అప్పట్లో ఓ సినిమాలో ఓ విలన్ అంటాడు, నాకు నా శత్రువే కాదు, శత్రువు కుటుంబ సభ్యులు కూడా అవసరం. అలానే బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ మాత్రమే కాదు, వారికి సంబంధించిన కుటుంబసభ్యులను కూడా తన షోలో వినియోగించుకున్నాడు బిగ్ బాస్. హౌస్ లోని పార్టిసిపెంట్స్ కుటుంబసభ్యులను మాంచి డ్రామా రూపంలో దశలవారిగా పార్టిసిపెంట్స్ కు కలిపించి వారి మధ్య జరిగిన భావావేశాలను ప్రేక్షకులకు యధావిధిగా వండి వార్చాడు సదరు బిగ్ బాస్.
కుటుంబ సభ్యులను పార్టిసిపెంట్స్ కలవడం లో పెద్ద వింతేమీ లేదు కాని, ఆ పార్టిసిపెంట్స్ తో హౌస్ లో జరుగుతున్న విషయాలను బాహటంగానే కుటుంబ సభ్యులు చర్చించడం అటు పార్టిసిపెంట్స్ కు ఇటు ప్రేక్షకులకు చిన్న పాటి ఇబ్బంది కలిగింది. ముఖ్యంగా యశ్మి, ప్రేరణ, నిఖిల్, విష్ణు తదితరల పార్టిసిపెంట్స్ తమ కుటుంబ సభ్యులను కలవడంలో పడ్డ ఆనందం కన్నా ఆ తరువాత వాళ్ళతో మాట్లాడినపుడు ఎక్కువగా ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా హౌస్ లో జరిగే ప్రేమాయణాల నుండి గిల్లికజ్జాల వరకు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడటం చాలా ఎబ్బెట్టుగా ఉంది.
అంతేనా బిగ్ బాస్ ప్రేక్షకులకు ఇంత చిన్న మసాలా అయితే ఎలా సరిపోతుంది అనుకున్న బిగ్ బాస్ ఒక పార్టిసిపెంట్ ను వారమంతా ఏడిపించి వారం చివర్లో వాళ్ళ ఫ్యామిలీని కలిపించి ప్రేక్షకులకు ఓ మాంచి మసాలానే చూపించాడు బిగ్ బాస్. ఆ పార్టిసిపెంటే టేస్టీ తేజ. ఓ రకంగా చెప్పాలంటే ఈ వారమంతా బిగ్ బాస్ ఎపిసోడ్లలో ఈ తేజ ఏడుపునే అమ్ముకున్నాడు బిగ్ బాస్. అంతేనా అదే తేజను ఎలిమినేషన్లో పెట్టి నాటకీయంగా నో ఎలిమినేషన్ అని చెప్పింది ఈ వారానికి తేజకు కథ సుఖాంతం చేశాడు.
ఒక్క విషయం మాత్రం అటు ప్రేక్షకులు ఇటు పార్టిసిపెంట్స్ గుర్తు పెట్టుకోవాలి, అదేంటంటే బిగ్ బాస్ కార్యక్రమాన్ని చూడడం లేదా పార్టిసిపెంట్ చేయడమంటే కాస్త గుండె దిటవుతో ఉండాలి. ఎందుకంటే బిగ్ బాస్ తన కార్యక్రమాన్ని నార్మల్ ప్యాక్ లో చేయడు ఫ్యామిలీ ప్యాక్ తప్ప.
-ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment