యంగ్ హీరో నితిన్ ఖైదీగా నటిస్తున్న చిత్రం చెక్. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. 'యద్భావం తద్భవతి' అన్న ఉద్బోధతో ట్రైలర్ ప్రారంభమైంది. జైల్లో ఓ పెద్దాయన ఒంటరిగా చెస్ ఆడుతుండటం చూసిన ఆదిత్య(నితిన్) ప్రత్యర్థి ఉంటేనే కిక్కు.. అంటూ ఆటలో దిగాడు. తర్వాత అతడు వేసే ఒక్కో ఎత్తుగడ చూసి ఆశ్చర్యపోవడం పెద్దాయన వంతైంది. అయితే ఆదిత్య ఆటతీరును చూసిన ఆయన చెస్‌లో ఉన్న ఒక్కో పావు గుణగణాలను చెప్తూ దాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్తున్నాడు. అలా ఏనుగు, గుర్రం, ఒంటె గురించి చెప్తున్న కొద్దీ దానికి సరిగ్గా సరిపోయే పాత్రలను తెరమీద చూపించారు. మొత్తానికి కటకటాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఆదిత్య చదరంగంలో తోపు అని తెలుస్తోంది. (చదవండి: నితిన్ ‘చెక్’ ఫస్ట్ గింప్స్ వచ్చేసింది)
కానీ టెర్రరిస్టుతో చెస్ ఆడిస్తారా? అని నిలదీస్తున్నాడో వ్యక్తి. పైగా అతడిని దేశద్రోహి అని పోలీసులు ఛీ కొడుతున్నారు. దీంతో దేశద్రోహి అన్న ముద్ర చెరిపేసేందుకు ప్రయత్నిస్తోంది లాయర్ రకుల్. ఉరిశిక్ష పడ్డ ఆదిత్యకు క్షమాభిక్ష అవకాశం ఏమైనా ఉందా అని దారులు వెతుకుతోంది. కానీ ఒకానొక సమయంలో ఆ కేసు నుంచి ఎందుకు తప్పుకునేంది ఆసక్తికరంగా మారింది. రాజును ఎదిరించే దమ్ముందా సిపాయికి అన్న వ్యక్తికి 'యుద్ధం మొదలు పెట్టేదే సిపాయి' అని రివర్స్ కౌంటరిస్తున్నాడు ఆదిత్య.
సమయం దొరికినప్పుడు తోటి ఖైదీలను చితక్కొడుతున్నాడు కూడా! అసలు నితిన్ దేశద్రోహి ఎందుకయ్యాడు? అతడు ఉరి శిక్షను తప్పించుకుంటాడా? లేదా? అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఎత్తులకు పై ఎత్తులతో ఈజీగా చెక్ పెడుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. సరిగ్గా నెల రోజుల తర్వాత నితిన్ మరో చిత్రం 'రంగ్‌దే' రిలీజ్ అవుతోంది. (చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్’లో నా క్యారెక్టర్ అదే : రామ్‌చరణ్)
Comments
Please login to add a commentAdd a comment