సినిమాల్లో స్టార్‌డమ్ వస్తే ఆకాశమే హద్దుగా సాగిపోవచ్చనుకుంటారు. కానీ అది కొంతకాలమే! స్టార్‌డమ్ ఉన్నన్నాళ్లూ దాన్ని అనుభవిస్తారు. అది పోయిన తర్వాత ఏకాకిగా మారుతారు. వందకు పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న అందాల తార అశ్విని జీవితంలోనూ ఇదే జరిగింది. వెండితెరపై వెలుగు వెలిగిన ఈమె అత్యంత దయనీయ స్థితిలో కన్నుమూసింది. ఆమె ప్రయాణం ఎలా మొదలైంది? తన జీవితం ఎలా ముగిసింది? అనేది ఈ కథనంలో చదివేద్దాం..
తెలుగులో 40కు పైగా సినిమాలు
నెల్లూరుకు చెందిన అశ్విని 1967 జూలై 14న జన్మించింది. భక్త ధ్రువ మార్కండేయ అనే సినిమాలో బాలనటిగా కనిపించింది. తొలి సినిమాకే అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె కొంతకాలానికే హీరోయిన్‌గా మారింది. వెంకటేశ్‌తో కలియుగ పాండవులు, రాజేంద్ర ప్రసాద్‌తో స్టేషన్ మాస్టర్, నాగార్జునతో అరణ్యకాండ చిత్రాలు చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకుని 110కి పైగా చిత్రాలు చేసింది. పెళ్లి చేసి చూడు, ఇంటి దొంగ, చూపులు కలిసిన శుభవేళ, వివాహ భోజనంబు.. ఇలా ఒక్క తెలుగులోనే 40కి పైగా సినిమాలు చేసింది.
సీక్రెట్‌గా పెళ్లి..
కెరీర్ పీక్స్‌లో ఉండగా ఈమె సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే కొంతకాలానికే ఆమె భర్త తనను మోసం చేసి విడిచిపెట్టి వెళ్లిపోయాడన్న రూమర్స్ కూడా వచ్చాయి. ఒంటరిగా ఉన్న అశ్విని కార్తీక్ అనే పిల్లవాడిని దత్తత తీసుకుని పెంచుకుంది. అయితే భర్త చేసిన మోసాన్ని తలుచుకుని అశ్విని ఎంతగానో కుంగిపోయింది. అది ఆమె ఆరోగ్యాన్ని దెబ్బకొట్టింది. గుండె నిండా శోకం నింపుకున్నా పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తూ సినిమాలు చేసుకుంటూ పోయింది. కానీ అటు కెరీర్ గ్రాఫ్ కూడా పడిపోసాగింది. మొదట సీరియల్స్‌లో నటించడానికి ఇష్టపడని ఆమె తర్వాత వెండితెరపై అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెరపైనా మెరిసింది. ఒకానొక సమయంలో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో సినిమాలోనే కాదు, ఏ సినీ ఫంక్షన్‌లోనూ కనిపించలేదు.
ఇంటిని అమ్మేసి అద్దె ఇంట్లో బతుకుబండి..
వంద సినిమాలు చేసిందన్న మాటే కానీ తనకు చెన్నైలో ఒక ఇల్లు మాత్రమే ఉండేదట! చివరి రోజుల్లో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో దాన్ని కూడా అమ్మేసి అద్దె ఇంట్లో నివసించిందని సమాచారం. 2012లో ఆమె రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఓ సీరియల్‌కు సంతకం కూడా చేసింది. కానీ ఆమె శరీరం సహకరించలేదు. తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను బతికించలేకపోయారు. అశ్విని తుదిశ్వాస విడిచింది. ఆమె కోరిక మేరకు తన సొంతూరైన నెల్లూరులో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమెను చెన్నై నుంచి నెల్లూరుకు తీసుకువెళ్లడానికి కూడా ఆమె కుటుంబం దగ్గర డబ్బులు లేకపోవడంతో దర్శకుడు పార్తీబన్ ఆర్థిక సాయం చేశాడు. తన నటనతో అందరికీ వినోదాన్ని పంచిన ఆమె జీవితం మాత్రం విషాదంగా ముగిసిపోయింది.
పెళ్లిపత్రిక పంపింది
అశ్విని గురించి డైరెక్టర్ పార్తీబన్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. 'పొందట్టి తెవై సినిమాకు నేను వేరే హీరోయిన్‌ను అనుకున్నాను. కానీ ఆమె డేట్స్ ఇవ్వకపోవడంతో అశ్వినిని తీసుకున్నాం. తను బాగా సెట్టయింది. ఆ సినిమా రిలీజైన కొంతకాలం తర్వాత నేను మళ్లీ ఆమెను కలవలేదు. అయితే మధ్యలో తన పెళ్లిపత్రిక పంపించింది. కవి, రచయిత పువియరుసు మనవడిని పెళ్లాడుతున్నట్లు తెలిపింది. నేను అవుట్‌డోర్ షూటింగ్‌లో ఉండటంతో పెళ్లికి వెళ్లలేకపోయాను. ఆ తర్వాత ఓసారి నా కుమారుడు రాధాకృష్ణన్ తన స్నేహితుడు కార్తీక్ తల్లి ఆస్పత్రిలో ఉందని, ఆమె చికిత్స కోసం డబ్బులు సేకరిస్తున్నామని చెప్పాడు. ఆమె మరెవరో కాదు, అశ్విని అని ఆలస్యంగా తెలిసింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. చివరికి 2012 సెప్టెంబర్ 23వ తేదీన 45 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఆమె కన్నుమూసింది. తన కొడుకును చదివించే బాధ్యత నేను భుజాన వేసుకున్నాను' అని చెప్పాడు.
చదవండి: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న హీరోయిన్, పెళ్లికొడుకు ఎవరో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment