‘‘ఒక్కో సినిమాకు ఒక్కో ప్రయత్నం చేస్తుండాలి. నేను అదే చేస్తాను. ‘నేను.. శైలజ’ చిత్రంలో తండ్రీ కూతుళ్ల కథను చెప్పా. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రంలో స్నేహం గురించి చెప్పాను. ‘చిత్రలహరి’ ఓ లూజర్ కథ. స్క్రిప్ట్‌లో నిజాయతీ ఉన్నప్పుడు సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతాను. ఆ నమ్మకంతోనే ఇప్పుడు ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో మహిళల ప్రాముఖ్యతను చెప్పే ప్రయత్నం చేశాను’’ అన్నారు కిశోర్ తిరుమల.
శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించగా, రాధిక, ఖుష్బూ, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో కిశోర్ తిరుమల మాట్లాడుతూ.. ‘‘ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో వెంకటేశ్‌గారితో ఓ సినిమా అనుకున్న మాట వాస్తవమే కానీ ఆ కథ ఇది కాదు. నేపథ్యం ఒకటే అయినా కథ మారింది.
మన కుటుంబాల్లోని మహిళలు మనకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ మన జీవితాలను తీర్చిదిద్దాలనుకుంటుంటారు. కొందరు మహిళలు చిన్న చిన్న ఆనందాలకే సంతోషపడిపోతుంటారు. వారు తమ పురుషులపై భారీ డిమాండ్స్ చేయరు. అలాంటి మహిళలకు గుర్తుగా ఓ సినిమా తీయాలనిపించి ఈ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ తీశాను. శర్వాకు ఈ కథ వినిపించినప్పుడు హ్యాపీ ఫీలయ్యాడు. ఐదుగురు అక్కాచెల్లెళ్ళు ఉన్న ఓ యువకుడి కథే ఈ చిత్రం. ఆ ఐదుగురి అక్కాచెళ్లళ్ళ భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది.
ఈ సినిమా కథ విని రష్మిక బాగా ఎంజాయ్ చేశారు. ఓ అమ్మాయిలా మీరు ఎలా ఆలోచించగలుగుతున్నారు? అని అడిగారు. అలాగే ‘ఉన్నది ఒకటే జీవితం’ సమయంలో కూడా ‘ఒక అమ్మాయి మాత్రమే ఇలాంటి డైలాగ్స్ చెప్పగలదు. మీరు అలానే రాస్తున్నారు’ అని అనుపమ అన్నారు. ఇలా స్క్రిప్ట్ రాయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ‘ఆడవాళ్లు..’లో ప్రతి పాట కథను ముందుకు నడుపుతుంది. దేవిశ్రీ ప్రసాద్ మంచి పాటలిచ్చారు. మా సినిమా రిలీజ్ అనేది నిర్మాతల చేతుల్లో ఉంటుంది. (‘భీమ్లానాయక్’ ఈ నెల 25న వస్తోంది కాబట్టి ‘ఆడవాళ్లు..’ విడుదల వాయిదా పడుతుందా? అనే ప్రశ్నకు సమాధానంగా) నా తర్వాతి చిత్రం నాగచైతన్య హీరోగా ఉంటుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment