కాన్సెప్ట్ కొత్తగా ఉండి, సినిమాను ఆడియన్స్ వసూళ్ల రూపంలో మెచ్చుకుంటే ఆ కాన్సెప్ట్‌ను ముందుకు తీసుకువెళ్లే ఆలోచన చేస్తుంటారు దర్శక–నిర్మాతలు. కథను కొనసాగించడానికి అవకాశం ఉంటే, అది ఓ సిరీస్‌లా కూడా మారుతుంది. ప్రస్తుతం హిందీలో కొన్ని హిట్ చిత్రాలకు ‘పిక్చర్ అభీ బాకీ హై’ (సినిమా ఇంకా ఉంది) అంటూ సీక్వెల్స్ రానున్నాయి. ఆ చిత్రాలపై ఓ లుక్కేద్దాం. పిక్చర్ అభీ బాకీ హై! బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్‌లో 2012లో వచ్చిన ‘ఏక్తా టైగర్’ సూపర్‌హిట్. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత ఐదేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘టైగర్ జిందా హై’ సినిమా చేశారు సల్మాన్. కాన్సెప్ట్‌పరంగా ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా ఈ సినిమా హిట్టే.
ఇప్పుడు టైగర్ ఫ్రాంచైజీలో ‘టైగర్ 3’ సెట్స్ మీద ఉంది. మనీష్ శర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఏక్తా టైగర్, టైగర్ జిందా హై సినిమాల్లో జంటగా నటించిన సల్మాన్, కత్రినా కైఫ్ ఈ సినిమాలో కూడా జోడీగా నటిస్తున్నారు. ఇక మరో బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం ఒకేసారి రెండు సీక్వెల్స్ చేస్తున్నారు. ‘సత్యమేవ జయతే 2’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’ చిత్రాల్లో నటిస్తున్నారు జాన్. 2018లో ఆయన నటించిన ‘సత్యమేవ జయతే’ చిత్రం బంపర్‌హిట్ సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘సత్యమేవ జయతే 2’ ఈ ఏడాది మే 13న విడుదల కానుంది. ఇందులో జాన్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిలప్ జవేరియే రెండో భాగాన్ని కూడా తెరకెక్కించారు.
మోహిత్ సూరి డైరెక్షన్‌లో జాన్ అబ్రహాం, అర్జున్ కపూర్, దిశా పటానీ, తారా సుతారియా మెయిన్ లీడ్ రోల్స్‌గా రానున్న ‘ఏక్ విలన్’ (2014) సీక్వెల్ ‘ఏక్ విలన్ రిటర్న్స్’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న విడుదల కానుంది. 2018లో జాతీయ అవార్డు సాధించిన హిందీ చిత్రం ‘బదాయీ హో’కు స్వీకెల్‌గా ‘బదాయీ దో’ రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్‌లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా... ‘బదాయీ దో’లో రాజ్‌కుమార్ రావ్ హీరో. భూమీ ఫడ్నేకర్ హీరోయిన్. పోలీసాఫీసర్‌గా రాజ్‌కుమార్ రావ్, పీఈటీ టీచర్‌గా భూమీ ఫడ్నేకర్ కనిపిస్తారు. దాదాపు పన్నెండేళ్ల క్రితం ప్రియాంకా చోప్రా, జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్‌ల ‘దోస్తానా’ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడు నవ్వించే బాధ్యతను కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్, లక్ష్య తీసుకుని, కోలిన్ డైరెక్షన్‌లో ‘దోస్తానా 2’ను రెడీ చేస్తున్నారు.
అలాగే కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న మరో సీక్వెల్ ‘భూల్ భులయ్యా2’... అదేనండీ... మన రజనీకాంత్ ‘చంద్రముఖి’ సినిమాను హిందీలో అక్షయ్‌కుమార్ హీరోగా ‘భూల్ భులయ్యా’గా తీశారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘భూల్ భులయ్యా 2’ వస్తోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్, టబు, కియారా అద్వానీ మెయిన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. రెట్టింపు ‘హంగామా’ (2003)తో ‘హంగామా 2’ను రెడీ చేస్తున్నారు దర్శకుడు ప్రియదర్శన్. ఈ ‘హంగామా 2’ సినిమాతో ప్రణీత బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. పరేష్ రావల్, శిల్పాశెట్టి, జెఫ్రీ ‘హంగామా 2’లో నటించిన ఇతర ముఖ్యతారాగణం. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి మరోసారి రెడీ అయిపోయారు ‘బంటీ ఔర్ బబ్లీ’. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ నటించిన తాజా ‘బంటీ ఔర్ బబ్లీ 2’లో సైఫ్ అలీఖాన్, రాణీ ముఖర్జీ, సిద్ధార్థ్ చతుర్వేది నటించారు.
తెలుగు హిట్ మూవీ ‘పరుగు’ హిందీ రీమేక్ ‘హీరో పంతి’తో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన టైగర్ ష్రాఫ్ రీసెంట్‌గా ‘హీరో పంతి 2’ను అనౌన్స్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 3న రిలీజ్ కానుంది. ‘లవ్ సెక్స్ ఔర్ ధోకా’ సినిమా విడుదలై 11 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ మూవీ సీక్వెల్‌ను ప్రకటించారు నిర్మాత ఏక్తా కపూర్. హృతిక్ రోషన్ స్టార్‌డమ్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిన సినిమా ‘క్రిష్’. ఈ సిరీస్‌లో ‘క్రిష్ 4’ను 2018లో అనౌన్స్ చేశారు హృతిక్. కానీ ఆయన తండ్రి, దర్శకుడు రాకేష్ రోషన్ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంది. ఈ సీక్వెల్స్‌తో పాటుగా ‘ఫుక్రే’ ఫ్రాంచైజీలో ‘ఫుక్రే 3’, ధర్మేంద్ర ‘అప్నే’ సినిమాకు సీక్వెల్‌గా ‘అప్నే 2’, ‘ఆంఖేన్ 2’ వంటి సీక్వెల్స్ వెండితెరపైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి
Comments
Please login to add a commentAdd a comment