Anasuya Bharadwaj Broke Down Into Tears Over Social Media Trolls, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj Crying Video: నా జీవితంలో ఇలాంటి రోజులు కూడా ఉన్నాయి, బోరున ఏడ్చిన యాంకర్‌.. ఆందోళనలో ఫ్యాన్స్‌

Published Sat, Aug 19 2023 3:17 PM | Last Updated on Sat, Aug 19 2023 4:16 PM

Anasuya Bharadwaj Broke Down Into Tears - Sakshi

ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ గుక్కపెట్టి ఏడ్చింది. తన బాధనంతా కన్నీళ్ల రూపంలో వ్యక్తపరుస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పైకి స్ట్రాంగ్‌ లేడీగా కనిపించే అనసూయ మనసులో ఇంత బాధ ఉందా? అసలేం జరిగింది? ఎందుకు ఇంతలా ఏడుస్తోంది? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటిది కాదని, ఐదు రోజుల క్రితంది అని పేర్కొంది అనసూయ. ఆ సమయంలో తన బాధను వ్యక్తీకరించిన క్షణాలను గుర్తుపెట్టుకునేందుకే ఈ వీడియో రికార్డు చేసినట్లు పేర్కొంది.

సోషల్‌ మీడియా ఉన్నది దేనికి?
అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో 'హలో అందరికీ.. మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నా పోస్ట్‌ చూసి మీరందరూ ఎంతో గందరగోళానికి గురై ఉంటారు. ఇకపోతే నాకు తెలిసినంతవరకు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ అనేవి సమాచారాన్ని పంచుకునేందుకే ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే ఒకరితో ఒకరు కనెక్ట్‌ అవడానికి, ఒకరి కోసం ఒకరం ఉన్నామని చెప్పడానికి, విజ్ఞానాన్ని పంచుకోవడానికి, జీవన విధానాలను, సాంప్రదాయాలను, సంతోషాలను షేర్‌ చేసుకునేందుకే సోషల్‌ మీడియా ఉంది. ఆశ్చర్యమేంటంటే.. నిజంగా అదే జరుగుతోందా?

సంతోషాన్ని షేర్‌ చేసుకున్నా.. ఇప్పుడు బాధను..
ఈ పోస్ట్‌ ఎందుకు వేశానంటే.. నేను ఏ ఫోటోషూట్‌ చేసినా, సరదాగా ఫోటోలు తీసుకున్నా, డ్యాన్స్‌ చేసినా, నవ్వుకున్నా, కౌంటర్స్‌ ఇచ్చినా.. ఏం చేసినా మీతో షేర్‌ చేసుకున్నాను. ఎందుకంటే అవన్నీ నా జీవితంలో భాగమే.. నా జీవితంలో బాధాకరమైన క్షణాలు కూడా ఉన్నాయి. అప్పుడు నేను బలహీనమైపోయి, కుమిలిపోయి ఏడ్చాను. దాన్ని కూడా మీతో షేర్‌ చేసుకోవాలనుకున్నాను.  నా లైఫ్‌లో ఇటువంటి రోజులు కూడా ఉన్నాయని మీరు తెలుసుకోవాలనుకున్నాను.

స్ట్రాంగ్‌గా ఉందామనుకున్నా.. కానీ..
మానవ జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. ఒక సెలబ్రిటీగా నేను ఎమోషన్స్‌ను బ్యాలెన్స్‌ చేసుకునేందుకు ప్రయత్నించాను. ఏవీ పట్టించుకోనక్కర్లేదని భావించాను. వీలైనంతవరకు స్ట్రాంగ్‌గా ఉండాలనే ప్రయత్నించాను. అలా ఉండటమే అసలైన బలం అనుకున్నాను, కానీ అది నిజం కాదు. ప్రస్తుతం నా బాధను వ్యక్తపరచడమే నా అసలైన బలం. నా బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటకు వెళ్లనిచ్చి తిరిగి చిరునవ్వుతో లేచి నిలబడతాను. ప్రతిదానికీ సర్దుకుపోవడం అంత ఈజీ కాదు.

దయచేసి అలా చేయొద్దు
అందరినీ నేను కోరుకునేది ఒక్కటే.. దయచేసి సహృదయంతో మెదలండి. అవతలివాళ్లు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారనేది అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడి వారిని ఇంకా బాధించవద్దు. కాస్త ఆలోచించండి. ఈ వీడియో ఐదు రోజుల క్రితానిది. ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను' అని అనసూయ రాసుకొచ్చింది. కాగా అనసూయ ఇటీవల తన భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. ఈ క్రమంలో భర్తతో ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలు, వీడియోలను సైతం అభిమానులతో పంచుకుంది. అయితే ఆమె ఏం చేసినా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు ట్రోలర్స్‌. ఈ క్రమంలోనే తను చాలా అప్‌సెట్‌ అయినట్లు తెలుస్తోంది.

చదవండి: దెబ్బేసిన భోళా.. ఆగస్టు 22 కోసం మెగా ఫ్యాన్స్‌ వెయిటింగ్‌! ఎనీ సర్‌ప్రైజ్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement