
టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపించే పదం 'మెగా బ్రదర్స్'.. దీనంతటికి కారణం వారందరూ కలిసి సినిమా రంగంలో రాణించడమే.. ఆపై చిరంజీవి మాటకు తన కుటుంబ సభ్యులు ప్రాధాన్యత ఇస్తారని చెబుతుంటారు. ఇప్పటికే వారి కుటుంబంలో చిరంజీవి హిట్లర్ సినిమాలో మెగాస్టార్‌లా ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతుంటాయి. అయితే, వారందరూ అలా కలిసి ఉండటానికి కారణాలు ఎంటి అనేది చిరు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఉమ్మడి కుటుంబం గురించి ఇలా చెప్పారు.. ‘ఉమ్మడి కుటుంబం, ప్రేమ, ఆప్యాయత, ఈ విలువలు అన్నీ కూడా తమకు అమ్మానాన్నల నుంచే సంక్రమించాయి. మా నాన్నకు చాలీ చాలని జీతం వచ్చినా కూడా.. ఆ డబ్బుతోనే మా కుటుంబాన్ని పోషించారు. అమ్మ తరుఫున ఉండే ఫ్యామిలీని కూడా చూసుకున్నారు. అమ్మ కూడా మా నాన్నకు సంబంధించిన ఫ్యామిలీని ఎంతో చక్కగా చూసుకునేవారు. అలా అప్పటి నుంచే మాకు ఉమ్మడి కుటుంబం, బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు అనేవి తెలిసి వచ్చాయి. అందుకే మేం ఇప్పటికీ కలిసి కట్టుగా ఉంటాం. మేం ప్రేమ, ఆప్యాయతలు, బంధాల విషయంలో అందరి కంటే ధనికులం. ఒక్కో సారి డబ్బు అన్ని సమస్యల్ని తీర్చలేకపోవచ్చు. కానీ ఓ భుజం తోడుగా ఉంటే వచ్చే ధైర్యం, భరోసా వేరేలా ఉంటుంది.
మా కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా.. మిగిలిన వారంతా వచ్చి కాపాడుకుంటాం. ఎప్పుడూ అందరూ కలిసి మెలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలి అనే మా అమ్మ చిన్నతనం నుంచి నేర్పారు. మా అమ్మ చుట్టూ ఎప్పుడూ ఓ పాజిటివిటీ ఉంటుంది. ఎవరికైనా సరే మా ఫ్యామిలీలో ఏ కష్టం వచ్చినా, కాస్త బాధల్లో ఉన్నా కూడా అమ్మే అందరికీ ధైర్యాన్ని ఇస్తారు. అందరికీ నైతికంగా భరోసానిస్తారు. చిన్నప్పుడు నేను ఎక్కువగా అమ్మతో పాటే ఉండేవాడిని. అమ్మకు సాయంగా అన్ని పనుల్లో తోడుండేవాడిని. నాగబాబు అసలు ఇంట్లో పనులు చేసే వాడు కాదు. ఇక కళ్యాణ్ బాబు అంటే అమ్మకి కాస్త ఎక్కువ ఇష్టం.
నా నిర్ణయానికి అమ్మానాన్నలు ఎంతో గౌరవాన్ని ఇస్తుండేవారు. ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త జాగ్రత్తగా ఆలోచించి తీసుకో అని మాత్రమే చెప్పేవారు. అలా పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్చ ఇవ్వడం చాలా ప్రధానం. మా అమ్మానాన్నలు నాపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేను కూడా చాలా కష్టపడ్డాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. ఈ రోజుకీ మేం ఇలా ఉన్నామంటే మా అమ్మ గారే కారణం’అని చిరు అన్నారు.