
ఈ వారం ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవకుండా చూసినవాళ్లకు నాగార్జున ఎవరికి క్లాస్ పీకనున్నాడనేది ముందే తెలుసు. అయితే అందరూ ఊహించినదానికన్నా రెట్టింపు స్థాయిలో నాగ్ ఫైర్ అయ్యాడు. అభయ్ నవీన్‌ను మెడ పట్టి బయటకు గెంటినంత పని చేశాడు. కానీ బూతులు మాట్లాడిన పృథ్వీని సుతిమెత్తగా మందలించడం గమనార్హం. మరి ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..

అభయ్‌కు రెడ్ కార్డ్
నాగార్జున వచ్చీరాగానే అభయ్‌ను వాయించడం మొదలుట్టాడు. మొదట బెలూన్ గేమ్ గురించి, తర్వాత బిగ్‌బాస్‌ను చులకన చేస్తూ తిట్టిన వీడియో ప్లే చేశాడు. సైకోలా ఉన్నావ్.. మనిషి పుట్టుక పుట్టావా? అన్నీ నీమాటలే అంటూ నాగ్.. అభయ్‌ను చెడుగుడు ఆడేసుకున్నాడు. బిగ్‌బాస్‌కు గౌరవం ఇవ్వకపోతే నేను సహించను. ఇది మళ్లీ రిపీట్ అవకూడదు అంటూ అభయ్‌కు రెడ్ కార్డ్ చూపించాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోమన్నాడు. దీంతో అభయ్ మోకాళ్లపై కూర్చుని తనను క్షమించమని వేడుకున్నాడు.

అభయ్ తరపున నాగార్జున క్షమాపణ..
ఒక్క ఛాన్స్ ఇవ్వండి సర్.. నేను ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు అనేది నేర్చుకోవడానికి లైఫ్‌లో దొరికిన అదృష్టం సర్ ఇది అని దండం పెట్టి బతిమాలాడు. బిగ్‌బాస్ హౌస్‌లో నేర్చుకునేవన్నీ జీవిత పాఠాలేనన్న నాగ్ ఇక్కడ బిగ్‌బాస్ కంటే ఎవరూ తోపు కాదని నొక్కి చెప్పాడు. అభయ్ తరపున నాగార్జున బిగ్‌బాస్‌కు క్షమాపణలు చెప్పాడు. ఇంట్లో వాళ్లందరూ అభయ్‌కు ఒక్క ఛాన్స్ ఇద్దామనడంతో నాగ్ శాంతించాడు.

రూ.6 లక్షలు గెలుచుకున్న లేడీస్
తర్వాత ఎగ్ టాస్క్ గురించి ప్రస్తావించాడు. లేడీస్‌లో ఎవరు బాగా ఆడారన్న ప్రశ్నకు నిఖిల్.. సీత పేరు చెప్పాడు. దీంతో నాగ్.. కానీ రెడ్ ఎగ్ మాత్రం సోనియాకు ఇచ్చావని కౌంటరిచ్చాడు. ఎగ్స్ టాస్క్ లేడీస్ అందరూ కుమ్మేశారని నాగ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. అంతేకాదు వారి పర్ఫామెన్స్ మెచ్చి ఏకంగా రూ.6 లక్షల్ని ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. దీంతో ప్రైజ్‌మనీ రూ.11,60,000కు చేరుకుంది.

క్లాస్ పీకిన నాగ్
తర్వాత ప్రేరణ, విష్ణు మధ్య గొడవను నాగ్ లేవనెత్తాడు. ముందుగా ప్రేరణ మాట్లాడుతూ..నేను పర్సనల్‌గా కనెక్ట్ అయింది విష్ణుతో! కానీ, తనను నామినేట్ చేసినప్పటి నుంచి ఆమెలో చాలా మార్పులు కనిపించాయి. నాపై ద్వేషం పెంచుకుంది. ఆ ద్వేషంతోనే గేమ్‌లో నాపై రక్కింది అని చెప్పింది. అప్పుడు.. సీతను తన్నిన, విష్ణుప్రియను క్యారెక్టర్‌లెస్ అన్న వీడియో ప్లే చేసి మరీ ప్రేరణకు నాగ్ క్లాస్ పీకాడు.

పతివ్రత..
పంపులదగ్గర కొట్టుకున్నట్లు ఆ మాటలేంటి? అని గద్దించగా ప్రేరణ.. తప్పు పదం వాడేశానని, అందుకు సారీ చెప్పానంటూనే మరోసారి క్షమాపణలు చెప్పింది. అటు విష్ణుప్రియ కూడా పతివ్రత పదం వాడిందని, మరోసారి అలాంటి పదాలు రిపీట్ కావద్దని నాగ్ హెచ్చరించాడు. గుడ్డు దగ్గరే గొడవ మొదలు కావడంతో వీళ్లిద్దరికీ కలిపి ఐదు గుడ్లు పంపించి శత్రువులను మిత్రువులు చేశారు.

ఎందుకంత సీన్ చేశారు?
తర్వాత దోస వివాదానికి చెక్ పెడుతూ ఓ వీడియో ప్లే చేశారు. అందులో ప్రేరణ.. విష్ణుకు మామూలుగానే దోస వేసి ఇచ్చింది. అడుక్కునేవారికి వేసినట్లు వేయలేదుగా.. దానికి మణి, విష్ణు ఎందుకంత సీన్ చేశారని నాగ్ అడిగాడు. మధ్యలో నువ్వు ఉండటం వల్లే ఆ గొడవ పెద్దదైందని, నీ గేమ్ నువ్వు ఆడు అని మణికి సలహా ఇచ్చాడు.

ఆడపిల్ల ఇబ్బందిపడితే..
తర్వాత అతడిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి తన హగ్గుల వల్ల యష్మి ఇబ్బందిపడుతున్న విషయాన్ని వీడియో ద్వారా చూపించారు. నీ వల్ల ఆడపిల్ల ఇబ్బందిపడితే బయటకు పంపించేస్తానని నాగ్ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఈ షోకి ఎందుకు వచ్చావన్నది గుర్తుపెట్టుకుని ఆడమని చెప్పాడు. ఒక్క యష్మి విషయంలోనే కాదని, ఇది చాలాసార్లు రిపీట్ అవుతోందని తెలిపాడు.

తప్పు తెలుసుకున్న మణి
మొత్తానికి తప్పు తెలుసుకున్న మణి.. ఇంకోసారి అలా జరగదని మాటిచ్చాడు. కొత్తగా చాలామంది ఫ్రెండ్స్ అయ్యేసరికి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయానన్నాడు. పృథ్వీకి తన కోపమే బలహీనతగా మారిపోతుందని, బూతులు తగ్గించుకోవాలన్నాడు. వరుసగా చీఫ్ అవుతున్న నిఖిల్‌ను అభినందించాడు.




Comments
Please login to add a commentAdd a comment