టైటిల్: దహనం
నటీనటులు: ఆదిత్య ఓమ్, ఎఫ్‌ఎమ్ బాబాయ్, శాంతి చంద్ర తదితరులు
నిర్మాణ సంస్థ: ఓపెన్ ఫీల్డ్ మీడియా
నిర్మాత,సంగీతం : డాక్టర్ పెతకంశెట్టి సతీష్ కుమార్
దర్శకత్వం: ఆడారి మూర్తి సాయి
విడుదల తేది: మార్చి 31, 2023
కథేంటంటే..
ఈ సినిమా కథంతా 1984 ప్రాంతంలో జరుగుతుంది. విశాఖపట్నంలోని వాడరేవుల పల్లి గ్రామానికి చెందిన పూజారి భరద్వాజ శాస్త్రి(ఆదిత్య ఓమ్)కి శివ నామస్మరణ తప్ప మరొకటి తెలియదు. ఆ గ్రామంలోని శివాలయంలో పూజలు చేస్తూ భార్య, కూతురితో కలిసి ఉంటాడు. ఆ గుడి కిందే ఓ గుడిసెలో కాటికాపరి బైరాగి(ఎఫ్‌ఎం బాబాయ్) ఉంటాడు. తక్కువ జాతికి చెందిన అతను ఒక్కసారి అయినా ఆ గుడిలోని శివలింగాన్ని తాకాలనే కోరికతో ఉంటాడు.
అయితే ఆ శివాలయం తో పాటు చుట్టుపక్కల ఉన్న స్థలంపై భూస్వామి భూపతి కన్నపడుతుంది. తమ పూర్వికులు ఉచితంగా కట్టించిన ఆ గుడిని వదిలి వెళ్లాలని పూజారి శాస్త్రీని బెదిరిస్తాడు. కానీ శాస్త్రీ కోర్టును ఆశ్రయిస్తాడు. మరి చివరకు గుడి ఎవరికి దక్కింది? శివ లింగాన్ని తాకాలనే బైరాగి కోరిక నెరవేరిందా? ఆయన చేసిన త్యాగమేంటి? కట్టుబాట్లు, కుల వివక్ష కారణంగా బైరాగి, శాస్త్రీ జీవితాల్లో ఎలాంటి మార్పులు సంభవించాయి? అనేదే ‘దహనం’ కథ.
ఎలా ఉందంటే..
సినిమాలో ఒక సీన్‌లో శాస్త్రీ శివుడికి పూజ చేస్తూ పాలు లింగంపై పోస్తుంటాడు.. అదే సమయంలో అతని మనవడు తినడానికి తిండిలేక ఆకలితో ఏడుస్తుంటాడు. వెంటనే ఓ పిల్లాడు వెళ్లి లింగంపై పడి కిందపోతున్న పాలను చేతుల్లో పట్టి పిల్లాడికి తాగిస్తాడు. ఈ ఒక్క సీన్ చాలు ‘దహనం’ ఓ మంచి సందేశాత్మక చిత్రమని చెప్పడానికి. కులం, కట్టుబాట్లపేరుతో జరిగే అరచకాలను ఈ చిత్రంలో చూపించారు. కులాల పేరుతో మనుషులను వేరు వేరుగా చూడొద్దనే సందేశాన్ని ఇచ్చారు.
అయితే కులవివక్ష, వర్ణ వివక్షపై గతంలో చాలా సినిమాలు వచ్చాయి. దహనం కూడా ఆ తరహా చిత్రమే. కానీ శివాలయంతో ముడిపెట్టి కథనాన్ని నడిపించడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. కట్టుబాట్లు, కులం కారణంగా శాస్త్రీ పస్తులుంటే.. బైరాగి కొడుకును దూరం చేసుకొవడం..ఇలా రెండు వర్గాలు పడే బాధలను చూపించారు. ఆకలికి అంటరానితనం ఉంటుందా? అలాంటి డైగాల్స్ ఆలోచింపచేస్తాయి. అయితే కథ నెమ్మదిగా, ఊహకందేలా సాగడం మైనస్. క్లైమాక్స్ మాత్రం కాస్త ఆసక్తికంగా ఉంటుంది. ఈ చిత్రం కమర్షియల్‌గా ఏ మేరకు ఆడుతుందో తెలియదు కానీ.. ప్రేక్షకులకు మాత్రం మంచి సందేశాన్ని అందిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
ఇన్నాళ్లు లవర్ బాయ్‌గా కనిపించిన ఆదిత్య ఓమ్.. ఈచిత్రంలో విభిన్నమైన పాత్ర పోషించాడు. కాస్త వయసు మీద పడ్డ భరద్వాజ శాస్త్రి పాత్రలో ఆదిత్య ఒదిగిపోయాడు. ఆయన వాచకం, కట్టూబొట్టూ, నడవడికి అన్నీ కూడా చక్కగా కుదిరాయి. ఆదిత్య ఓమ్‌లోని మరో యాంగిల్‌ని ఈ చిత్రంలో చూడొచ్చు. ఆదిత్య తర్వాత బాగా పండిన పాత్ర ఎఫ్‌ఎం బాబాయ్‌ది. కాటికాపరి బైరాగి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తాగుబోతుగా ఆయన నటన.. చెప్పు డైలాగ్ ప్రతిదీ ఆకట్టుకుంటుంది. భూపతి పాత్రకు శాంతి చంద్ర న్యాయం చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సతీష్ కుమార్ సంగీతం బాగుంది. పాటలు సందర్భానుసారం వస్తాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment