బీబీ ఇంటికి దారేది గేమ్‌లో ఎల్లో టీమ్ ఎటూ కాకుండా పోయింది. కనీసం కంటెండర్లు కూడా అవలేకపోయారు. రెడ్ టీమ్‌లో నుంచి ఒకరు, గ్రీన్, బ్లూ టీమ్ నుంచి ఇద్దరు చొప్పున కంటెండర్లు అయ్యారు. ఇదిలా ఉంటే అవినాష్, రోహిణి వల్లే ఇంటిసభ్యులు పస్తులుండకుండా తినగలిగారు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 31)ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..
ఏడుపు అనేది నా ఎమోషన్
గేమ్‌లో కావాలనే ఏడ్చావ్ అంటూ యష్మిపై సెటైర్లు వేశాడు నిఖిల్. ఆ జోకుల్ని సరదాగా తీసుకోలేకపోయిన యష్మి నేను కష్టపడి ఆడాను.. ఏడుపు అనేది నా ఎమోషన్ అని సీరియస్‌గా బదులిచ్చింది. దీంతో నిఖిల్ చివరకు సారీ చెప్పాల్సి వచ్చింది. ఇకపోతే కిచెన్‌లో వంట చేసుకునేందుకు బిగ్‌బాస్ టైం కండీషన్ పెట్టిన సంగతి తెలిసిందే కదా! ఈరోజు వంట చేస్తుండగానే ఆ సమయం ముగియడంతో బిగ్‌బాస్ ఉన్నఫళంగా గ్యాస్ ఆఫ్ చేశాడు.
ఆ ఇద్దరిల్లే అందరికీ భోజనం..
దీంతో వంట చేసేదెలాగా? అని హౌస్‌మేట్స్ కంగారుపడ్డారు. అంతలోనే బిగ్‌బాస్.. ఆ టైం యాడ్ చేయాలంటే అవినాష్, రోహిణి చిన్న పిల్లలుగా మారి నవ్వించాలన్నాడు. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది వీళ్లిద్దరికీ కొట్టిన పిండి కావడంతో పిల్లల్లా కాదు ఏకంగా చిచ్చర పిడుగుల్లా మారిపోయారు. వీరి వినోదాన్ని చూసి ముచ్చటపడిపోయిన బిగ్‌బాస్ కిచెన్ టైమర్‌కు రెండు గంటలపాటు టైం యాడ్ చేశాడు. దీంతో కంటెస్టెంట్లు వంట చేసుకుని తినగలిగారు.
గౌతమ్ అవుట్
ఇక బీబీ ఇంటికి దారేది టాస్క్‌లో తాడోపేడో అని చివరి ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో నిఖిల్ తన బ్లూ టీమ్‌ను గెలిపించాడు. బ్లూ టీమ్ లీడర్ హరితేజ రెండు సార్లు డైస్ రోల్ చేసే ఛాన్స్ పొందింది. అలా డైస్ ద్వారా వచ్చిన మూడు పాయింట్లను నిఖిల్‌కు ఇవ్వగా ఐదు పాయింట్లు తనకు ఇచ్చుకుంది. వీరికి రెండు ఎల్లో కార్డ్స్ రాగా.. అందులో ఒకటి రెడ్ టీమ్‌కు, మరొకటి గ్రీన్ టీమ్‌కు ఇచ్చారు. అలా రెడ్ టీమ్ నుంచి గౌతమ్, గ్రీన్ టీమ్ నుంచి విష్ణుప్రియ ఆటలో నుంచి వైదొలిగారు.
కరివేపాకులా తీసిపారేసిన గంగవ్వ
గేమ్ నుంచి అవుట్ అవడంతో గౌతమ్ డీలా పడిపోయాడు. అదే విషయం విష్ణుప్రియ.. గంగవ్వతో చెప్తే.. అతడికేమైనా మెంటలా? ఎక్కువ ఆవేశపడతాడు. బిత్తిరి అంటూ.. కూరలో కరివేపాకులా తీసిపారేసింది. ఇక బీబీ ఇంటికి దారేది టాస్క్‌లో బీబీ ఇంటికి చేరువైన హరితేజ, నిఖిల్, అవినాష్, నబీల్, ప్రేరణ, తేజను కంటెండర్లుగా ప్రకటించారు. వీరికి తిరుగుతూనే ఉండు- గెలిచేవరకు అనే గేమ్ పెట్టాడు. ఇందులో పోటీదారులు బ్యాగులు ధరించి సర్కిల్‌లో తిరుగుతూ ఉండాలి.
ఏడ్చేసిన తేజ
ఫస్ట్ రౌండ్‌లో హరితేజ బాగానే ఆడింది కానీ తన బ్యాగు ఎక్కువ ఖాళీ అవడంతో ఆమె ఆటలో నుంచి అవుట్ అయింది. ఆటలో ఎన్నోసార్లు కింద పడుతూ లేస్తూ ఫైట్ చేసిన తేజ నెక్స్ట్ అవుట్ అయ్యాడు. దీంతో హర్టయిన తేజ.. తనకు స్టామినా ఉంటే బాగుండేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తయింది. ఇకపోతే ఈ గేమ్‌లో ఫైనల్ వరకు అవినాష్ నిలిచి మెగా చీఫ్ పదవి గెలిచాడని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment