బిగ్ బాస్ హౌస్ లోని రెండవ వారం వాడి వేడి వాదనలతో నామినేషన్స్ అవగా మిగతా వారమంతా ఫుడ్ టాస్క్ మీద నడిచింది. ముందుగా నామినేషన్స్ గురించి చెప్పుకుందాం. హౌస్ లోని ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ గురించి చెప్పేటప్పుడు సదరు కంటెస్టెంట్ ఆటను ముందుగా పొగిడి తరువాత తన నామినేషన్ కారణాన్ని వివరిస్తూ వివాదపర్చడం విడ్డూరమనిపించింది. ఈ నామినేషన్స్ టైంలో విచిత్రంగా ప్రతి కంటెస్టెంట్ ఫైర్ అవుతున్నారు. ఇటువంటి ఫైరింగ్ నామినేషన్స్ నుండి జోవియల్ కంటేస్టెంట్ అయిన శేఖర్ భాషా ఎలిమినేట్ అవడం విశేషం.
శేఖర్ భాషా ఎలిమినేషన్ వ్యక్తిగతంగా అతను తండ్రి అవడం ఓ కారణమైతే అదే కారణాన్ని చూచాయగా చూపిస్తూ హౌస్ లోని కంటెస్టెంట్లందరూ (ఒక్క కంటెస్టంట్ తప్ప) శేఖర్ భాషా హౌస్ నుండి బయటకు వెళ్ళాలి అని బాహటంగానే నామినేట్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో చిన్న కారణమైనా పెద్దదిగా చేస్తారు. అందుకేనేమో బిగ్ బాస్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు మా బాగా నచ్చుతోంది.
ఈ సందర్భంగా ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. ఈ వారాంతం జరిగిన షోలో బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను నాగార్జున అందలం ఎక్కించారు. అదేంటంటే భారతదేశంలోని ఏ బిగ్ బాస్ షోకి రానంత ప్రేక్షకాదరణ ఒక్క తెలుగు బిగ్ బాస్ కే దక్కిందట. మొత్తంగా 6 బిలియన్ల నిమిషాల నిడివితో ఈ తెలుగు బిగ్ బాస్ షోని తెలుగు ప్రేక్షకులు చూశారట. ఇది ఒక రికార్డ్ బ్రేక్ అని నాగార్జున చెప్పుకొచ్చారు. ఈ లెక్కన మన తెలుగు ప్రేక్షకులు భారతదేశంలోనే ఉత్తమోత్తమ ప్రేక్షకులను చెప్పుకోవాలి, ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులకు విషయం కన్నా వివాదం నచ్చుతుందన్న విషయం మరోసారి నిరూపించారు.
ఇకపోతే ఫుడ్ టాస్క్ గురించి చెప్పాలంటే చాలానే చెప్పాలి. రాతి యుగంలో ఆది మానవులు ఆహారం కోసం అరాచకం చేసేవారట. ఈ విషయం మన తరం వారు ఎవ్వరూ చూసివుండరు కాని చదువుంటారు. అయితే అదే పరిస్థితి చూడాలనుకుంటే ఈ వారం బిగ్ బాస్ ఫుడ్ టాస్క్ చూసి ఆనందించవచ్చు. ఫుడ్ టాస్క్ కు సంబంధించి దీనికి మించిన వివరణ మరేదీ వుండదు. వారం వారం అంచనాలు అందుకోలేని సంచనాలతో దూసుకువెళ్తున్న ఈ బిగ్ బాస్ ప్రోగ్రాం ముందు ముందు మరెన్ని సంచనాలకు తావిస్తుందో చూడాలి.
- ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment