
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం(డిసెంబర్ 19)సాయంత్రం జరగనున్న గ్రాండ్ ఫినాలేలో విజేతను ప్రకటించనున్నారు. దీంతో ఈ సారి ఎవరు గెలవబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. ఈ క్రమంలో బిగ్‌బాస్ విజేతపై నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
నాగార్జున, రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం బ్రహ్మాస్త్ర పోస్టర్ లాంచ్ వేడుక శనివారం హైదారాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రణబీర్ కపూర్, అలియా భట్‌లతో పాటు, హీరో నాగార్జున, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సైతం పాల్గొన్నారు. బ్రహ్మస్త్ర తెలుగు పోస్టర్‌ను నాగార్జున, రాజమౌళి ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో నాగార్జునకు వరుస బిగ్‌బాస్ షోకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. బిగ్‌బాస్ ఐదో సీజన్ విజేతగా ఎవరిని చేస్తున్నారని విలేకర్లు ప్రశ్నించగా.. నాగ్ తెలివిగా సమాధానం చెప్పాడు. మీరంతా ఎవరిని గెలిస్తే.. వాళ్లే విన్నర్ అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. హౌస్‌లో ఉన్న ఐదుగురిలో సన్నీ విజేతగా అయ్యే అవకాశాలు ఉంది. ఈ వారం అతనికే ఎక్కువ ఓట్లు వచ్చాయని అనధికారిక పోల్స్ ద్వారా తెలుస్తోంది. సన్నీ విన్నర్ కాగా, శ్రీరామ్ రన్నరప్‌గా, మూడో స్థానంలో షణ్ముఖ్, నాలుగు, ఐదు స్థానాల్లో మానస్, సిరి నిలిచారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది.