
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జయంత్ సావర్కర్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన థానేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కౌస్తుభ్ సావర్కర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వయసు 87 ఏళ్లు కాగా.. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా.. జయంత్ సావర్కర్ ఎక్కువగా హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు.
తండ్రి మరణంపై కౌస్తుభ్ సావర్కర్ మాట్లాడుతూ..'10-15 రోజుల క్రితం థానేలో లో బీపీకి గురి కావడంతో ఆసుపత్రిలో చేర్చాం. గత రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. కోలుకోలేక ఇవాళ ఉదయం 11 గంటలకు మరణించారు. అని చెప్పారు.
జయంత్ సావర్కర్ మరాఠీ, హిందీ సినిమాలు, టెలివిజన్‌లో దాదాపు ఆరు దశాబ్దాల పాటు నటించారు. "హరి ఓం విఠల", "గద్బద్ గోంధాల్", "66 సదాశివ్", "బకాల్", "యుగ్ పురుష్", "వాస్తవ్", "సింగం" వంటి సినిమాలు కూడా ఉన్నాయి. సావర్కర్ మొదట మరాఠీ బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. ప్రముఖ నాటక రచయిత విజయ్ టెండూల్కర్ తెరకెక్కించిన రంగస్థల నిర్మాణం "మనుస్ నవాచే బెట్"లో ఛాన్స్ వచ్చింది. కాగా.. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment