తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ నాల్గో సీజన్కు శుభం కార్డు పడింది. గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అభిజిత్‌ను విజేతగా ప్రకటించారు. అఖిల్‌ను రన్నరప్‌గా వెల్లడించారు. మూడో సీజన్ ఫినాలేకు 8 కోట్ల ఓట్లు రాగా నాల్గో సీజన్‌కు రికార్డు స్థాయిలో 15.65 కోట్ల ఓట్లు వచ్చాయని నాగ్ వెల్లడించారు. కాగా 19 మంది కంటెస్టెంట్లతో.. వారానికి ఒక ఎలిమినేషన్ చొప్పున 105 రోజులపాటు సాగిన ఈ రియాటీ షో ప్రేక్షకులను గణనీయంగా అలరించింది. సెప్టెంబర్ 6న అట్టహాసంగా ప్రారంభమైన ఈ సీజన్ తెలుగు ప్రజలకు త్వరగానే చేరువైంది. తొలి రోజు నుంచే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ..15 వారాలపాటు ఒకే ఇంట్లో ఉంటూ ఎన్నో ఎమోషన్స్‌ను తట్టుకుంటూ ఐదుగురు ఇంటి సభ్యులు అభిజిత్, అఖిల్, సోహైల్, అరియానా, హారిక ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. వీరిలో ఒకరిని విన్నర్‌గా ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన నేటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ విశేషాలేంటో చదివేయండి..
క్షమాపణ చెప్పిన నోయల్
నాగార్జున, ఆ తర్వాత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు 14 మంది స్టన్నింగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఎంటర్‌టైన్ చేశారు. దేవి నాగవల్లి మాత్రం ఫినాలే ముగిసే సమయానికి హాజరైంది. ఇక నోయల్ మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్‌కు ముందు రాజమౌళి, సుకుమార్ ఇచ్చిన అవకాశాలతో నన్ను గుర్తు పట్టేవారు. బిగ్‌బాస్ తర్వాత నాకు మరింత పాపులారిటీ సంపాదించుకున్నాను. ఇంటిలో అవినాష్, అమ్మా రాజశేఖర్‌తో జరిగిన గొడవ వల్ల వాళ్లు ఏమైనా హర్ట్ అయితే అందుకు సారీ. అవినాష్ కామెడీ ఓ మెడిసిన్.. ఆయనలా ఎప్పుడు నేను కామెడీ చేయలేను' అంటూ ఇద్దరికీ క్షమాపణలు తెలిపాడు.
బిగ్‌బాస్ తర్వాత నా లైఫ్ చాలా వేరుగా ఉంది : అవినాష్
గ్రాండ్ ఫినాలేకి వచ్చిన అవినాష్ నాగ్‌తో తన బిగ్‌బాస్ జర్నీ అనుభవాలను పంచుకుంటూ.. ‘మీరు చెప్పినట్టే.. బిగ్‌బాస్‌కు ముందు, బిగ్‌బాస్ తర్వాత నా లైఫ్ చాలా వేరుగా ఉంది. ఇంతకు ముందు మా ఊరు వాళ్లే ఫోటోలు దిగేవారు. కానీ బిగ్‌బాస్ తర్వాత ఇతర జిల్లాల వాళ్లు వచ్చి నాతో ఫోటో దిగుతున్నారు. నాతోనే కాకుండా నా తల్లితో కూడా ఫోటోలు దిగుతున్నారు అని సంతోషం వ్యక్తం చేశాడు.
ఫొటోలు దిగలేకపోతున్నా : గంగవ్వ
గంగవ్వ అయితే ఇంటికొచ్చే వాళ్లతో ఫొటోలు దిగలేకపోతున్నానని వాపోయింది. వచ్చిన వాళ్లు వారి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో తనతో తెగ మాట్లాడిస్తున్నారని, దాని వల్ల గొంతు నొప్పి పుడుతోందని నాగార్జునతో చెప్పుకొచ్చింది. దీనికి బదులు బిగ్ బాస్ హౌస్‌లో ఉండిపోయినా బాగుండని అనిపిస్తోందని చెప్పింది. రోజుకి 500 మంది తనను కలవడానికి వస్తున్నారంది. తన కోరిక మేరకు ఇల్లు కట్టిస్తున్నారని, చాలా సంతోషం అంటూ నాగార్జునకు ధన్యవాదాలు తెలిపింది.
జర్నీ చూసి కంటెస్టెంట్స్ కంటతడి
బిగ్‌బాస్ ఫినాలే సందర్భంగా ఇంటి సభ్యులందరికి 105 రోజుల జర్నీని చూపించి అందరినీ ఏడిపించారు. 19 మందితో మొదలైన బిగ్‌బాస్ నాల్గో సీజన్ ప్రస్తుతం 5 మంది ఉన్నారు. ఇన్నాళ్లు వాళ్లు చూపించిన ప్రేమ, కోపం,ఆప్యాయతలు అన్నింటినీ ఏవీలో వేసి చూపించారు. తమ జర్నీ చూసి ఇంట్లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ అభిజిత్, హారిక, అరియానా, సోహైల్, అఖిల్‌తో పాటు ఎలిమినేట్ అయినవారు కూడా కంటతడి పెట్టారు.
అనిల్ రావిపుడి రచ్చ రచ్చ
బిగ్‌బాస్ ఎలిమినేట్ అయిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చే బాధ్యతను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపుడికి అప్పగించారు. అయితే తాను నవ్విస్తాను కానీ ఎలిమినేట్ చేయలేనని నాగ్‌కు విజ్ఞప్తి చేశాడు. దీంతో నాగ్ ఆ బాధ్యతను ఎఫ్2 హీరోయిన్ మెహరిన్‌కు అప్పగించారు. దీంతో బ్యాండ్ బాజాలతో అనిల్ రావిపుడి, మెహరిన్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.ఇక ఇంట్లోకి వెళ్లిన అనిల్‌తో టాస్క్‌లు ఆడించారు నాగ్. పలు చిలిపి ప్రశ్నలు అడిగి ఎంటర్‌టైన్‌మ్మెంట్ చేశాడు. హౌస్‌మేట్స్‌ని ఇమిటేట్ చేసి కడుపుబ్బా నవ్వించాడు.
హారిక అవుట్
ఫినాలే పోరులో నుంచి తొలుతగా హారిక ఎలిమినేట్ అయింది. హౌస్‌లోకి వెళ్లిన మెహరిన్, అనిల్ రావిపుడి కలిసి హారికను ఎలిమినేట్ చేశారు. మొదటగా హౌస్‌మేట్స్ అందరికి కళ్లకి గంతలు కట్టి ఎలిమినేట్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. టాప్ 5లో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సిందిగా మెహరిన్‌కు నాగ్ సూచించారు. కాసెపు అందరికి టెన్షన్ పెట్టి చివరగా హారికను ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఆ తరవాత హారిక గంతలు విప్పిన మెహ్రీన్, అనిల్.. ఆమెను తీసుకెళ్లి ఒక పంజరం లాంటి ఐరన్ రూమ్‌లోకి పంపారు. ఆ పంజరాన్ని ఒక క్రేన్ గాల్లోకి లేపుతూ బయటికి తీసుకెళ్లిపోయింది. హారిక గాల్లో ఉన్నప్పుడు మిగిలిన నలుగురు ఫైనలిస్ట్‌ల గంతలు విప్పగా దేత్తడి వెళ్లిపోవడం చూసి విస్తుపోయారు.
10 లక్షలు తిరస్కరించిన హౌస్‌మేట్స్
రెండో వ్యక్తిని ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యతను నాగ్ హీరోయిన్లు లక్ష్మీరాయ్, ప్రణీతలకు అప్పగించారు. దీంతో ఆ ఇద్దరు బ్యూటీలు బ్యాండ్ బాజాలతో ఇంట్లోకి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. మొదటగా ప్రణీత 10 లక్షలు రూపాయలు ఉన్న సూట్ కేస్‌తో వెళ్లి కంటెస్టెంట్స్‌ను టెంప్ట్ చేసే ప్రయత్నం చేశారు. రూ.10లక్షలు తీసుకొని ఎవరైనా వెళ్లొచ్చు అని ఆఫర్ ఇవ్వగా అందరూ తిరస్కరించారు. ప్రేక్షకులు మాకు ఓట్లు వేసి ఇంత దూరం తీసుకొచ్చారని, డబ్బుతో వాళ్ల ప్రేమను పొగొట్టుకోలేమని తేల్చి చెప్పారు. దీంతో ప్రణీత 10 లక్షలు తీసుకొని బయటకు వచ్చేసింది. తర్వాత హీరోయిన్ లక్ష్మీరాయ్ వెళ్లి అరియానాను ఎలిమినేట్ చేశారు.
రూ. 25 లక్షలకు సోహైల్ టెంప్ట్
టాప్ 3లో ముగ్గురు అబ్బాయిలు మిగలగా.. బిగ్‌బాస్ నుంచి సోహైల్ స్వచ్ఛందంగా ఎలిమినేట్ అయ్యాడు. నాగార్జున ఇచ్చిన రూ.25లక్షల ఆఫర్‌కు సోహైల్ టెంప్ట్ అయ్యాడు. ఇంట్లో ఉన్న అభిజిత్, అఖిల్, సోహైల్‌లో ఎవరైనా 25లక్షల రూపాయలు తీసుకొని బయటకు రావొచ్చని నాగ్ సూచించగా.. అఖిల్, అభిజిత్ తిరస్కరించారు. సోహైల్ మాత్రం తాను ఈ డబ్బును తీసుకొని వెళ్తానని చెప్పాడు. సోహైల్ నిర్ణయాన్ని అతని కుటుంబ సభ్యులు కూడా స్వాగతించారు. వచ్చిన ఆ 25 లక్షల రూపాయాల్లో ఐదు లక్షలు అనాథశ్రమానికి, మరో ఐదు మెహబూబ్ ఇల్లు కట్టుకునేందుకు ఇస్తానని చెప్పాడు. కానీ మెహబూబ్ అతడి ఆఫర్‌ను తిరస్కరిస్తూ ఆ ఐదు లక్షలు కూడా అనాథశ్రమానికే ఇచ్చేయమన్నాడు. వీరి ఆలోచన మెచ్చిన నాగ్ ఆ పది లక్షలు అనాథశ్రమానికి తాను ఇస్తానని, సోహైల్‌ను 25 లక్షలు ఇంటికే తీసుకెళ్లమని చెప్పారు.
సోహైల్ పర్మిషన్ తీసుకున్న చిరు
లక్ష్మీ రాయ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకోగా తర్వాత వచ్చిన తమన్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. అనంతరం స్వయంగా నాగార్జునే హౌస్‌లోకి వెళ్లి టాప్ 2 కంటెస్టెంట్లు అభిజిత్, అఖిల్‌ను స్టేజీ మీదకు తీసుకొచ్చారు. బిగ్‌బాస్ ట్రోఫీ ఇచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. నాగార్జున ఫిట్‌నెస్‌ను చూస్తే కుళ్లు వేస్తోందన్నారు. అలాగే పది సీజన్ల వరకు కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా ఉండాలన్నారు. ఆ తర్వాత నాగ్ జర్నీ చూపించారు. అనంతరం అభిజిత్ మీద పంచులేస్తూనే అతడి వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు. ప్రతిదాంట్లో గెలవాలన్న తాపత్రయం కనిపించేదని, ప్రేమోనాల్‌ను గెలిచేవాడని తెలిపారు. మన కథ వేరన్న డైలాగ్ తర్వాతి సినిమాలో పెడతాను, అందుకు పర్మిషన్ ఇవ్వంటూ సోహైల్‌ను అడిగారు.
అభి విన్నర్
అభిజిత్, అఖిల్‌ను స్టేజీ మీదకు తీసుకొచ్చిన నాగ్.. అభి విజయానికి సంకేతంగా అతడి చేయి పైకెత్తారు. ఇద్దరు మిత్రులు చిరు, నాగ్ కలిసి అతడికి ట్రోఫీ అందించారు. స్టైలిష్ బైక్‌ను కూడా అందజేశారు. ఈ విజయాన్ని ఊహించలేకపోయిన అభి సంతోషం కట్టలు తెంచుకుంది. తనకు ఓట్లేసిన ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలిపాడు.. 63 ఏళ్లలో ఇది తనకు గొప్ప వేడుకలాంటిదని అభిని చూసి అతడి తండ్రి గర్వపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment