కష్టపడు.. ఫలితం ఆశించకు అంటుంటారు. కానీ బిగ్‌బాస్ షోలో ఫలితం ఆశించి కష్టపడ్డా కొన్నిసార్లు ప్రతిఫలం దక్కదు. ఈ సీజన్‌లో వైల్డ్ ఫైర్‌లా మారిన గౌతమ్ కృష్ణ గత సీజన్‌లోనూ పాల్గొన్నాడు. అప్పుడు కూడా గ్రూప్ గేమ్స్ జోలికి వెళ్లకుండా సోలో బాయ్‌లా ఆడాడు. అయితే కొన్నిసార్లు నువ్వెంత ప్రయత్నించావన్నదానికి బదులు ఎన్ని గెలిచావన్నదే చూస్తారు. ఈ విషయంలో గౌతమ్ వెనకబడిపోయాడు.
బెడిసికొట్టిన అశ్వత్థామ బిరుదు
కానీ శివాజీ కపట నాటకాన్ని వేలెత్తి చూపించి హైలైట్ అయ్యాడు. అయితే బిగ్‌బాస్‌కు కూడా కొందరు ఫేవరెట్స్ ఉంటారు. వాళ్లనేమైనా అంటే ఆ కంటెస్టెంట్ గేటు బయట ఉండాల్సిందే! హోస్ట్ నాగార్జున కూడా అతడి నోరు నొక్కేసి నానామాటలన్నారు. చివరకు 13వ వారంలో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. అశ్వత్థామ 2.0 అంటూ తనకు తాను ఇచ్చుకున్న బిరుదు కూడా జనాలకు రుచించలేదు, ట్రోల్ చేశారు.
దారి తప్పిన గౌతమ్
అయితే ఎక్కడ తగ్గాడో అక్కడే నెగ్గాలనుకున్నాడు. మళ్లీ బిగ్‌బాస్ 8లో అడుగుపెట్టాడు. ఈసారి ఏదేమైనా వెనక్కు తగ్గకూడదని బలంగా ఫిక్సయ్యాడు. కానీ వచ్చినవారంలోనే క్రష్ అంటూ యష్మిపై ఫీలింగ్స్ బయటపెట్టడంతో జనం అతడిని తిరస్కరించాడు. వెంటనే ఎక్కడ తప్పు చేశానన్నది గ్రహించి తనను మార్చుకున్నాడు. కేవలం ఆటపైనే దృష్టిసారించాడు. తప్పు జరుగుతుంటే వేలెత్తి చూపించాడు.
ఆ ఒక్క మాటతో విపరీతమైన నెగెటివిటీ
గ్రూప్ గేమ్స్ తప్పు కాదని హోస్ట్ చెప్తున్నా సరే అది తప్పని వాదించాడు. అతడి గుండెధైర్యానికి జనాలు ఫిదా అయ్యారు. అతడి ప్రవర్తన, మాటతీరుకు సెల్యూట్ చేశారు. గెలుపు ఖాయం అనుకుంటున్న సమయంలో నిఖిల్‌పై అనవసరంగా నోరు జారాడు. అమ్మాయిలను వాడుకుంటున్నావ్ అనడంతో గౌతమ్‌పై ఉన్న పాజిటివిటీ కాస్త తగ్గిపోయింది. అది ఎంత పెద్ద మాట అని నాగార్జున చెప్తున్నా కూడా అతడికి చెవికెక్కలేదు. వివరణ ఇస్తూనే పోయాడు. ఈ వ్యవహారం అతడికి మైనస్ అయింది.
సెటైర్.. అంతలోనే ప్రశంస
గౌతమ్ ఎదుటివారు చెప్పేది వినిపించుకోకుండా తన పాయింట్స్ తను చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు. ఫినాలేలో గౌతమ్ తండ్రి కూడా అలా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. అది చూసిన నాగ్.. ఎవరైనా మాట్లాడుతుంటే వినకుండా నీ వర్షన్ నువ్వు చెప్పే క్వాలిటీ మీ తండ్రి నుంచే వచ్చిందా? అని సెటైర్ వేశాడు. అయితే ఎక్కువగా తన చేతిలో తిట్లు తినే గౌతమ్‌ను చిట్టచివరిసారి మెచ్చుకున్నాడు నాగార్జున. గౌతమ్‌ను రన్నరప్‌గా ప్రకటించినప్పుడు.. గర్వించే కొడుకును కన్నారంటూ అతడి పేరెంట్స్‌ను ప్రశంసించాడు. అది చూసిన ఫ్యాన్స్.. ఇది కదా సక్సెస్ అంటే, నువ్వు జనాల మనసులు గెలిచేశావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment