'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి'.. ఈ మాటను తు.చ తప్పకుండా పాటిస్తారు సినీతారలు. అవకాశాలు ఉన్నప్పుడే, స్టార్‌డమ్ సంపాదించినప్పుడే నాలుగు రాళ్లు వెనకేస్తారు. కానీ ఒకప్పటి హీరో, ఇప్పటి విలన్ అరవింద్ స్వామి మాత్రం స్టార్‌గా వెలుగొందుతున్న రోజుల్లో అర్ధాంతరంగా సినిమాల నుంచి తప్పుకున్నాడు. రోజా, బాంబే సినిమాలతో ప్రేక్షకుల మనసులో తనదైన స్థానం సంపాదించుకున్న ఇతడు బాలీవుడ్‌లోనూ లక్ పరీక్షించుకోవాలనుకున్నాడు.
బాలీవుడ్‌తో బేజారు
కానీ హిందీలో రెండు సినిమాలు రిలీజ్ కాగా మరో రెండు ఏళ్ల తరబడి ప్రొడక్షన్ హౌస్‌లోనే మగ్గిపోయాయి. వరుసగా అపజయాలు సైతం రావడంతో ఫెయిల్యూర్ హీరోగానూ ముద్రపడింది. ఈ పరిణామాలతో విసుగెత్తిన అరవింద్ స్వామి 2000వ సంవత్సరంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అప్పుడు తన తండ్రి వ్యాపారాలను చూసుకున్నాడు. వీడీ స్వామి అండ్ కంపెనీలో పని చేశాక ఇంటర్‌ప్రో గ్లోబల్‌కు షిఫ్ట్ అయ్యాడు. బిజినెస్‌మెన్‌గా ఎదుగుతున్న సమయంలో 2005లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి కాలు స్వల్ప పక్షవాతానికి గురైంది. 4-5 ఏళ్లపాటు సుదీర్ఘ చికిత్స అనంతరం అతడు కోలుకున్నాడు.
బిజినెస్‌మెన్‌గానూ సత్తా చాటాడు
అయితే అప్పటికే వ్యాపారంలో రాణిస్తున్న అరవింద్ స్వామి ఈ ప్రమాదం జరగడానికి ముందు టాలెంట్ మాక్సిమస్ అనే సంస్థను స్థాపించాడు. ఇది మార్కెట్‌లో తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసే ఏజెన్సీలా వ్యవహరిస్తుంది. గతేడాది ఈ సంస్థ ఆదాయం రూ.3,300 కోట్లుగా ఉంది. ఇప్పటికీ ఈ కంపెనీని అరవింద్ స్వామియే చూసుకుంటున్నాడు. ప్రమాదం తర్వాత మరో ఆరేడేళ్లు వెండితెరపై కనిపించని అరవింద్ స్వామి తన రీఎంట్రీ మాత్రం రీసౌండ్ ఇచ్చేలా చూసుకున్నాడు.
ధృవతో విలన్‌గా రచ్చ లేపాడు
2013లో మణిరత్నం కాదల్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం 15 కిలోలు తగ్గాడు. ఆ తర్వాత తను ఒరువన్ సినిమాతో తనేంటో నిరూపించాడు. ఇదే సినిమా తెలుగులో ధృవ పేరుతో రీమేక్ కాగా ఇక్కడ కూడా అతడే విలన్‌గా నటించి మెప్పించాడు. ఆయన విలనిజం మెచ్చి తెలుగులో బోలెడు ఆఫర్లు వచ్చాయి. కానీ కుదరకపోవడంతో వెంటనే మరో సినిమా ఒప్పుకోలేదు. చాలా కాలం తర్వాత ఇటీవల వచ్చిన కస్టడీలోనూ మెప్పించాడు అరవింద్ స్వామి.
అనుకున్నది సాధించాడు
ఎంత కష్టపడ్డామనేది ముఖ్యం కాదు. స్క్రీన్‌పై మన పర్ఫామెన్స్ ఎలా ఉందన్నదే ముఖ్యం అనే మాటను నమ్ముతాడు అరవింద్ స్వామి. సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలోనే దర్శకుడు అవ్వాలనుకున్న కలను 2021లో నిజం చేసుకున్నాడు. నవరస ఆంథాలజీలో రౌద్రం భాగానికి దర్శకత్వం వహించాడు. కార్టూన్ సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు.
చదవండి: ఓ పక్క పెళ్లి.. మరోపక్క విడాకులు.. మెగా ఫ్యామిలీలో అనూహ్య పరిణామాలు
అటు మాజీ భార్య.. ఇటు ప్రేయసి.. ఇరువురి భామల మధ్య అమీర్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment