అస్సామీ షార్ట్ ఫిల్మ్ మర్ గౌరర్ డురొంటో గోటి (ఫోటోలు: మహర్షి తుహిన్ కశ్యప్ ఎఫ్ బి)
‘అవును... గుర్రం ఎగరావచ్చు’ అంటారు. ఈ గుర్రం మాత్రం ఎగరడమే కాదు... యంగ్ డైరెక్టర్ మహర్షి కశ్యప్‌ను కూర్చోబెట్టుకొని బెంగళూరు నుంచి జైపుర్ వరకు తిప్పింది. రేపు ఆస్కార్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా తీసుకువెళ్లవచ్చు...
ఆస్కార్ 2023 బరిలో ‘షార్ట్ ఫిల్మ్ ఫిక్షన్’ విభాగంలో మన దేశం నుంచి అస్సామీ షార్ట్ ఫిల్మ్ మర్ గౌరర్ డురొంటో గోటి (ది హార్స్ ఫ్రమ్ హెవెన్) ఎంపికైంది. 27 సంవత్సరాల మహర్షి తుహిన్ కశ్యప్ దీని దర్శకుడు. కథ విషయానికి వస్తే...
ఒక పెద్దాయన ఎప్పుడూ పగటి కల కంటూ ఉంటాడు. నగరంలో జరిగే గుర్రపు పందేలలో తన గుర్రం కూడా ఉండాలి. ఆ గుర్రం ఎలాంటిదంటే, మెరుపు వేగంతో పరుగులు తీస్తుంది. ఎప్పుడు గుర్రపు పందేలు జరిగినా తానే విజేత. ‘మీ గుర్రానికి ఎంత బాగా శిక్షణ ఇచ్చారు’ అంటూ అందరూ తనను వేనోళ్లా పొగుడుతుంటారు.
‘ఇంతకీ నా గుర్రం ఏదీ?’ అని వెదుకుతాడు ఆ పెద్దాయన. కానీ ఆ గుర్రం ఊహాల్లో తప్ప వాస్తవప్రపంచంలో కనిపించదు. అక్కడ కనిపించేది తన గాడిద మాత్రమే!
‘కలా? నిజమా! అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఆస్కార్ గురించి వింటూ, చూస్తూ పెరిగాను. ఇప్పుడు నేను ఆస్కార్ బరిలో నిలవడం అనేది గర్వంగా ఉంది’ అంటున్నాడు మహర్షి.
కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయిన మహర్షి స్టూడెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ చిత్రాన్ని తీశాడు. సర్‌రియలిజం, డార్క్ హ్యూమర్‌లతో కూడిన ఈ కథను చెప్పడానికి సంప్రదాయ కళ ‘ఒజపాలి’ని సమర్థవంతంగా వాడుకున్నాడు దర్శకుడు. ఆరువందల సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న అస్సామీ కళారూపం ‘ఒజపాలి’లో కళాకారులు ఆడుతూ, పాడుతూ, నవ్విస్తూ పురాణాలలో నుంచి కథలు చెబుతుంటారు.
‘ది హార్స్ ఫ్రమ్ హెవెన్’ను ఎక్కువ భాగం క్యాంపస్‌లో చిత్రీకరించారు. కొంత భాగం కోల్‌కతా శివారులలో చిత్రీకరించారు.
ఈ చిత్రం కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్, జైపుర్ ఫిల్మ్‌ఫెస్టివల్, ది హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్, డీప్ ఫోకస్ స్టూడెంట్ ఫిల్మ్‌ఫెస్టివల్...మొదలైన ఎన్నో చిత్రోత్సవాలకు ఎంపికైంది.
తాజాగా బెంగళూరు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్(బీఐఎస్‌ఎఫ్‌ఎఫ్)లో ‘బెస్ట్ ఫిల్మ్’ అవార్డ్ అందుకొని ఆస్కార్ బరిలోకి దిగబోతుంది. ఫీచర్ ఫిల్మ్స్‌లా కాకుండా ఒక షార్ట్‌ఫిల్మ్‌ను ఆస్కార్‌కు పంపాలంటే అది ఆస్కార్ – క్వాలిఫైయింగ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డ్ గెలుచుకోవాలి. మన దేశంలో అలాంటి ఏకైక ఫిల్మ్ ఫెస్టివల్ బీఐఎస్‌ఎఫ్‌ఎఫ్.
‘చిత్ర రూపకల్పన అనేది ఎంత క్లిషమైన విషయమో అందులో దిగాక కాని తెలియదు. ప్రతిరోజూ ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉన్నాను. స్వర్గం నుంచి దిగి వచ్చిన గుర్రం మమ్మల్ని ఎన్నో నగరాలు తిప్పింది. భవిష్యత్‌లో ఎన్ని చోట్లకు తీసుకువెళుతుందో తెలియదు’ అంటున్నాడు మహర్షి.
కల్లోల ప్రాంతంలో పుట్టి పెరిగిన మహర్షికి ఎనిమిదవ తరగతిలో డైరెక్టర్ కావాలనే కోరిక పుట్టింది. చాలామందిలో ఆతరువాత కాలంలో ఆ కోరిక ఆవిరైపోతుంది. కానీ మహర్షి విషయంలో మాత్రం అది ఇంకా బలపడింది. (క్లిక్: హీరో శింబుకు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత)
సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో అడుగు పెట్టిన రోజు తన కలకు రెక్కలు దొరికినట్లుగా సంతోషపడ్డాడు. మహర్షిలో ఉన్న ప్రశంసనీయమైన ప్రత్యేకత ఏమిటంటే.. నేల విడిచి సాము చేయాలనుకోవడం లేదు. తన నేల మీద నడయాడిన కథలనే చిత్రాల్లోకి తీసుకురావాలకుంటున్నాడు. ఉత్తర, దక్షిణ భారతాలతో పోల్చితే వెండి తెర మీద కనిపించిన ఈశాన్య భారత ప్రాంత కథలు తక్కువ. ఇప్పుడు ఆ లోటు మహర్షి కశ్యప్ రూపంలో తీరబోతుంది. ఆస్కార్ ఎంట్రీ అనేది ఆరంభం మాత్రమే! (క్లిక్: 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాకు ఆస్కార్ ఎందుకు? హీరో నిఖిల్ కామెంట్స్ వైరల్)
ప్రాంతీయ చిత్రాలు రకరకాల కష్టాలు ఎదుర్కొన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతుంది. అస్సాం అనేది కొత్త కథలకు కేంద్రం కాబోతుంది.
– మహర్షి
Comments
Please login to add a commentAdd a comment