రియాలిటీ షో అంటేనే రియల్/నిజ స్వరూపం చూపించడం. ఎలా ఉంటున్నాం? ఎలా మాట్లాడుతున్నాం? ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం? భావోద్వేగాలను ఎలా నియంత్రించుకుంటున్నాం? ఇలా అన్నీ తెల్లకాగితంలా జనాలకు చూపించాలి. నచ్చినవాళ్లు ఓటేస్తారు, నచ్చనివాళ్లు లెక్క చేయరు .
రియల్ ఎంటర్‌టైనర్స్
ఎలాంటి ముసుగు లేకుండా స్వచ్ఛంగా ఉంటూ నలుగుర్ని నవ్వించేవారే రియల్ ఎంటర్‌టైనర్స్! కానీ ఇప్పటివరకు తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ప్రేక్షకుల్ని నవ్వించి కప్పు ఎగరేసుకుపోయినవాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. టాస్కులు ఆడినవారు లేదా సింపతీ సాధించినవారు, ఆల్‌రెడీ ఫ్యాన్‌బేస్ ఉన్నవాళ్లే విజేతలుగా నిలుస్తూ వస్తున్నారు తప్ప కమెడియన్లు కప్పు అందుకున్న దాఖలాలే లేవు.
ఆ ఒక్కటి లేకపోతే అసంపూర్ణమే!
అసలు వీళ్లు లేకపోతే బిగ్‌బాస్ షోనూ ఎవరూ పట్టించుకోరు. అన్నీ ఉన్నా వినోదం లేకపోతే అది సంపూర్ణంగా ఉండదు. అందుకే ఈ సీజన్‌లో రీలోడ్ పేరిట వైల్డ్‌కార్డ్స్‌ను దింపారు. ఇందులో ఎంటర్‌టైనర్స్ రోహిణి, అవినాష్, తేజ ఉన్నారు. ఫిజికల్ టాస్కులే కాకుండా బుర్రకు పదునుపెట్టే టాస్కుల్లోనూ ఒక అడుగు ముందే ఉన్నారు. వెనకాల గోతులు తవ్వడం, చాడీలు చెప్పడం, కావాలని గొడవపెట్టుకోవడం వంటి ఎన్నో అవలక్షణాలకు వీరు దూరంగా ఉన్నారు. ఈ లెక్కన విజేతగా నిలవడానికి ఆస్కారం ఉన్నవారు!
టాప్ 5 మాత్రమేనా?
కానీ రియాలిటీలో అది జరగడం లేదు. నిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వీడియో మెసేజ్‌లో నువ్వు టాప్ 5లో ఉండాలి అని తేజకు అతడి పేరెంట్స్ చెప్పారు. విన్నర్ అనకుండా టాప్ 5 అని ఎందుకన్నారు? అని తేజ అమాయకంగా రోహిణిని అడిగాడు. అప్పుడు రోహిణి కప్పు ఎలాగో రాదని తెలుసుగా.. అందుకే టాప్ 5 అన్నారు. మన పర్సనాలిటీలకు కప్పు రావురా.. ఏదో ఆడుకుంటూ వెళ్లిపోవడమే! నామినేషన్స్‌లో మేనరిజం చూపిస్తూ అరవడంలాంటివేమీ మనం చేయలేము అని చేదు సత్యాలను వివరించింది.
కమెడియన్ విన్నర్ కాకూడదా?
అందుకు తేజ.. ఎంటర్‌టైనర్లను ప్రేక్షకులు విన్నర్లుగా చూడరు అని అభిప్రాయపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కమెడియన్ విన్నర్ కాకూడదా? అన్న చర్చ మొదలైంది. జనాల్లోనూ ఈ ఆలోచన వస్తే ఎంటర్‌టైనర్లకు మంచి రోజులు వచ్చినట్లే!
Comments
Please login to add a commentAdd a comment