రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'యానిమల్'. గతేడాది డిసెంబర్ 1న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం విడుదలై నెల రోజులవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ సైతం ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. తాజాగా ఈ మూవీపై ఇప్పటికీ మరో డైరెక్టర్ కరణ్ జోహార్ ప్రశంసలు కురిపించారు. 2023లో తాను చూసిన వాటిలో యానిమల్ బెస్ట్ మూవీ అంటూ కితాబిచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కరణ్ జోహార్ యానిమల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. చాలామంది నా వద్దకు వచ్చి నువ్వు రాకీ ఔర్ రాణి సినిమా తీశారు కదా.. అది యానిమల్ వంటి చిత్రానికి టీకా లాంటిదేనా అని ప్రశ్నించారు.
దీనిపై కరణ్ స్పందిస్తూ..'నేను మీతో విభేదించలేను. ఎందుకంటే యానిమల్ 2023లో నా ఉత్తమ చిత్రంగా నేను భావిస్తున్నాను. ఈ ప్రకటన చేయడానికి నాకు కొంత సమయం పట్టింది. కానీ ఇలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే మన చుట్టు ప్రజలు ఉన్నప్పుడు.. మనం చెప్పే తీర్పు గురించి భయం ఉంటుందని చెప్పారు.
అంతే కాకుండా యానిమల్ మూవీని తాను రెండుసార్లు చూశానని అన్నారు. మొదట ఆ సినిమాను ఒక ప్రేక్షకుడిగా.. రెండోసారి సినిమాను అధ్యయనం చేసేందుకు చూసినట్లు తెలిపారు. సినిమా సక్సెస్‌ని గేమ్ చేంజర్‌గా అభివర్ణించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతోపాటు రాణీ ముఖర్జీ, తాప్సీ పన్నులాంటి వాళ్లు పాల్గొన్న రౌండ్ టేబుల్ మీట్‌లో కరణ్ ఇలాంటి కామెంట్స్ చేశారు. యానిమల్ చూసి తాను కంటతడి పెట్టినట్లు తెలిపాడు. ఈ మూవీ సక్సెస్ సందీప్ రెడ్డి వంగా ఎంచుకున్న కథపై నమ్మకమే ప్రధాన కారణమని కరణ్ జోహార్ ప్రశంసించారు.
సినిమా క్లైమాక్స్ గురించి కరణ్ మాట్లాడుతూ..'చివర్లో రణబీర్ కపూర్, బాబీ డియోల్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వెనుక ఆ సాంగ్ వస్తుంటుంది. ఆ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అక్కడంతా రక్తమే కనిపించింది. అప్పుడు నాకనిపించింది ఏంటంటే.. నాలో ఏదైనా లోపం ఉండాలి.. లేదంటే అతనిలో అయినా ఉండాలి. కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరం. సందీప్ సినిమా చూసి నా దిమ్మదిరిగిపోయింది' అని అన్నారు. బంధాలను, సంప్రాదాయలను పక్కన పెట్టి తీసిన సినిమా యానిమల్ అని.. అందుకే తనకు నచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్,త్రిప్తి డిమ్రీ కీలకపాత్రల్లో కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 850 కోట్ల మార్క్‌ను దాటేసింది.
Comments
Please login to add a commentAdd a comment