టాలీవుడ్‌తో పాటు అన్ని చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోలకు డూపులను వాడే సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. స్టార్ హీరోకి సంబంధించిన రిస్కీ ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ ఈ డూపులతోనే చేయిస్తారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో అచ్చం రియల్ హీరో చేసినట్లే ఆ సన్నివేశాలను చూపిస్తారు దర్శకుడు. అయితే ఈ డూపుల గురించి ఒకప్పుడు ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని డూప్‌గా నటించిన వారికి కూడా గుర్తింపు లభిస్తోంది.
తనదైన డ్యాన్స్, ఫైట్లలో తెలుగు చిత్ర సీమలో రారాజుగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని చిత్రాల్లో డూప్‌ని వాడారు. తనలాగే ఉన్న ఓ వ్యక్తిని పలు చిత్రాల్లో నటించజేసి విజయాలు అందుకున్నారు. ఆ డూప్ పేరు ప్రేమ్ కుమార్. అతనిది పశ్చిమ గోదావారి జిల్లా పాలకొల్లు. రికార్డింగ్ డ్యాన్సర్‌గా ఉన్న ఆయన గత 30 ఏళ్లుగా చిరంజీకి సినిమాలకు డూప్‌గా నటిస్తున్నారు. ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డ్యాన్స్ పేరిట ఆయనకు ఒక కంపెనీ ఉంది.
అక్కినేని అభిమాని కానీ..
ప్రేమ్ కుమార్ నాన్న స్టేజ్ షోలు నిర్వహించేవాడు. ప్రేమ్ కుమార్ సినీ ప్రస్థానం కూడా స్టేజ్ షో నుంచే ప్రారంభమైంది. తొలుత అక్కినేని నాగేశ్వరరావు పాటలకు డ్యాన్స్ చేసేవాడు. అంతేకాదు అక్కినేనికి ప్రేమ్ కుమార్ పెద్ద అభిమాని. అయితే స్నేహితుల ప్రొత్సాహంతో అతను చిరంజీవి పాటకు డ్యాన్స్ చేసి..మెగాస్టార్ అభిమానిగా మారారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రేమ్ కుమారే చెప్పారు.
‘నా పదోతరగతి 1985లో పూర్తయింది. ఆరేళ్ల వయసు నుంచే నేను స్టేజ్ షోలో పాల్గొన్నారు. ప్రతిసారి అక్కినేని హిట్ పాటలకు స్టెప్పులేసి అలరించేవాడిని. కాలేజీ సమయంలో స్నేహితులు చిరంజీవి పాటలకు ట్రై చేయమని చెప్పారు. మొదటగా చిరు ‘ఇందువదనా..’పాటకు డ్యాన్స్ చేశా. అది బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత వరుసగా చిరంజీవి పాటలకు డ్యాన్స్ చేస్తూ వచ్చాను. ఇక 1990లో డిగ్రీ పాసయ్యాక.. సినిమాల్లో ఓ ఆఫర్ వచ్చింది. అది చిరంజీవి ఛాలెంజ్ సినిమా. ఎగిరి గంతేసి నటించేశాను. ఆ తర్వాత రాక్షసుడు, మరణ మృదంగం సినిమాల్లో చిరు డూప్‌గా నటించిన తర్వాత బ్రేక్ వచ్చింది. కొన్నాళ్ల వరకు సినిమా అవకాశాలు రాలేదు. స్టేజ్ షోలు చేస్తూనే జీవనం సాగించాను.
టీచర్ ఉద్యోగం రిజెక్ట్ చేస్తే..
స్టేజ్ షోలు చేస్తున్న సమయంలోనే నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. అప్పటికే నా సంపాదన వేలల్లో ఉండేది. దీంతో ఆ ఉద్యోగం వదిలేద్దామనుకున్నాను. కానీ మా నాన్నగారు వద్దన్నారు. ‘ఇప్పుడు ఏజ్ ఉన్నావు. డ్యాన్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నావు. కొన్నాళ్లకు ముసలోడివి అవుతావు. అప్పుడు ఎలా బతకుతావు? ఉద్యోగం నీ జీవితానికి భద్రత అని చెప్పడంతో టీచర్ జాబ్‌లో చేరాను. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఖాలీ సమయంలో స్టేజ్ షోలో నిర్వహించేవాడిని. ఈ మధ్య పెళ్లి కాని ప్రసాద్‌లో చిరంజీవిలా నటించాను. అలాగే సైరా చిత్రంలోనూ చిరు డూప్‌గా నటించాను.
చిరు నా దేవుడు
నేను ఎప్పుడూ చిరంజీవిని ఫాలో కాలేదు. కానీ ఆ దేవుడే నన్ను చిరంజీవి వైపు పంపించాడు. ఆయన పాటలకు డ్యాన్స్ చేస్తూ.. ఆయనలా నటించడం వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది. ఆయన డబ్బులే నేను తింటున్నాను. నాకు కనబడే ఒకే ఒక దేవుడు చిరంజీవి. చనిపోయేలోపు ఆయనను ఒక్కసారి కలవాలనుకుంటున్నాను. చిరంజీవిని చూసి చనిపోవాలనేదే నా కోరిక’అని ప్రేమ్ కుమార్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment