టైటిల్: భాగ్ సాలే
నటీనటులు: శ్రీ సింహా ,నేహా సోలం, జాన్ విజయ్, రాజీవ్ కనకాల, నందిని రాయ్, హర్ష, సుదర్శన్ తదితరులు
నిర్మాతలు: అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల
దర్శకత్వం: ప్రణీత్ బ్రహ్మాండపల్లి
సంగీతం: కాళ భైరవ
విడుదల తేది: జులై 7, 2023
‘భాగ్ సాలే’ కథేంటంటే..
మధ్య తరగతి కుటుంబానికి చెందిన (శ్రీసింహా) ఓ చెఫ్. ఎప్పటికైనా ఓ స్టార్ హోటల్‌ని స్థాపించాలని అతని ఆశయం. కానీ హోటల్‌ని స్థాపించేంత డబ్బు అతని దగ్గర ఉండదు. తాను రాయల్ కుటుంబానికి చెందిన కోటీశ్వరుడిని అని అబద్దం చెప్పి మాయ(నేహా సోలం)ని ప్రేమలో పడేస్తాడు. మరోవైపు శ్యాముల్ (జాన్ విజయ్) అనే రౌడీ ఓ డైమండ్ రింగ్ కోసం మాయ తండ్రిని కిడ్నాప్ చేస్తాడు. రూ.25 కోట్లు విలువ చేసే ఆ రింగ్‌ని తీసుకొచ్చి ఇస్తేనే అతన్ని వదిలేస్తానని కండీషన్ పెడతాడు.
ఆ రింగ్ తీసుకొచ్చి ఇస్తేనే పెళ్లికి ఓకే చెబుతానని నళిని(నందిని రాయ్) శ్యాముల్‌కి కండీషన్ పెడుతుంది. అసలు ఆ రింగ్ నేపథ్యం ఏంటి? నళినికి ఆ రింగే ఎందుకు కావాలి? ఆ రింగుకు మాయ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి? మాయ కోరిక మేరకు ఆ రింగ్‌ని తీసుకురావడానికి అర్జున్ పడిన కష్టాలేంటి? అర్జున్ రిచ్ పర్సన్ కాదని తెలిసిన తర్వాత మాయ ఏం చేసింది? ఈ కథలో రమ్య(వర్షిణి), ఎస్సై ప్రామిస్‌రెడ్డి(సత్య) దంపతుల పాత్ర ఏంటి? చివరకు ఆ రింగ్ ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే...
ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఇది. ఇలాంటి చిత్రాల్లో క్రైమ్ బలంగా ఉండాలి. అది లేకపోతే సినిమాపై అంత ఆసక్తి ఉండదు. బాగ్‌సాలే విషయంలో బలమైన క్రైమ్ లేదు. కానీ కామెడీ సన్నివేశాలు మాత్రం చాలా ఉన్నాయి. దర్శకుడు ప్రణీత్ కామెడీపైనే ఎక్కువ దృష్టిపెట్టి, క్రైమ్, స్క్రీన్‌ప్లే గాలికొదిలేశాడు.
రింగ్ నేపథ్యాన్ని తెలియజేస్తూ కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఒకేసారి రెండు యాంగిల్స్‌లో నడుతుంది. ఒకపైపు హీరోహీరోయిన్ల ప్రేమ, పెళ్లి గోల, మరోవైపు రింగ్ కోసం విలన్ చేసే ప్రయత్నాలను చూపిస్తూ కథనం సాగుతుంది. విలన్ హీరోయిన్ తండ్రిని కిడ్నాప్ చేసిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. ప్రియురాలి కోసం ఆమె తండ్రిని విడిపించడానికి హీరో పడే పాట్లు, చెప్పే అబద్దాలు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.
ఇక సెకండాఫ్ మొత్తం రింగ్ చుట్టే తిరుగుతుంది. హీరో ఆ రింగ్‌ని దొంగిలించి ఒక చోట పెట్టడం..అది వేరు వేరు వ్యక్తుల చేతికి వెళ్లడం .. దాని కోసం విలన్ గ్యాంగ్, హీరో పడే తిప్పలు అన్నీ కామెడీగా సాగుతాయి. ప్రామిస్ రెడ్డి గా సత్య చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. అయితే సినిమా చూస్తున్నంతసేపు చాలా సన్నివేశాలను ఇంతకు ముందెప్పుడో చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం నవ్వుకోవడానికి మాత్రమే వెళ్తే ఈ సినిమా అలరిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
అర్జున్ పాత్రకి శ్రీసింహా న్యాయం చేశాడు. అయితే ఈ తరహా పాత్రలు ఆయనకు కొత్తేమి కాదు. గత సినిమాల మాదిరే ఇందులో కూడా పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. మాయ పాత్ర పోషించిన నేహా సోలంకి రెగ్యులర్ హీరోయిన్లలా కేవలం పాటలకే పరిమితం కాకుండా సినిమా మొత్తం కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంది. తమిళ నటుడు జాన్ విజయ్ విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. విలన్ బామ్మర్థి జాక్సన్‌గా వైవా హర్ష చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. రాజీవ్ కనకాల, సత్య, వర్షిణి సౌందర్ రాజన్, నందిని రాయ్, సుదర్శన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే ఈ సినిమాకు ప్రధాన బలం కాల భైరవ సంగీతం. పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్‌ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల ఎక్కడా రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment