నన్ను ఛీ, తూ అని బయటకు గెంటేసినవారికి ఇప్పుడు చెప్తున్నా: కీర్తి | Bigg Boss Telugu 6: Keerthi Bhat Emotional Words | Sakshi
Sakshi News home page

నేను బాగాలేనని, వద్దనుకుని బయటకు గెంటేశారు.. కీర్తి ఎమోషనల్‌

Published Wed, Dec 14 2022 11:53 PM | Last Updated on Wed, Dec 14 2022 11:58 PM

Bigg Boss Telugu 6: Keerthi Bhat Emotional Words - Sakshi

Bigg Boss 6 Telugu, Episode 102: రేవంత్‌, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్‌లు వారి జర్నీలు చూసి గాల్లో తేలిపోతున్నారు. ఈరోజు శ్రీహాన్‌, కీర్తిల వంతు వచ్చింది. మొదటగా శ్రీహాన్‌ గార్డెన్‌ ఏరియాలోకి వచ్చాడు. అప్పుడే అతడి తల్లి ఫోన్‌ చేసి బిగ్‌బాస్‌కు వెళ్లాలన్న కోరిక ఎలాగో నెరవేరింది. ఇక ట్రోఫీ గెల్చుకుని రా అని కొడుకును ప్రేమగా కోరింది. తప్పకుండా టైటిల్‌ కొట్టే వస్తానని ధీమాగా చెప్పాడు శ్రీహాన్‌. 

బిగ్‌బాస్‌ శ్రీహాన్‌తో మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్‌ ప్రయాణంలో ఎన్ని భావోద్వేగాలు ఉంటాయో ఆట కోసం, గెలుసు కోసం సభ్యులు పడే తపన ఎలాంటిదో మునుపటి సీజన్‌లో దగ్గరి నుంచి చూశారు. ఈసారి స్వయంగా ఆ అనుభవాన్ని పొందేందుకు హౌస్‌లో అడుగుపెట్టారు. అందరితో సరదాగా ఉండటం, అవసరమొచ్చినప్పుడు ఎవరినైనా ఎదురించడం.. ఈ రెండూ మీలో ఉన్నాయి. మీలోని అల్లరి మీకు స్నేహితులను తీసుకొచ్చింది. కలిసి మీరు చేసిన వినోదం నవ్వులను పంచింది. వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది మాటలు మాత్రమే కాదు, చేతలు కూడా అనే విషయం మీకు బాగా తెలుసు.

మీరు తోటి ఇంటిసభ్యుల కోసం నిలబడ్డ తీరు స్నేహానికి మీరిచ్చే విలువను తెలుపుతుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన శ్రీహాన్‌ తన స్నేహితుల కోసం తగ్గారు. ఆట ఎలా ఆడాలో తెలుసుకుని అదే స్నేహితులతో పోటీపడి టికెట్‌ టు ఫినాలే నెగ్గారు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు మీరొక సేఫ్‌ ప్లేయర్‌ అనిపించినా వారి మాటలకు మీ ఆటతో సమాధానం చెప్పారు. సోషల్‌ మీడియా నుంచి ఎదిగి సాధ్యమైనంత ఎక్కువమందికి వినోదం పంచడానికి ఇతర సభ్యుల సహకారం లేకుండా మీకు మీరుగా అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రయత్నించిన తీరు అందరికీ నచ్చింది. ఆ విషయమే మిమ్మల్ని ఇక్కడివరకూ తీసుకొచ్చింది.

మీ పొరపాట్లు మీ రెండు వారాలు కెప్టెన్సీ దూరమయ్యేలా చేశాయి. ఎత్తుపల్లాలతో సాగే ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా గడిపిన క్షణాలు గార్డెన్‌లో మీరు దించుకున్న గుండె బరువును బిగ్‌బాస్‌ విన్నారు. ఇంట్లో వారితో మాట్లాడే వచ్చే బలం ఎంతో అని తెలిసినా ఆ అవకాశాన్ని తోటిసభ్యుల కోసం వదులుకున్నారు. పట్టుకోవడంలోనే కాదు వదిలేయడంలో కూడా బలముంటుంది. దాంతో ఏదైనా సాధించొచ్చు. మీ బలాన్ని, వినోదాన్ని, పట్టుదలను ఇలాగే కొనసాగించి అనుకున్నవన్నీ సాధించాలని బిగ్‌బాస్‌ కోరుకుంటున్నాడు అని చెప్పాడు. ఇది విన్న శ్రీహాన్‌ నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు అంటూ ఎమోషనలయ్యాడు.

తర్వాత కీర్తి గార్డెన్‌ ఏరియాలోకి వచ్చింది. ఇంతలో ఫోన్‌ రింగైంది. అవతలి నుంచి మానస్‌ మాట్లాడుతూ.. 'ఒళ్లు హూనమైపోతున్నా, వేలికి ఫ్రాక్చర్‌ అయినా, సాఫ్ట్‌ టార్గెట్‌ అనుకుని నామినేట్‌ చేసినా ఎక్కడా బెదరకుండా ఆడిన ఆట చూసి నాకే కాదు లోపలున్న హౌస్‌మేట్స్‌కు, బయటున్న ప్రేక్షకులకు మబ్బులు వదిలిపోయాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో నీలాంటి కూతురు ఉంటే చాలు, ఇం​కేం అవసరం లేదనుకునేలా చేశారు. అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని, అన్నింటిలో ముందుంటారని నిరూపించావు. ఈ సీజన్‌లో ఫస్ట్‌ లేడీ కెప్టెన్‌ అయ్యావు, అలాగే ఫస్ట్‌ లేడీ విన్నర్‌ అవ్వాలని అందరం కోరుకుంటున్నాము' అని చెప్పి ఆమె పెదాలపై ఆత్మస్థైర్యంతో కూడిన నవ్వులు పూయించాడు.

తర్వాత బిగ్‌బాస్‌ మాట్లాడుతూ.. 'కీర్తి, కల్పితం కన్నా నిజ జీవితం ఎంతో నాటకీయమైనది. ఒకవైపు మీ బరువైన గతం మిమ్మల్ని లోపలి నుంచి దహిస్తుంటే కణకణమండే కొడవలిలా జీవితంపై దండయాత్ర చేసేందుకు మీరు చూపించిన గుండె నిబ్బరం ఎంతోమందికి స్ఫూర్తి. అడవిలో మహావృక్షం ఒకటే ఉంటుంది. అది తాను ఒంటరినని బాధపడి తల వంచితే ఆకాశం తాకే తన ఎదుగుదలను చూడలేదు. మీకుగా సంపాదించిన పేరు, ప్రేమను ఎన్నో రెట్లు చేయడానికి బిగ్‌బాస్‌ ఇంట్లోకి అడుగుపెట్టారు. మొదటినుంచీ మొండిధైర్యాన్ని చూపిస్తూ వచ్చారు. ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కనపడక కలవరపడ్డారు. మీదంటూ ఒక కుటుంబం లేదని బాధపడ్డారు. భాష మీ భావాలను వ్యక్తపరిచేందుకు పరిమితిగా మారినా మీ కన్నీళ్లు మనసులోని భావాలను దాచలేకపోయాయి. కొన్నిసార్లు ఇంట్లో పరిస్థితులు మీరెంత బలమైనవారో మర్చిపోయేలా చేసినట్లనిపించింది.

సింపతీ కోసమే మీ ప్రయత్నం అని మిగతావారు నిందించినప్పుడు మీ మనసు గాయపడింది. మీరనుకున్న విషయాన్ని బలంగా వినిపించినా మద్దతు తెలిపే స్నేహితులు లేక నిరాశ చెందారు. కానీ మీ ఆట ఆగలేదు. గాయాలు మిమ్మల్ని ఆపలేకపోయాయి. అన్నింటినుంచీ తేరుకుని మొదటి ఫీమేల్‌ కెప్టెన్‌గా నిలిచారు. పద్నాలుగు వారాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత గ్రాండ్‌ ఫినాలేకు చేరాలనే కోరిక సాధ్యమవడానికి కారణం మీ ఒక్కరు మాత్రమే కాదు, మీ కుటుంబం కూడా! ఎందుకంటే ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల సంఖ్య ఒకటి కాదు కొన్ని లక్షలు.. అని ముగించాడు. బిగ్‌బాస్‌ మాటలతో కీర్తి పులకరించపోయింది. 'ఈ రోజు నా జీవితంలో గుర్తుండిపోతుంది. ఎవరైతే నన్ను ఛీ,తూ అన్నారో, నువ్వు చూడటానికి బాగోలేవు అంటూ బయటకు గెంటేశారో వారికి నేనీరోజు చెప్తున్నాను. ఇదీ కీర్తి.. ఈరోజు నా పేరెంట్స్‌ ఆత్మకు శాంతి దొరుకుతుందని భావిస్తున్నాను. ఇన్నాళ్లకు నేను మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను. నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాను' అంది కీర్తి.

చదవండి: బిగ్‌బాస్‌ 6 విజేత ఎవరో తెలుసా?
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement