సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్. కామెడీకి మించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఏం ఉంటుంది? ఎంత సీరియస్ సినిమా అయినా.. అందులో కాసింత కామెడీ లేకపోతే ఆడియన్స్ సహించరు. అందుకే ఆనాటి నుంచి నేటి వరకు కామెడీకీ, కమెడియన్స్‌కి మన దర్శకులు పెద్ద పీట వేస్తున్నారు. కమెడియన్స్ వల్లే సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. సీరియస్ కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో సీరియస్ సినిమాలు ఎక్కువైయ్యాయి. దీంతో కమెడియన్స్ కూడా తమ రూటు మర్చారు. తమదైన హాస్యంతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యే గిలిగింతలు పెట్టిన కమెడియన్స్.. ఇప్పుడు భయపెడుతున్నారు.. ఏడిపిస్తున్నారు. నవరసాలను పండిస్తూ ‘వావ్’ అనిపిస్తున్నారు.
నవ్వుకు బ్రేక్ ఇచ్చిన బ్రహ్మీ
దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు విరామం లేకుండా తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు బ్రహ్మానందం. ఆయన పేరు విన్నా..ఫొటో చూసినా నవ్వు రావాల్సిందే. సోషల్‌మీడియా ప్లాట్ ఫామ్స్ లో కనిపించే ఫన్నీ మీమ్స్ బ్రహ్మానందం ప్రస్తావన లేకుండా ఉండవంటే అతిశయోక్తి కాదు. అంతలా కామెడీ పండించిన బ్రహ్మీ.. సడెన్‌గా నవ్వుకు బ్రేక్ ఇచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’లో చక్రపాణిగా సీరియస్ పాత్రలో నటించి తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బ్రహ్మానందంలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకుంటారు. ఇన్నాళ్లు తనదైన కామెడీతో నవ్వించిన బ్రహ్మానందం..‘రంగమార్తాండ’తో ప్రేక్షకులను ఏడిపించాడు.
భయపెట్టిన సునీల్
భీమవరం యాసతో అందరిని నవ్విస్తూ స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు సునీల్. టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరితో కలిసి నటించి, తనదైన మార్కు కామెడీకి సరి కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తర్వాత ‘అందాల రాముడు’తో హీరోగా మారాడు. సిక్స్‌ఫ్యాక్స్ చూపించాడు. అదరిపోయే స్టెప్పులతో అలరించాడు. కానీ వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. రూటు మార్చి మళ్లీ కమెడియన్‌గా మారాడు. కానీ లెక్కల మాస్టార్ సుకుమార్ మాత్రం సునీల్‌ని సీరియస్ ట్రాక్ ఎక్కించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రంలో మంగళం శ్రీనుగా సునీల్ నటన, ఆహార్యం కొత్తగా అనిపించింది. సునీల్ బెదిరిస్తే.. ఆడియన్స్ భయపడ్డారు. దీంతో అదే పంథాను కొనసాగిస్తున్నాడు. పుష్ప 2లోనూ సునీల్ సీరియస్ లుక్‌లో కపించబోతున్నాడు. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్’లోనూ సునీల్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడు.
‘సీరియస్’ నరేశ్
రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా రాణించిన వ్యక్తి ‘అల్లరి’ నరేశ్. తొలి సినిమా ‘అల్లరి’ నుంచి 2021లొ వచ్చిన ‘బంగారు బుల్లోడు’ వరకు తనదైన కామెడీతో నవిస్తూ హాస్యరస చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచాడు. కానీ ఇప్పుడే ఈ కామెడీ స్టార్ సీరియస్ బాట పట్టాడు. 2021లో వచ్చిన ‘నాంది’ చిత్రంతో సీరియస్ కథలకు శ్రీకారం చుట్టాడు. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఉగ్రం’ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా నరేశ్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రం మే 5న విడుదల కాబోతుంది.
నవ్విస్తూనే..ఏడిపించిన దర్శి
తెలంగాణ యాసలో కామెడీ పండిస్తూ అందరిని నవ్విస్తున్న ప్రియదర్శి.. మధ్య మధ్యలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ‘మల్లేశం’ సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఇక బలగం సినిమాతో అందరిని నవ్విస్తూనే.. చివర్లో తనదైన నటనతో ఏడిపించాడు. ఎలాంటి పాత్రనైనా పోషించి మెప్పించగలడని ఈ చిత్రంతో నిరూపించాడు.
కన్నీళ్లు పెట్టించిన కోవై సరళ
టాలీవుడ్‌లో లేడీ కమెడియన్స్ అనగానే అందరికి గుర్తొంచే పేరు కోవై సరళ. కోవై సరళ, బ్రహ్మానందం కాంబినేషన్ గురించి ఎంత సూపర్ హిట్టో అందరికి తెలిసిందే. వీరిద్దరి కోసం స్పెషల్ ట్రాక్‌లు రాసుకునేవారు మన దర్శకులు. అయితే గతకొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది కోవై సరళ. ఇటీవల ఆమె నటించిన తమిళ మూవీ ‘సెంబి’ ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో కోవై సరళ తనలోని నట విశ్వరూపాన్ని చూపించింది. తన మనవరాలికి జరిగిన అన్యాయంపై ఓ బామ్మ చేసే పోరాటమే ఈ చిత్రం. ఇందో బామ్మగా నటించిన కోవై సరళ.. తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించింది. కొన్ని సన్నివేశాల్లో కోవై సరళ నటన చూస్తే.. కన్నీళ్లు ఆగవు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయింది.
సత్యం రాజేశ్ నట విశ్వరూపం
ఇన్నాళ్లు తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించిన సత్యం రాజేశ్.. ‘మా ఊరి పొలిమేర’ వెబ్ సిరీస్‌తో అందరిని భయపెట్టాడు. ఉత్కంఠగా సాగే ఆ వెబ్ సిరీస్‌లో ఆటో డ్రైవర్ కొమిరిగా సత్యం రాజేశ్ జీవించేశాడు. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. అందరిని భయపెట్టిస్తాడు. త్వరలోనే ‘మా ఊరి పొలిమేర 2’ కూడా రాబోతుంది. ఇందులో సత్యం రాజేశ్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు.
బలగం వేణు
జబర్దస్త్ కామెడీ షోతో అందరికి పరిచమైన కమెడియన్ వేణు. చాలా కాలంగా కమెడియన్‌గా రాణిస్తున్న వేణుకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘బలగం’ మూవీతో వేణు పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. కమెడియన్ వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా? అని అందరు చర్చించుకునేలా చేసింది. తెలంగాణ పల్లె నేపథ్యంలో వేణు తెరకెక్కించిన ‘బలగం’ చిత్రం..బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ వేణు ప్రతిభ గురించే చర్చిస్తున్నారు. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఇలా వెండితెరపై నవ్వులు కురిపించే కమెడియన్స్.. నవ్వుకు బ్రేక్ ఇచ్చి.. సీరియస్ ట్రాక్ ఎక్కి మెప్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment