'డాకు మహారాజ్' ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌.. తమన్‌ మ్యూజిక్‌పై ప్రశంసలు | Daaku Maharaaj Movie First Song Out Now | Sakshi
Sakshi News home page

'డాకు మహారాజ్' ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌.. తమన్‌ మ్యూజిక్‌పై ప్రశంసలు

Published Sat, Dec 14 2024 6:53 PM | Last Updated on Sat, Dec 14 2024 7:19 PM

Daaku Maharaaj Movie First Song Out Now

బాలకృష్ణ నటిస్తున్న 'డాకు మహారాజ్' ప్రకటన వెలువడిన సమయం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందులో తమన్‌ అందించిన బీజీఎమ్‌ మరో రేంజ్‌లో ఉందంటూ ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

బాలకృష్ణ నటించిన గత మూడు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించి, ఆ ఘన విజయాలలో కీలక పాత్ర పోషించిన తమన్ 'డాకు మహారాజ్' చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి 'ది రేజ్ ఆఫ్ డాకు' పేరుతో మొదటి గీతం విడుదలైంది. బాలకృష్ణ, తమన్ కలయిక అంటే, సంగీత ప్రియుల్లో ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, తమన్ ఈ పాటను అద్భుతంగా స్వరపరిచారు. 'డాకు మహారాజ్' పాత్ర తీరుని తెలియజేసేలా గీత రచయిత అనంత శ్రీరామ్ అర్థవంతమైన, శక్తివంతమైన సాహిత్యాన్ని అందించారు. "డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా" వంటి పంక్తులతో మరోసారి తన కలం బలం చూపించారు. ఇక గాయకులు భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్ జి. రావు, కె. ప్రణతి తమ అద్భుతమైన గాత్రంతో పాటకు మరింత అందం తీసుకొచ్చారు.

లిరికల్ వీడియోలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. విజువల్‌గా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో భారీతనం కనిపిస్తోంది. అలాగే ప్రగ్యా జైస్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, బలమైన భావోద్వేగాలతో సినిమా అద్భుతమైన అనుభూతిని పంచనుందని లిరికల్ వీడియో స్పష్టం చేస్తోంది. ఈ చిత్రంలో  బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'డాకు మహారాజ్' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement