Bigg Boss 4 Telugu Contestants Real Life Stories: Gangavva, Sohel, Harika, Avinash, All Are From Karimnagar - Sakshi
Sakshi News home page

జన్మనిచ్చిన షోను వదిలి బిగ్‌బాస్‌లోకి: అవినాష్‌

Published Wed, Dec 16 2020 10:03 AM | Last Updated on Wed, Dec 16 2020 2:41 PM

Bigg Boss 4 Telugu Contestants From karimnagar - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌–4 రియాల్టీ షో చివరి అంకానికి చేరింది. వంద రోజులుగా కొనసాగుతున్న కార్యక్రమంలో వచ్చే ఆదివారం విజేత ఎవరో తేలనుంది. ఈ క్రమంలో ఫినాలే పోరులో నిలిచిన సయ్యద్‌ సోహెల్‌ది పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీ కాగా.. దేత్తడి హారిక సుల్తానాబాద్‌ ఆడబిడ్డే. సీజన్‌–4ను రక్తికట్టించిన వారిలో జగిత్యాల జిల్లా లంబాడిపల్లికి చెందిన గంగవ్వ షోకే ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. వైల్డ్‌కార్డుతో ఎంట్రీ ఇచ్చి షోను జబర్దస్త్‌గా నడిచేలా చేసిన అవినాష్‌ గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందినవాడు. ఈ సందర్భంగా అవినాష్‌ ‘సాక్షి’తో తన జీవన ప్రయాణ అనుభవాన్ని పంచుకోగా.. సోహెల్‌ గురించి ప్రత్యేక కథనం..

బిగ్‌బాస్‌ నుంచి  కాల్‌ వచ్చింది
ఒకరోజు బిగ్‌బాస్‌ షో నిర్వాహకుల నుంచి ఫోన్‌ వచ్చింది. రియాల్టీషోలో పని చేయాలని ఆహ్వానించారు. అయితే ఓ టీవీ చానల్‌లో ఎనిమిదేళ్లుగా చేస్తున్నా... రానన్నాను. ఒక్కసారి ట్రై చేయండి అన్నారు. నాకున్న ఆర్థిక పరిస్థితులు నన్ను కన్విన్స్‌ చేశాయి. ఓకే చెప్పాను. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే ఒప్పుకోలేదు. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్‌ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు. దాంతో పాటు ఒక్కసారి వెళ్లినవారికి మరో అవకాశం ఉండదన్నారు. అప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్నా. ఏం చేయాలో తోచలేదు. ఈ క్రమంలో గెటప్‌ సీను, శ్రీముఖి, చంద్ర నాకు అండగా నిలిచారు. వాళ్లే రూ.10లక్షలు ఫైన్‌ కట్టారు. అలా నటనలో జన్మనచ్చిన షోను వదిలి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాను. 

పునర్జన్మనిచ్చింది: అవినాష్‌
గొల్లపల్లి(ధర్మపురి): నాన్న ఉపాధికోసం ఎడాదిదేశాలకు వెళ్తే.. అమ్మా, అన్నయ్యలు వ్యవసాయం చేస్తూ.. కుటుంబాన్ని పోషించేవారు. చదువుకునే వయసులో స్నేహితుల ప్రోత్సాహం, అన్నయ్య సాయంతో నటనవైపు మళ్లాడు తను. హైదరాబాద్‌లో అందరిలాగే క్రిష్ణానగర్‌ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాలేదు. చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా వచ్చిన చాన్స్‌ను అందిపుచ్చుకున్నాడు. ఓ టీవీచానల్‌లోని కామెడీ షో జన్మనిస్తే.. బిగ్‌బాస్‌ పునర్జన్మనిచ్చిందని చెబుతున్నాడు ముక్కు అవినాష్‌.

సాధారణ కుటుంబమే.. 
మాది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామం. నాన్న లక్ష్మణ్, అమ్మ మల్లమ్మ. ఐదుగురం అన్నదమ్ములం. నేను మూడోవాణ్ని. నాన్న నా చిన్నప్పటినుంచి దుబాయ్‌ వెళ్లేవాడు. అమ్మ, అన్నలు వ్యవసాయం చేస్తుండేవారు. నేను జగిత్యాలలో పదోతరగతి వరకు, కరీంనగర్‌లో ఇంటర్, హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తిచేశా. స్కూల్‌ టైంనుంచే నటన అంటే ఇంట్రెస్టు. కల్చరల్‌ ప్రోగ్రాముల్లో మిమిక్రీ, డ్యాన్స్‌లు చేసేవాడ్ని. ఇంటర్‌లో నా ప్రతిభను చూసిన స్నేహితులు ప్రోత్సహించారు. ఇండస్ట్రీకి వెళ్తాఅంటే అమ్మానాన్న ఒప్పుకోలేదు. మా పెద్దన్నయ్య వారిని మెప్పించి నన్ను హైదరాబాద్‌లోని ఓ యాక్టింగ్‌ స్కూల్‌లో చేర్పించాడు.

 ఆఫీస్‌ బాయ్‌గా చేసిన.. ఐస్‌క్రీం అమ్మిన
రెండునెలలు యాక్టింగ్‌ నేర్చుకున్నా. బతకడానికి డబ్బులు అవసరం కాబట్టి మూడు నెలలు ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఆఫీస్‌బాయ్‌గా పనిచేశా. ఐస్‌క్రీం బండి నడిపా. కిరాణాషాపులో పనిచేశా. బీటెక్‌ చేస్తుండగా.. సిటీలోని ఓ లోకల్‌ చానెల్‌లో పనిచేస్తూ.. రూంరెంట్, ఖర్చులు వెల్లదీసుకున్నా. సినిమాల్లో అవకాశం కోసం కృష్ణానగర్‌ చుట్టూ తిరిగా. ఆడిషన్లకు వెళ్తే.. నా ఫొటోలు డస్ట్‌బిన్‌లో వేసిన సందర్భాలున్నాయి. 

16 రోజులకు రూ.వెయ్యి ఇచ్చారు
మొట్టమొదటిసారి ఓ సినిమా షూటింగ్‌ కోసం అండమాన్‌ నికోబార్‌ తీసుకెళ్లారు. అక్కడ టీ బాయ్‌గా ప్రొడక్షన్‌ చూసుకునేది. 16 రోజులు పనిచేస్తే రూ.వెయ్యి ఇచ్చారు. ‘వాట్‌హాపెండ్‌ 6టు6’ సినిమాలో అవకాశం రాగా రెండురోజులు ఆడింది. వరంగల్‌కు చెందిన కిరణ్‌ నా యాక్టింగ్‌ను చూసి కెవ్వుకేక ప్రోగ్రాంలో అవకాశం ఇప్పించారు. ఈ క్రమంలో ఓ టీవీలో వచ్చిన తడాఖా ప్రోగ్రాంలో చాన్స్‌ వచ్చింది. అప్పుడే చమ్మక్‌చంద్ర నా యాక్టింగ్‌ను గుర్తించి తనటీంలో చేర్చుకున్నారు. తరువాత వేణు వండర్స్‌ టీంలో చేశాను. అలా ఎనిమిదేళ్లలో టీం లీడర్‌స్థాయికి ఎదిగాను. ఓ వైపు కామెడీ షో చేసూ్తనే పలు ఈవెంట్లు, షోలు చేసేవాడ్ని. వచ్చిన సంపాదనతో 2019లో మణికొండలో ఇల్లు కొన్నా. 

చీకట్లు నింపిన లాక్‌డౌన్‌
ఇల్లు కొన్న సమయంలోనే అమ్మ అనారోగ్యానికి గురైంది. రూ.10 లక్షలు పెట్టి ఆపరేషన్‌ చేయించా. ఆపై రూ.15లక్షలు అప్పు చేశా. ఈ క్రమంలో కరోనా లాక్‌డౌన్‌ నా జీవితంలో చీకట్లు నింపింది. లాక్‌డౌన్‌తో కామెడీ షో షూటింగ్‌ నిలిచిపోయింది. షోలు, ఈవెంట్లు లేవు. అప్పు కట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో అర్థంకాక నేను కొనుక్కున్న ఇంటి పైనుంచే దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. అదే సమయంలో గెటప్‌ సీను ఫోన్‌ చేశాడు. మేమున్నామని ధైర్యం చెప్పాడు. 

13 వారాలున్నా..
వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా బిస్‌బాస్‌ రియాల్టీషోలో అడుగుపెట్టిన నేను 13 వారాలు హౌస్‌లో ఉన్నా. హౌస్‌లో బాగానే ఉన్నప్పటికీ అమ్మానాన్నలకు దూరం ఉండడం కొంత బాధేసింది. కానీ నాకున్న కష్టాలు పోవాలంటే గెలవాలనే కసితో ఆడాను. టాప్‌–5లో నిలుద్దామని అనుకున్నా. కుదరలేదు. ఏదేమైనా అన్నిరోజులు హౌస్‌లో ఉండేలా నాకు ఓట్లువేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.

ఆఫర్లు వస్తున్నాయి
షోనుంచి బయటకు వచ్చాక చాలా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఆర్థిక కష్టాలు కూడా తీరాయి. అందరిని నవ్విస్తూ.. అందరితో నవ్వుతూ ఉండాలన్నది నా కోరిక. మళ్లీ కామెడీ షో నిర్వాహకుల నుంచి పిలుపు వస్తే.. తప్పకుండా వెళ్తా. 

ఫైనల్లో సింగరేణి కుర్రోడు
రామగిరి(మంథని): ‘అరె ఏందిబై.. నేను గిట్లనే ఉంటా. నా ఇష్టమున్నట్టు చేస్తా.. ఊరమాస్‌ ఇక్కడా..!’ బిస్‌బాస్‌లో ఈ డైలాగులు ఎంతో ఫేమస్‌. ఆ మాస్‌ క్యారెక్టరే.. సయ్యద్‌ సోహైల్‌. అతడిప్పుడో యూత్‌ ఐకాన్‌. సింగరేణి పొత్తిళ్లలో పెరిగి ప్రస్తుతం బిగ్‌బాస్‌ ఫైనల్‌లో నిలిచాడు.

సింగరేణి ఉద్యోగం వద్దని..
పెద్దపల్లి మండలం మారేడుగొండ గ్రామానికి చెందిన సయ్యద్‌ సలీం–ఫాహీమా సుల్తానా దంపతులకు సయ్యద్‌ సోహెల్‌ రెండో సంతానం. సలీం సింగరేణి ఉద్యోగం రీత్యా కుటుంబంతో సహా సెంటినరీకాలనీలో స్థిరపడ్డారు. మైనింగ్‌ సర్దార్‌గా పనిచేస్తున్న సలీంకు 2016లో ఓపెన్‌హార్ట్‌ సర్జరీ అయ్యింది. యాజమాన్యం అతడ్ని అన్‌ఫిట్‌ చేసింది. వారసత్వంగా తండ్రి ఉద్యోగాన్ని స్వీకరించేందుకు సోహెల్‌ నిరాకరించాడు. దీంతో సలీంకు డిమోషన్‌ కల్పించి జనరల్‌ మజ్దూర్‌గా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఓసీపీ–2లో విధులు నిర్వహిస్తున్నాడు.

బిగ్‌బాస్‌ ఫైనల్‌లో..
ఈ క్రమంలో బిగ్‌బాస్‌ షోనుంచి ఆహ్వానం అందింది. ఎంట్రీతోనే సీక్రెట్‌ కంటిస్టెంట్‌గా ఉన్న సయ్యద్‌ సోహెల్‌ మొదటినుంచి చురుగ్గా ఆడాడు. ఇచ్చిన ప్రతీటాస్క్‌లో విజయం సాధించాడు. మాస్‌ క్యారెక్టర్‌గా పేరు, ఫ్యాన్స్‌ని సంపాదించాడు. మనసున్న స్నేహితుడిగా మన్ననలు పొందాడు. బిగ్‌బాస్‌ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. విజేతగా తిరిగిరావాలని జిల్లా ప్రజలు, కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుతున్నారు.

డ్యాన్స్‌ అంటే ప్రాణం.. నటన అంటే ఇష్టం
సయ్యద్‌ సోహెల్‌కు చిన్ననాటి నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. 2005లో 9వ తరగతి చదువుతున్న సమయంలో డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌ కార్యక్రమానికి ఎంపిక య్యాడు. ఇంటర్‌ కరీంనగర్‌లో చదివి, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తిచేశాడు. 2009లో దిల్‌రాజ్‌ దృష్టిని ఆకర్షించిన సయ్యద్‌ సోహెల్‌ కొత్తబంగారు లోకం సినిమాలో సైడ్‌ క్యారెక్టర్‌కు ఎంపికయ్యాడు. 2010లో యూఅండ్‌ఐ, 2013లో మ్యాజిక్‌ మ్యూజిక్, 2015లో దిబెల్స్, 2017లో సినీ మహల్‌ సినిమాల్లో నటించాడు. నాతిచరామి, కృష్ణవేణి సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకున్నాడు.

విజేతగా వస్తాడు
సోహెల్‌ ఏదైనా సాధించాలంటే పట్టుదలతో ఉంటాడు. అదే సంకల్పంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ రాణిస్తున్నాడు. సోహెల్‌ యూత్‌ ఐకాన్‌గా నిలవడం గర్వంగా ఉంది. బిగ్‌బాస్‌ షోలో విజేతగా నిలుస్తాడనే నమ్మకం ఉంది.   – సయ్యద్‌ సలీం, సోహెల్‌ తండ్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement