50 years after his death, martial arts icon Bruce Lee's legacy alive - Sakshi
Sakshi News home page

బ్రూస్‌ లీ మరణానికి నేటితో 50 ఏళ్లు.. ఆయన మృతి ఒక మిస్టరీ..!

Published Thu, Jul 20 2023 10:20 AM | Last Updated on Thu, Jul 20 2023 2:49 PM

Bruce lee Death Now Fifty Years Still His Charming And Name Alive - Sakshi

మార్షల్‌ ఆర్ట్స్‌.. ఈ పేరు వినగానే ఎవరైనా టక్కున చెప్పే పేరు బ్రూస్‌ లీ. తరాలు మారుతున్న మార్షల్‌ ఆర్ట్స్‌పై ఆసక్తికనబరిచే యువతకు ఆయనే ఆదర్శం. తన మార్షల్‌ ఆర్ట్స్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అమెరికన్‌ లెజెండరీ నటుడు బ్రూస్‌ లీ అతి చిన్న వయసులోనే లోకాన్ని వీడారు. 1973 జులైలో తన 32వ ఏట సెరెబ్రల్‌ ఎడిమా (మెదడు వాపు) అనే వ్యాధితో మరణించారు.

అయితే ఆయన మృతికి సంబంధించి సుమారు యాభై ఏళ్ల తర్వాత విస్తుగొలిపే విషయాలు బయటికొచ్చాయి. అతిగా నీళ్లు తాగడం వల్లే బ్రూస్‌లీ మరణించారని స్పెయిన్‌ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం ద్వారా గతేడాది వెల్లడించారు. నేటితో ఆయన చనిపోయి 50 ఏళ్లు దాటినా ఆయన పేరుకు ఉన్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. బ్రూస్ లీ కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కో అనే నగరంలో 1940 నవంబరు 27 న పుట్టి, హాంకాంగ్‌లో పెరిగాడు. దీంతో ఆయనకు హాంగ్‌కాంగ్, అమెరికా దేశాల నుంచి రెండు పౌరసత్వాలు దక్కాయి. కానీ బాల్యంలో కడు పేదరికాన్ని ఎదుర్కొన్నాడు.

బ్రూస్ లీ సినిమాల్లోకి ఎలా వచ్చాడంటే
హాంగ్‌కాంగ్‌లో అప్పటికే తను కుంగ్‌ పూలో మంచి నేర్పరి దీంతో కొందరికి శిక్షణ ఇచ్చేవాడు చైనాయేతరులకు కుంగ్‌ పూ నేర్పిస్తున్నాడని కొంతమంది అతడిపై దాడి చేసేందకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారికి ఇలా ఛాలెంజ్‌ విసిరాడు 'మీరందరూ రండి నేనొక్కడినే బరిలోకి దిగుతా నేను ఓడితే ఇక కుంగ్‌పూ జోలికి వెళ్లను అని' అన్నాడు . సెకన్ల వ్యవధిలో వారందరినీ మట్టికరిపించాడు. ఆ తరువాత సొంతంగా ఓ మార్షల్‌ ఆర్ట్‌ కనిపెట్టి మరింత పాపులర్‌ అయ్యాడు. అక్కడే  ఫిలాసఫీ టీచర్‌గా పనిచేస్తున్న లిండా అనే విద్యార్థిని పెళ్లిచేసుకున్నాడు. వారికో కుమారుడు పుట్టాడు. అతడి పేరు బ్రాండన్‌ లీ.

బ్రూస్‌ లీ వద్ద ఎంత టాలెంట్‌ ఉన్నా కడు పేదరికం వెంటాడుతూనే ఉంది కుటుంబాన్ని పోషించటం కోసం చిన్నచిన్న టీవీ సీరియళ్లలో కూడా నటించాడు. పలు చిన్న చిన్న మూవీస్‌లో రోల్స్‌లలో కనిపించాడు బ్రూస్‌లీ. ఆ తరువాత హాంకాంగ్‌లోని ఓ ప్రొడ్యూసర్‌ సాయంతో ఓ సినిమా తీశాడు. అక్కడే తన జీవితం మలుపు తిరిగింది. ఆ సినిమానే 'ద బిగ్‌ బాస్‌'. అప్పట్లో అది హాంగ్‌కాంగ్‌ బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టింది.

తర్వాత బ్రూస్‌ లీ నుంచి వచ్చిన 'ద గేమ్‌ ఆఫ్‌ డెత్‌'   సినిమాతో హాంకాంగ్‌ చిత్ర పరిశ్రమ చరిత్రే మారిపోయింది.  ఆ తరువాత ఎంటర్‌ ది డ్రాగన్‌ సినిమా షూటింగ్‌ పూర్తి అయింది. అందులో ఆయన చాలా వరకు రియల్‌గానే స్టంట్స్‌ చేశాడు. సినిమా రిలీజ్‌కు కూడా దగ్గర్లో ఉండగా ఒకరోజు తలనొప్పి వచ్చిందని బ్రూస్‌లీపెయిన్‌ కిల్లర్‌ ట్యాబ్లెట్‌ తీసుకున్నాడు. దీంతో ఆయన కోమాలోకి వెళ్లి  1973 జులై 20న  మరణించాడు.

బ్రూస్‌లీ మరణం వెనుక
ఆయన అతిగా నీళ్లు తాగడం వల్లే బ్రూస్‌లీ మరణించారని స్పెయిన్‌ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం నిర్వహించి గతేడాది ప్రకటించారు. హైపోనాట్రేమియా.. అతిగా నీరు తాగడం వల్ల శరీరంలో అవసరానికి మించిన సోడియం స్థాయిలు కరిగిపోతాయి. ఈ స్థితి వల్లే బ్రూస్‌లీ సెరెబ్రల్‌ ఎడిమా బారిన పడినట్లు స్పెయిన్‌ శాస్త్రవేత్తలు అధ్యయనం ద్వారా వెల్లడించారు.

నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల సోడియం లెవల్స్‌ తగ్గిపోయి.. శరీరంలోని కణాలు, ముఖ్యంగా మెదడులో కణాలు వాపు చెందుతాయి. అదే బ్రూస్‌లీ మరణానికి దారితీసి ఉంటుందని స్పెయిన్‌ సైంటిస్టులు ప్రకటించారు. ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవడం, గంజాయి లాంటి మాదకద్రవ్యాల వల్ల అతిగా దాహం వేయడం, ఆల్కహాల్ అలవాట్లతో అధిక నీటిని బయటకు పంపించే సామర్థ్యాన్ని కిడ్నీలు కోల్పోవడం వంటివి ఈ పరిస్థితికి దారితీస్తాయని స్పెయిన్‌ సైంటిస్టుల అధ్యయనం వెల్లడించింది.

బ్రూస్‌ లీ కూతురు
బ్రూస్‌ లీకి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.  ఆయన కుమారుడు బ్రాండన్‌ బ్రూస్‌ లీ కూడా 1993లో మరణించాడు. కూతురు షానన్ లీ మాత్రమే బ్రూస్‌ లీ కుటుంబం నుంచి బతికి ఉన్నారు. బ్రూస్‌ లీ మరణం తర్వాత అతని భార్య లిండా మరోక వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆమె ఆమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్త,సినీ నిర్మాతగా కొనసాగుతున్నారు. త్వరలో తన తండ్రి గురించి బయోపిక్‌ తీసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

సినీ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ కామెంట్‌
బ్రూస్‌ లీ గురించి టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ పూరి ఓసారి ఇలా చెప్పాడు. 'చైనీస్‌ జోడియాక్‌ ప్రకారం.. పుట్టిన గడియా, సంవత్సరం రెండూ డ్రాగన్‌ ఉన్న బిడ్డ మహర్జాతకుడు అవుతాడు. ఈ విషయాన్ని చైనీయులు బాగా నమ్ముతారు. సరిగ్గా అదేరీతిలో డ్రాగన్‌ లాంటి కుర్రాడు  అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో పుట్టాడు. వాడే బ్రూస్‌లీ. బ్రూస్‌ అనే పేరు అక్కడున్న నర్స్‌ పెట్టింది. అతడి తల్లిదండ్రులు ఇద్దరూ గాయకులు. వారి కుటుంబం కొంతకాలానికి హాంకాంగ్‌కు మకాం మార్చింది. పదమూడేళ్ల వయసుకే చైల్డ్‌ ఆర్టిస్టుగా ఇరవై సినిమాల్లో చేశాడు బ్రూస్‌లీ. యీప్‌ మ్యాన్‌ దగ్గర కుంగ్‌పూ నేర్చుకున్నాడు. ఇంటర్‌ స్కూల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ కొట్టాడు. అయితే చాలామందికి తెలియని విషయం ఒకటుంది అదేంటంటే అతడో అద్భుతమైన డ్యాన్సర్‌.

18 ఏళ్ల వయసులో హాంకాంగ్‌ చా చా ఛాంపియన్‌ షిప్‌ గెలిచాడు. సినీరంగం విషయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం అతడికి లభించలేదు. దాంతో 100 డాలర్లు దొరకగానే అమెరికా షిప్ ఎక్కేశాడు. సియాటెల్‌లో కుంగ్‌పూ నేర్పిస్తూ వచ్చిన డబ్బుతో ఫిలాసఫీ చదువుకున్నాడు. మీకు తెలుసా ప్రపంచంలో మిక్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రారంభించింది లీనే. అతడి కంటే గొప్ప ఫైటర్లు చాలామందే ఉండొచ్చు. కానీ ప్రతిఒక్కరికీ అతడే స్ఫూర్తి. కొట్టే ప్రతి పంచ్‌ వెనుక ఓ థియరీ చెబుతాడు. అతడిలోని ఫిలాసఫీకి అందరూ ఫిదా అవుతారు. అతిచిన్న వయసులో 32 ఏళ్లకే బ్రూస్‌లీ మరణించాడు. అతడి జీవితం మొత్తంలో చేసిన పని చాలా తక్కువ. అయినా ప్రపంచంలోని ప్రతీ చిన్న పల్లెలోనూ బ్రూస్‌లీ పేరు తెలుసు. అదే అతడు చూపించిన ప్రభావం.' అని పూరి చెప్పాడు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement