'ప్రేక్షకులకు సందేశం ఇవ్వాలనో, భావోద్వేగాలతో ఏడిపించాలనో ‘భాగ్ సాలే’ సినిమా తీయలేదు. ప్రేక్షకులు రెండు గంటల పాటు థియేటర్లో నవ్వుకోవాలని తీశాం' అని హీరో శ్రీ సింహా కోడూరి అన్నారు. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘భాగ్ సాలే’. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో శ్రీ సింహా మాట్లాడుతూ–'భాగ్ సాలే' కథని ప్రణీత్ ఎప్పుడో చెప్పాడు. కానీ, ‘తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్’ సినిమాల కమిట్‌మెంట్స్ వల్ల ‘భాగ్ సాలే’ ఆలస్యం అయింది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల లాభాలు, నష్టాలుంటాయి. కథల ఎంపిక అనేది పూర్తిగా నా నిర్ణయమే. నాకు స్క్రిప్ట్ విషయంలో ఏదైనా డౌట్ వస్తే నాన్న (కీరవాణి), బాబాయ్ (రాజమౌళి) సలహాలు తీసుకుంటాను.
‘భాగ్ సాలే’ బడ్జెట్ ఎక్కువైనా నిర్మాతలు రాజీ పడలేదు. ‘రంగస్థలం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన అనుభవం నాకు యాక్టింగ్‌లో ఉపయోగపడింది. రాజమౌళిగారితో సినిమా చేయాలనేది అందరికీ ఓ కల. అలాగని ఆయన్ను నేను ఛాన్స్ అడగలేను. నేనింకా చాలా నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆయనే పిలిచి నాకు అవకాశం ఇవ్వాలి. ప్రస్తుతం ‘ఉస్తాద్’ సినిమా చేస్తున్నాను' అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment