ప్రముఖ నృత్య దర్శకురాలుగా రాణిస్తున్న బృంద మాస్టర్ ఇటీవలే మెగాఫోన్ పట్టి హే సినామికా అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్, నటి ఇలా, అతిథి రావ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రంతో బృందా మాస్టర్ దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈమె కుమరి మావట్టత్తిన్ దగ్స్ పేరుతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఇది ఆమె తొలి చిత్రానికి పూర్తిగా భిన్నమైన కథ, కథనాలతో ఉండటం విశేషం. కమర్షియల్ అంశాలతో కూడిన పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా కుమరి మావట్టత్తిన్ దగ్స్ చిత్రాన్ని బృందా మాస్టర్ తెరకెక్కించారు. హెచ్ ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శిబు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా హ్రిదు హారన్ కథానాయకుడుగా పరిచయం అవుతున్నారు.
ఈయన ఇంతకుముందే బాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కాగా నటి అన స్వరాజన్, సింహ, ఆర్కే సురేష్, మునీశ్‌కాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సేమ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా కుమరి మావట్టత్తిన్ దగ్స్ చిత్ర పరిచయ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి చెన్నైలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఇందులో చిత్ర యూనిట్‌తో పాటు నటి కుష్భు, దర్శకుడు కె.భాగ్యరాజ్, గౌతమ్ మీనన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నటి కుష్బు మాట్లాడుతూ బృంద తనకు బెస్ట్ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. ఆమె చూడ్డానికి కూల్‌గా కనిపించినా, షూటింగ్ స్పాట్‌లో మాత్రం ఫైర్‌గా ఉంటారని పేర్కొన్నారు. అలాంటి ఆమె యాక్షన్ కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని చేయడంలో ఆశ్చర్య పడాల్సిన పని లేదన్నారు. ఈ చిత్రాన్ని తాను చశానని కచ్చితంగా ఇది సంచలన విజయం సాధిస్తుందని అన్నారు. త్వరలో చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి నవంబర్ నెలలో చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడం, హిందీ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment