విజయ్‌ సేతుపతికి జంటగా స్వీటీ | Anushka Will Act In A Movie With Vijay Sethupathi | Sakshi
Sakshi News home page

విజయ్‌ సేతుపతికి జంటగా స్వీటీ

Published Sat, Jul 25 2020 10:33 AM | Last Updated on Sat, Jul 25 2020 12:21 PM

Anushka Will Act In A Movie With Vijay Sethupathi - Sakshi

కోలీవుడ్లో ఒక కొత్త కాంబినేషన్‌కు శ్రీకారం పడబోతోందన్నది తాజా సమాచారం. మక్కళ్‌ సెల్వన్‌ విజయ్‌సేతుపతి, అందాల భామ అనుష్క కలిసి నటించనున్నారు అన్నదే ఆ వార్త. తమిళ చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా మంచి క్రేజ్‌ ఉన్న నటుడు విజయ్‌సేతుపతి. అయితే ఈయన హీరోగానే కాకుండా విలన్‌ గానూ విలక్షణ నటన ప్రదర్శిస్తూ నటుడిగా రాణిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న విజయ్‌ సేతుపతి ప్రస్తుతం మామనిదన్, కడైశీ వివసాయి, యాదుం ఊరే యావరుం కెళీర్, లాభం, తుగ్లక్‌ దర్బార్‌ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నారు. అదేవిధంగా విజయ్‌ హీరోగా నటించిన మాస్టర్‌ చిత్రంలో విలన్‌గా నటించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా వీటితో పాటు శ్రీలంక క్రికెట్‌ క్రీడాకారుడు ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌లో నటించడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా దేవర్‌ మగన్‌ చిత్రానికి సీక్వెల్‌గా తలైవాన్‌ ఇరుక్కిండ్రాన్‌ పేరుతో తెరకెక్కనున్న చిత్రంలో కమలహాసన్‌తో కలిసి విజయ్‌ సేతుపతి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇకపోతే అనుష్క గురించి చెప్పాలంటే ఆమె చాలా కాలంగా లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల్లోనే నటిస్తున్నారు. అలా ఆమె నటించిన తాజా చిత్రం సైలెన్స్‌‌. ఐదు భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా ఆ తర్వాత అనుష్క మరే చిత్రాన్ని ఒప్పుకోలేదు. దీంతో ఆమె నటనకు గుడ్‌ బై చెపుతోందని ప్రచారం ఓ వైపు జరుగుతోంది. కాగా అనుష్క చాలాకాలం క్రితమే దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు తనే స్వయంగా ప్రకటించింది. అయితే ఆ చిత్రం ఏమైందన్నది తెలియలేదు. కాగా ఇటీవల కమలహాసన్‌ హీరోగా వేట్టెయాడు విలైయాడు చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి గౌతమ్‌ మీనన్‌ సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. (నిరూపించుకునే అవకాశమివ్వండి)

అంతేకాకుండా అందులో కమలహాసన్‌ సరసన అనుష్క నటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ తర్వాత ఈ చిత్రంలో కమలహాసన్‌ జంటగా కీర్తి సురేష్‌ను నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. కాగా ఈ చిత్రంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు విజయ్‌ సేతుపతికి జంటగా అనుష్క నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. దీన్ని వేల్స్‌ ఫిలింఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరీ గణేష్‌ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా ఈ చిత్రానికి ఏఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. దీన్ని తమిళం, తెలుగు భాషల్లో నిర్మించడానికి నిర్మాత సన్నాహాలు చేస్తునట్టు సమాచారం. దర్శకుడు ఏఎల్‌ విజయ్ ‌జయలలిత జీవిత చరిత్రతో రూపొందిస్తున్న తలైవి చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రాన్ని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. (రాఘవన్‌కి జోడీగా...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement