దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి
‘‘నేను తీసిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచి ఉండొచ్చు. కానీ ‘చెక్’ మాత్రం నిరుత్సాహపరచదు. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది’’ అని దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి అన్నారు. నితిన్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చెక్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చెప్పిన విశేషాలు.
► నితిన్ తో సినిమా చేయాలనుకున్నాం. రెండుమూడు కథలు అనుకున్నా కుదరలేదు. ఫైనల్‌గా ‘చెక్’ బావుంటుందనుకుని చేశాం. నితిన్‌ని మైండ్‌లో పెట్టుకుని ఈ కథ రాయలేదు. కథ పూర్తయ్యాక కలిశాను. తనకి ‘చెక్’ పాత్ర బాగా సూట్ అవుతుందని చేశాం. ఈ సినిమాలో హ్యూమన్ డ్రామా ఆకట్టుకుంటుంది.
► హీరో ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ.. అయితే బాగా తెలివైనవాడు. క్రెడిట్ కార్డ్స్ ఫ్రాడ్ చేస్తుంటాడు. అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదంలో జైలులో పడితే ఉరిశిక్ష పడుతుంది. అతను క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి దరఖాస్తు పెట్టుకుంటాడు. హీరో చెస్ బాగా ఆడి వరుసగా విజయాలు సాధిస్తున్నాడని అతడిపై సానుభూతి కలిగి, ఉరిశిక్షపై రాష్ట్రపతికి అభిప్రాయం మారొచ్చు. ఆట, క్షమాభిక్ష... ఈ రెండు అంశాల నేపథ్యంలో ‘చెక్’ సన్నివేశాలు ఉంటాయి. ఈ కథలో చదరంగం ఆటకు చాలా ప్రాధాన్యం ఉంది.
► 70 శాతం సినిమా జైలులో సాగుతుంది. కరోనా వల్ల బయటకు వెళ్లలేక జైలు సీక్వెన్సులు కొంచెం పెంచాల్సి వచ్చింది. ‘ఐతే’ తర్వాత నేను, కల్యాణీ మాలిక్ పని చేయాలనుకున్నా పరిస్థితుల వల్ల కుదరలేదు. ఇప్పుడు కుదరడం అదృష్టం అనుకోవాలి. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. ఈ చిత్రంలో రకుల్ న్యాయవాదిగా నటించారు. ప్రియా ప్రకాశ్ ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుంది.
► ఆనందప్రసాద్ చాలా మంచి నిర్మాత. మొదట కథ వింటారు. కథ నచ్చితే మళ్లీ ఫైనల్ కాపీ చూస్తారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవిగారు వెనుక ఉండి నడిపిస్తుంటారు. ‘ప్రేక్షకుల ఆలోచనల కంటే మీరు అడ్వాన్స్‌డ్’ అని చాలామంది నన్ను అంటారు.. అడ్వాన్స్ అవ్వడం కూడా తప్పే. కాలం కంటే ముందు, వెనుక ప్రయాణించకూడదు. కాలంతో పాటు ప్రయాణించాలి.
► ‘చెక్’ సినిమాకన్నా ముందే రెండు సినిమాలు ఒప్పుకున్నాను. వాటిలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఒకటి, వేరే సంస్థలో మరో సినిమా చేస్తాను.
Comments
Please login to add a commentAdd a comment