‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(ఎస్‌వీసీ) బ్యానర్‌ని 2003లో స్థాపించి ‘దిల్’ సినిమాతో నిర్మాతగా ప్రయాణం ప్రారంభించాను. ఎస్‌వీసీపై 50వ సినిమా చేస్తున్నాం. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఓ లోగో డిజైన్ చేశారు.. దేవుడి ఆశీర్వాదాలతో నా జీవితంలో ఎస్‌వీసీ లోగోను కూడా అలా చూడాలని ఉంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్, జీ 5 కాంబినేషన్‌లో ఎస్. హరీష్ శంకర్, హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా చంద్రమోహన్ డైరెక్షన్‌లో ‘ఏటీఎమ్’ అనే వెబ్ సిరీస్ రూపొందనుంది. గురువారం విలేకరుల సమావేశంలో ఈ వెబ్ సిరీస్ వివరాలను వెల్లడించారు.
‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘దిల్’ రాజు ప్రొడక్షన్‌లో ప్రయోగాత్మక సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తాయి. ‘హిట్, జెర్సీ’ సినిమాలతో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ త్వరలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక తెలుగులో హర్షిత్, హన్షితలకు ‘దిల్’ రాజు ప్రొడక్షన్ బాధ్యతలను నేను, శిరీష్ అప్పగించాం’’ అన్నారు. ‘‘ఏటీఎమ్’ స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే హాలీవుడ్ తరహాలో ఉంటుంది’’ అన్నారు ‘జీ 5’ వైస్ ప్రెసిడెంట్ పద్మ. ‘‘ఏటీఎమ్’ తొలి సీజన్ ఏడు ఎపిసోడ్స్ ఉంటుంది’’ అన్నారు డైరెక్టర్ చంద్రమోహన్. ‘‘ఎస్‌వీసీని సినిమా రంగంలో ఆదరించినట్టే ‘దిల్’ రాజు ప్రొడక్షన్‌ని డిజిటల్ మాధ్యమంలోనూ ఆదరించాలి’’ అన్నారు హన్షిత రెడ్డి. ‘‘మా మేనేజర్ కల్యాణ్‌గారి వల్లే ‘ఏటీఎమ్’ కథను రాశాను’’ అన్నారు ఎస్. హరీష్ శంకర్.
Comments
Please login to add a commentAdd a comment