21 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ.. అయితే ఏంటి?! | Celebrity Women Who Married And Dating Younger Men Than Them | Sakshi
Sakshi News home page

వయస్సులో చిన్నవాళ్లను పెళ్లాడిన సెలబ్రిటీలు

Published Fri, Sep 11 2020 2:22 PM | Last Updated on Fri, Sep 11 2020 5:32 PM

Celebrity Women Who Married And Dating Younger Men Than Them - Sakshi

(వెబ్‌ స్పెషల్‌): ‘‘ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా.. అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతుల్తో నరికేస్తా’’ అంటూ ప్రణయ బంధంలో మునిగిపోయిన జంట భావావేశాన్ని చక్కగా వర్ణించాడో సినీకవి. ఒక లైలా- మజ్నూ, ఒక రోమియో- జూలియట్‌, ఒక సలీం- అనార్కలి.. ఇలా అనాదికాలం నుంచి నేటి స్మార్ట్‌ యుగం వరకు దాదాపుగా ప్రతీ లవ్‌స్టోరీలోనూ ప్రేమికులు అచ్చంగా ఇవే పదాలు కాకపోయినా.. ఇదే అర్థంతో కూడిన పాటలు పాడుకుని ఉంటారు. అవును మరి.. ప్రేమలో ఉన్న మాధుర్యం అలాంటిది. కుల, మత, జాతి, వర్గాలకు ఆఖరికి వయస్సుకు అతీతంగా ఎవరిపై ఎప్పుడు ప్రేమ పుడుతుందో చెప్పడం కాస్త కష్టమే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ప్రేమకథలు ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాదు తమకంటే తక్కువ వయస్సున్న పురుషులను పెళ్లాడిన, ప్రేమిస్తున్న సెలబ్రిటీలు కూడా చాలా మందే ఉన్నారు. వారిలో కొందరు..

పిగ్గీచాప్స్‌ మెచ్చిన వరుడు!
ప్రియాంక చోప్రా(38).. ఇరవై ఏళ్ల క్రితమే ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికల్లోకెక్కింది. 2000 సంవత్సరంలో మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కించుకున్న ఈ అందాల భామ ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టింది. ఎన్నో ఆటుపోట్లు చవిచూసి స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకుంది. హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌పై తన అందం, అభినయంతో కుర్రకారుకు ఆరాధ్య దేవతగా మారిపోయిన పిగ్గీచాప్స్‌.. తనకంటే పదేళ్లు చిన్నవాడైన హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌పై మనసు పారేసుకుంది. హాలీవుడ్‌లోనూ సత్తా చాటి గ్లోబల్‌స్టార్‌గా ఎదిగిన ఆమె ఓ అవార్డు ఫంక్షన్‌కు నిక్‌తో కలిసి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచింది. (చదవండి: ఇండస్ట్రీలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ వీరే)

ఈ జంటను చూసినవాళ్లంతా ఇదంతా డేటింగ్‌లో భాగమేనని, నిక్‌ అప్పటికే మాజీ మిస్‌ యూనివర్స్‌ ఒలీవియా కల్పోతో పాటు ప్రముఖ సింగర్‌ సెలీనా గోమెజ్‌తోనూ ప్రేమాయణం నడిపి ఉండటంతో.. ప్రియానిక్‌ పెళ్లిదాకా వస్తారా అంటూ అనేక సందేహాలు వ్యక్తం చేశారు. అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ 2018 డిసెంబరులో హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల ప్రకారం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వయసు వ్యత్యాసం కారణంగా ఎన్నోసార్లు విపరీతమైన ట్రోలింగ్‌ బారినపడినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా రోజురోజుకీ తమ బంధాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారీ స్టార్‌ కపుల్‌.

సుస్మితా సేన్‌ వలచిన ఘనుడు!
ఇండియాకు తొలి మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని తెచ్చిపెట్టిన సుస్మితా సేన్(44) ప్రస్తుతం రోహమన్‌ షాల్‌ అనే యువ మోడల్‌తో ప్రేమలో ఉన్నారు. దాదాపుగా రెండేళ్లుగా వీరి బంధం కొనసాగుతోంది. అంతకుముందు చాలా మందితో డేటింగ్‌ చేసినప్పటికీ సుస్మిత ఎవరితోనూ తన బంధాన్ని పెళ్లిపీటల వరకు తీసురాలేదు. అయితే రోహమన్‌ విషయంలో మాత్రం ఆమె సీరియస్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అందంతో పాటు మంచి మనసున్న ‘తల్లి’అయినటువంటి సుస్మిత ఇద్దరు కూతుళ్లు(దత్తత) రీనీ, అలీషాలకు అతడు తండ్రి ప్రేమను పంచుతుండటమే ఇందుకు కారణమట. అందుకే తనకంటే దాదాపు పదిహేనేళ్లు చిన్నవాడైనప్పటికీ రోహమన్‌ను పెళ్లాడేందుకు సుస్మిత సుముఖంగానే ఉందంటూ బీ-టౌన్‌ టాక్‌. అయితే అది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఎదురు చూడాల్సిందే.

మలైకా మనసు దోచిన అర్జున్‌‌!
చయ్య.. చయ్య పాటతో కుర్రకారును ఉర్రూతలూగించిన మలైకా అరోరా(46).. ‘కెవ్వు కేక’ పాటతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైపోయింది. సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ను వివాహం చేసుకుందీ భామ. వీరిద్దరికి అర్హాన్‌ ఖాన్‌ అనే పేరు గల టీనేజ్‌ కొడుకు కూడా ఉన్నాడు. అయితే అర్బాజ్‌తో వైవాహిక బంధం కొనసాగిస్తున్న తరుణంలోనే నటుడు అర్జున్‌ కపూర్‌తో ఆమె పరిచయం.. అంతలోనే భర్త సైతం వేరే మహిళకు దగ్గరకావడంతో వీరిరువురి మధ్య దూరం పెరిగింది. దీంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుందీ జంట. ఇక అప్పటి వరకు గుట్టుగా తిరిగిన ప్రేమపక్షులు మలైకా- అర్జున్‌కు పూర్తి స్వేచ్ఛ వచ్చినట్లయింది. 

అయితే తమ ప్రణయ బంధం ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే.. కలిసి డిన్నర్లు చేస్తూ, టూర్లతో వెళ్తూ ఫొటోగ్రాఫర్లకు బాగా పనిచెప్పారు. అయితే మలైకా పెళ్లి- విడాకుల కంటే కూడా.. అర్జున్‌ కన్నా ఆమె వయసులో పన్నెండేళ్లు పెద్దది కావడం మూలాన్నే ఎక్కువసార్లు ట్రోలింగ్‌ బారిన పడింది. ఇక ఇటీవల అర్జున్‌- మలైకా ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా తేలడంతో రావడంతో ట్రోల్స్‌ శృతిమించాయి. అయినా వీటిని ఏమాత్రం లెక్కచేయకుండా ఈ లవ్‌బర్డ్స్‌ ముందుకు సాగుతున్నారు. అన్నట్లు అర్జున్‌ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ కుమారుడన్న సంగతి తెలిసిందే.

కలల రాకుమారుడిని భర్తగా పొందిన నమ్రత
మాజీ మిస్‌ ఇండియా నమ్రతా శిరోద్కర్‌(48) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వెండితెరపై నటిగా ప్రస్థానం ప్రారంభించిన నమ్రత పలు దక్షిణాది సినిమాల్లోనూ కనిపించారు. అయితే అనతికాలంలోనే నటనకు గుడ్‌బై చెప్పి.. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, అమ్మాయిల కలల రాజకుమారుడైన మహేష్‌ బాబును ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఆమె తన భర్త కంటే మూడేళ్లు పెద్దవారు.

ఇక వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు గౌతం కృష్ణ, సితార. కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే నమ్రత తన ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ చాలా యాక్టివ్‌గా ఉంటారు.

అందాల రాశి ఐశ్వర్య అభీకే సొంతం!
అందానికే అసూయ పుట్టించే అందం ఐశ్వర్యా రాయ్‌(46) సొంతమనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి అందగత్తెను పెళ్లి చేసుకోవాలని చాలా మంది ఉవ్విళ్లూరారు. కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ అయితే ఆమె ప్రేమ కోసం పిచ్చివాడైపోయాడట. కానీ ఈ మాజీ మిస్‌ వరల్డ్‌ను వివాహమాడే అదృష్టం మాత్రం బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ తనయుడు అభిషేక్‌ బచ్చన్‌నే వరించింది. వీరిద్దరు కలిసి నటించిన‘గురు’సినిమా సెట్లో తన దగ్గర ఉన్న ఓ ఉంగరాన్ని బహూకరించి.. ఐష్‌కు ప్రపోజ్‌ చేసిన అభిషేక్.. ఆమె అంగీకారం లభించగానే పెద్దల్ని ఒప్పించి పెళ్లిచేసుకున్నాడు. వీరిరద్దరికి ఆరాధ్య అనే ముద్దుల కూతురు ఉంది. అన్నట్లు అభిషేక్‌.. ఐశ్వర్య కంటే రెండేళ్లు చిన్నవాడు.

ఇక వీళ్లతో పాటు పలువురు హాలీవుడ్‌ నటీమణులు కూడా వయస్సులో తమకంటే చిన్నవాళ్లైన పురుషులతో బంధం కొనసాగిస్తున్నారు. గేబ్రియెల్‌ యూనియన్‌- డ్వేన్‌ వాడే దంపతులు(9 ఏళ్ల వ్యత్యాసం), షకీరా- గెరాడ్‌ పిక్‌(10 ఏళ్లు), కోర్ట్‌నీ కర్దాషియాన్‌- యూనస్‌ బెడ్జిమా(14 ఏళ్లు), జడా పింకెట్‌ స్మిత్‌- ఆగస్ట్‌ అల్సీనా(21 ఏళ్లు), లీసా బానెట్‌- జాసన్‌ మొమోవా దంపతులు(12 ఏళ్లు) తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement