మంచి విషయాన్ని చూపించాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే ఆశిస్తున్నాం’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. దామోదర దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, గీత్ సైని, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పుష్పక విమానం’. విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆనంద్ దేవరకొండ చెప్పిన విశేషాలు.
► ముందు ఈ సినిమా కోసం కొన్ని టైటిల్స్ అనుకున్నాం. కానీ ‘పుష్పకవిమానం’ అనగానే ఓ పాజిటివ్ వైబ్ ఉందనిపించింది. సింగీతం శ్రీనివాసరావుగారికి ఫోన్ చేసి, ‘మీ టైటిల్ వాడుకోవచ్చా?’ అని దామోదర అడిగితే, ‘అది నా టైటిల్ కాదు... ఎప్పట్నుంచో ఉంది. మీ సినిమాకి సెట్ అవుతుందంటే వాడుకోండి’ అని పాజిటివ్‌గా స్పందించారు.
► ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అప్పటి నుంచి మా అన్నయ్య విజయ్‌కు దామోదరతో పరిచయం ఉంది. వాళ్లిద్దరూ సినిమా చేద్దామనుకున్నారు. కానీ ఆ తర్వాత అన్న చేసిన ‘పెళ్ళి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ హిట్స్ కావడం వంటివి జరిగిపోయాయి. ఈ సమయంలో మా నాన్నగారు గోవర్థన్‌కు దామోదర దగ్గరయ్యారు. ‘పుష్పక విమానం’ కథను దామోదర నాన్నకు చెప్పారు. నేనూ కథ విన్నాను. మొదట్లో ఈ సినిమాలో నేను హీరోగా చేయాలనుకోలేదు. కొందర్ని సంప్రదించగా... హీరో భార్య లేచిపోవడం ఏంటీ అని ఒప్పుకోలేదు. కానీ ఆ తర్వాత లుక్ టెస్ట్ చేసి సుందర్ పాత్రకు నేను సరిపోతానని అనుకోవడంతో ఓకే చేశారు.
►ఈ సినిమాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టిలంక సుందర్ పాత్ర చేశాను. కానీ పెళ్లయిన పదిరోజుల లోపే సుందర్ భార్య వెళ్లిపోతుంది. బయటకు తెలిస్తే పరువు పోతుందని తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఈ ప్రాసెస్‌లో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాల్సి వస్తుంది. పోలీసాఫీసర్‌గా సునీల్ అన్న, స్కూల్ హెడ్‌మాస్టర్‌గా నరేశ్‌గారు చేశారు. సినిమా చూసే ప్రేక్షకులకు సుందర్‌పై జాలి కలుగుతుంది... కానీ నా ఫ్రస్ట్రేషన్ చూసి నవ్వుకుంటారు.
►‘పుష్పక విమానం’ను మా అన్నయ్య చూశారు. నచ్చడంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రమోషన్స్‌కు టైమ్ కేటాయించారు. నా కథల ఎంపికలో అన్నయ్య ప్రమేయం ఉండదు. నా స్క్రిప్ట్స్ నేనే వింటాను. ఓ సందర్భంలో దర్శకుడు వంశీ పైడిపల్లికి ‘మా తమ్ముడు ఆనంద్ ఆఫ్‌బీట్ సినిమాలు చేస్తుంటాడు’ అని అన్నయ్య నన్ను పరిచయం చేశారు. ఇప్పడు కొత్త తరహా కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్ అందరూ కొత్తగా ఆలోచిస్తున్నారు. భిన్నమైన సినిమాలు చేయడానికి ఓ యాక్టర్‌గా నేను సిద్ధంగానే ఉన్నాను. అలాంటి సినిమాల్లో నటించినప్పుడే యాక్టింగ్‌కు మరింత స్కోప్ దొరుకుతుంది. ప్రస్తుతం దర్శకులు కేవీ గుహన్‌గారు, సాయి రాజేశ్‌లతో పాటు ఓ కొత్త దర్శకుడితో సినిమా కమిటయ్యాను.
Comments
Please login to add a commentAdd a comment