గత ఏడు సీజన్లకంటే కూడా ఈసారి బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు అత్యధిక టీఆర్పీ వచ్చింది. కానీ కంటెస్టెంట్లు ఆ రేటింగ్‌ను అలాగే కాపాడుకోలేకపోయారు. నెమ్మదిగా షో బోరింగ్‌గా మారుతుండటంతో బిగ్‌బాస్ ఇక లాభం లేదనుకుని పాత సీజన్లలో పాల్గొన్న పలువురినే వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరిట హౌసులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం.. 'బిగ్‌బాస్ గ్రాండ్ రీలోడ్' పేరిట ఎపిసోడ్ ప్రసారమైంది. ఇంతకీ హౌస్‌లోకి వచ్చిందెవరో చూసేయండి..
నైనిక ఎలిమినేట్
'జవాన్' టైటిల్ సాంగ్, 'గేమ్ ఛేంజర్' నుంచి రీసెంట్‌గా రిలీజైన 'రా మచ్చా' పాటలకు స్టెప్పులేసి ఆదివారం ఎపిసోడ్‌కి హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే డేంజర్ జోన్‌లో ఉన్న మణికంఠ, విష్ణుప్రియ, నైనికని నిలబెట్టారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఎలా ఎదుర్కోబోతున్నారో ఎదుర్కోబోతున్నారని హౌస్‌మేట్స్‌ను అడగ్గా వారంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నైనిక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో సీత ఎప్పటిలాగే కన్నీటి కుళాయిని ఓపెన్ చేస్తూ బోరున ఏడ్చేసింది.
ఎవరికి ఏ ట్యాగ్?
స్టేజీపైకి వచ్చిన నైనికని హౌసులో ఎవరు ఎలాంటి వారనేది నాగ్ అడగ్గా.. ప్రేరణ మ్యానిప్యులేటర్, మణికంఠ వెన్నుపోటు పొడిచే వ్యక్తి, విష్ణుప్రియ నకిలీ స్నేహితురాలు, పృథ్వీ అటెన్షన్ సీకర్, నబీల్ అవకాశవాది, సీత నిజమైన ఫ్రెండ్, నిఖిల్ గేమ్ ఛేంజర్, యష్మిది మంద బుద్ధి అని చెప్పుకొచ్చింది.
ఉత్తరాలు వచ్చాయ్..
ఈ వారం హౌస్‌మేట్స్ కోసం ఉత్తరాలు వచ్చాయి. కానీ అవి కొందరికి అందకుండానే వెనక్కు వెళ్లిపోయాయి. వాటిని నాగ్ తిరిగి తీసుకొచ్చాడు. సీత, నబీల్, యష్మి, మణికంఠ తమ లెటర్స్ అందుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక హౌస్‌లో ఉన్న ఎనిమిది మంది ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్) టీమ్‌గా, కొత్తగా వచ్చే ఎనిమిది వైల్డ్ కార్డ్స్ రాయల్ టీమ్‌గా ఉంటాయని నాగ్ వెల్లడించాడు..
తొలి వైల్డ్ కార్డ్‌గా హరితేజ
సీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గలగలా మాట్లాడే ఈమె గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షో తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా హోస్ట్‌గానూ అవతారమెత్తింది. అఆ, యూ టర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే, హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. ఇటీవలే రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది.
యాక్టింగ్, యాంకరింగ్ రెండింట్లోనూ ఆరితేరిన ఈమె ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లో మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. తనకు నవదీప్.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న వీడియో పంపించారు. అలానే హౌసులోకి వెళ్లేముందు స్టేజీపైకి హరితేజ కూతురుని తీసుకురావడంతో ఆమె ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది.
రెండో వైల్డ్ కార్డ్‌గా టేస్టీ తేజ
తేజ అసలు పేరు తేజ్‌దీప్. తెనాలో పుట్టిపెరిగిన ఇతడు 2017లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం హైదరాబాద్‌లో సెటిలయ్యాడు. చిన్నప్పటినుంచి నటన, సినిమాలంటే ఆసక్తి ఉన్న తేజకు కరోనా సెలవులు కలిసొచ్చాయి. 2020లో వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నప్పుడు తెనాలిలో స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేశాడు. ఆ వీడియో యూట్యూబ్‌లో పెట్టగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదేదో బాగుందనిపించి హైదరాబాద్ వచ్చాక అదే కొనసాగించాడు. యూట్యూబర్‌గా తిండి వీడియోలు చేస్తూ బిజీ అయ్యాడు. అలా బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో పాల్గొన్నాడు. తొమ్మిదివారాలపాటు హౌస్‌లో ఉన్నాక షోకి టాటా బైబై చెప్పాడు. ఇప్పుడు ఎనిమిదో సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అమ్మ చేసిన పాల తాళికలను నాగార్జున కోసం తీసుకొచ్చాడు. అలానే తేజకి శోభాశెట్టి బెస్ట్ విషెస్ చెప్పింది.
మరో రూ.20 లక్షలు
సెట్‌పైకి వచ్చిన స్వాగ్ టీమ్ (శ్రీవిష్ణు, రీతూ వర్మ, దక్ష నగార్కర్) తన సినిమా కబుర్లు చెప్పింది .తర్వాత హౌస్‌లోకి వెళ్లి హౌస్‌మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్‌తో గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు హరి-తేజ గెలిచి రూ.20 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. అనంతరం మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా నయని పావని హౌస్‌లో అడుగుపెట్టింది.
మూడో వైల్డ్ కార్డ్‌గా నయని పావని
ఈమె అసలు పేరు సాయిరాజు పావని. టిక్‌టాక్ స్టార్‌గా ఫేమస్. షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్, చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి చిత్రాల్లోనూ కనువిందు చేసిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్ అయిపోయింది. అయితే నయని నెక్స్ట్ సీజన్‌లో రావడం పక్కా అనుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఈ సీజన్‌లో అడుగుపెట్టింది. కాకపోతే మరోసారి వైల్డ్‌కార్డ్ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఇక శివాజీ.. నయనికి బెస్ట్ విషెస్ చెప్పాడు.
నాలుగో వైల్డ్ కార్డ్‌గా మెహబూబ్
డ్యాన్స్, యాక్టింగ్ అంటే పిచ్చి. అందుకోసం మెహబూబ్ చేయని ప్రయత్నం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల సాఫ్ట్‌వేర్ కొలువులో చేరినా కళను వదిలేయలేకపోయాడు. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.
అలా తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో అడుగుపెట్టిన టాస్కుల్లో సత్తా చూపించాడు. కండబలం బాగానే ఉన్నా బుద్ధి బలం తక్కువగా ఉండటంతో ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగాడు. ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. ఇక మెహబూబ్ కోసం సొహైల్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలానే నాలుగో సీజన్‌లో ఎలా అయితే ఆడావో ఈసారి అంతకు మించి ఆడి గెలవాలన్నాడు.
'జనక అయితే గనక' మూవీ ప్రమోషన్‌లో భాగంగా సుహాస్, దిల్ రాజ్ టీమ్ వచ్చారు. సుహాస్, హీరోయిన్ సంగీర్తన హౌసులోకి వెళ్లి ఓజీ, రాయల్ టీమ్స్‌తో గేమ్ ఆడించారు. ఇందులో గెలిచిన సీత-మణికంఠ.. బెడ్ రూమ్, రేషన్ కంట్రోల్ చేసే అధికారాన్ని సొంతం చేసుకున్నారు.
ఐదో వైల్డ్ కార్డ్‌గా రోహిణి
ఒకప్పుడు సీరియల్స్‌లో మెప్పించిన రోహిణి.. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ రచ్చ చేస్తోంది. తన కామెడీ టైమింగ్స్‌తో అందరికీ వినోదాన్ని పంచుతోంది. ఆ మధ్య కాలు సర్జరీ వల్ల కొన్ని నెలలపాటు తెరపై కనిపించలేదు. కానీ కోలుకున్న వెంటనే మళ్లీ స్క్రీన్‌పై ప్రత్యక్షమై నవ్వుల జల్లు కురిపిస్తోంది. బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొన్న రోహిణి.. మరోసారి ఈ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఇక శివజ్యోతి.. రోహిణి కోసం స్పెషల్ వీడియో పంపింది. హౌసులో కామెడీ లోటు బాగా ఉందని, దాన్ని ఫుల్ ఫిల్ చేయాలంది.
ఆరో వైల్డ్ కార్డ్‌గా గౌతమ్ కృష్ణ
గౌతమ్ కృష్ణ.. బిగ్‌బాస్‌కు రావడానికి ముందు పలు సినిమాలు చేశాడు. కానీ జనాలకు సుపరిచితుడైంది మాత్రం బిగ్‌బాస్ ఏడో సీజన్‌తోనే! చిన్నప్పటినుంచే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ అయ్యాడు. తన కోరికను చంపుకోలేక 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. ఆ మరుసటి ఏడాది ఆకాశవీధుల్లో సినిమాకు సొంతంగా కథ రాసుకుని తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించాడు.
బాలీవుడ్‌లోనూ సిద్దూ: ది రాక్‌స్టార్ సినిమా చేశాడు. సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ డాక్టర్ బాబు గత సీజన్‌లో సీక్రెట్ రూమ్‌కు వెళ్లాడు. అశ్వత్థామ 2.0 అంటూ భారీ డైలాగులతో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫినాలే వరకు రాలేకపోయాడు. తాజాగా మరోసారి వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
ఏడో వైల్డ్ కార్డ్‌గా అవినాష్
ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న ఆశతో ఎంతోమందిలాగే ఇతడూ కృష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాకపోయినా చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా ఓ కామెడీ షోలో ఛాన్స్ రావడంతో అతడి దశ తిరిగిపోయింది. ఎనిమిదేళ్లలోనే టీం లీడర్‌గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచే మిమిక్రీలు చేసే ఈ జగిత్యాలవాసికి బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో ఆఫర్ వచ్చింది. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే.. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు.
ఆర్థిక అవసరాల వల్ల స్నేహితుల సాయం తీసుకుని మరీ ఆ డబ్బు కట్టేసి బిగ్‌బాస్‌కు వెళ్లాడు. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన అవినాష్.. 12 వారాలు హౌస్‌లో ఉండి ఎంటర్‌టైనర్ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్ 8లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడికి శ్రీముఖి ఆల్ ది బెస్ట్ చెప్పింది. అలానే స్టేజీపై మణికంఠ, నబీల్, విష్ణుప్రియలా యాక్ట్ చేసి నవ్వించాడు.
ఎనిమిదో వైల్డ్ కార్డ్‌గా గంగవ్వ
వయసైపోయాక ఏ పనీ చేతకాక ఓ మూలన కూర్చోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పని నిరూపించింది గంగవ్వ. టాలెంట్ ఉంటే ఏ వయసులోనైనా రాణించవచ్చని నిరూపించింది. జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ ఒకప్పుడు దినసరి కూలీ. కానీ ఇప్పుడు తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
తన కట్టుబొట్టు, అమాయకత్వం, గడుసుతనం.. జనాలకు నచ్చేశాయి. బిగ్‌బాస్ నుంచి పిలుపు రావడంతో నాలుగో సీజన్‌లో అడుగుపెట్టింది. స్వచ్ఛమైన పల్లెలో బతికిన మట్టిమనిషికి ఏసీలు పడలేదు. ఈ గోస నావల్ల కాదంటూ దండం పెట్టి బయటకు వచ్చేసింది. అయితే సొంతింటి కలను నెరవేర్చుకుంది. తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు మరోసారి ధైర్యం చేసి బిగ్‌బాస్ 8లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.
రాయల్ టీమ్‌కు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ టీమ్‌కు చివరగా మరో గేమ్ ఆడించారు. ఇందులో రాయల్ టీమ్ నుంచి అవినాష్, గంగవ్వ ఆడారు. ఓజీ టీమ్‌పై వీరు విజయం సాధించడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ఈ వారం ఇమ్యూనిటీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment