త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ బర్త్‌డే స్పెషల్‌ | Director Trivikram Srinivas Birthday Special Story | Sakshi
Sakshi News home page

Trivikram Srinivas: 'మాటల మాంత్రికుడి పెన్ను పవర్‌ అదే.. తూటాల్లా డైలాగులు'

Published Sun, Nov 7 2021 12:55 PM | Last Updated on Sun, Nov 7 2021 2:31 PM

Director Trivikram Srinivas Birthday Special Story - Sakshi

టాలీవుడ్‌  టాప్‌ దర్శకుడు, మాటల మాంత్రికుడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కి ఆయన పెన్‌పవర్‌ తోడైతే స్టార్‌ హీరోలకు జల్సానే.  తన పవర్‌ ఫుల్‌ డైలాగులతో నవ్విస్తాడు.. ఏడిపిస్తాడు.. చురకలు వేస్తాడు..థియేటర్లలో సీటీల మోత  మోగిస్తాడు. ఆయనే ఆకెళ్ల నాగ శ్రీనివాస్ అలియాస్‌ త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల రచయితనుంచి టాప్ డైరెక్టర్‌గా తన టాలెంట్‌ ఖలేజాను తెలుగు తెరకు రుచి చూపించిన ఈ భీమవరం బుల్లోడికి హ్యాపీ బర్త్‌డే అంటోంది. సాక్షి. కామ్‌.

న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్టు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సాహిత్యంపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించడం టాలీవుడ్‌ చేసుకున్న  అదృష్టమనే చెప్పాలి. అలాగే డైలాగు రైటర్‌గా కరియర్‌ మొదలుపెట్టి దర్శకత్వంవైపు  అడుగులు వేయడమేకాదు,  పలు బ్లాక్‌ బ్లస్టర్‌ మూవీలను అందించడం తెలుగు ప్రేక్షకుల  భాగ్యం. యాక్షన్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌, కామెడీ, చక్కటి సాహిత్యం, మాంచి మెలోడీ ఇవన్నీ కలగలసిన చక్కటి విందు త్రివిక్రమ్‌ సినిమాలు.

అలా మొదలైన మాటల ప్రస్థానం
1972, నవంబర్ 7న జన్మించిన  శ్రీనివాస్‌కు సక్సెస్‌ అంత  సులువుగా వచ్చిందేమీ కాదు. అంది వచ్చిన అవకాశాల్ని  ఒక రేంజ్‌లో వాడుకొని తానేంటో నిరూపించుకున్నాడు. 1999 లో స్వయంవరం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆయన,  త్రివిక్రమ్‌  డైలాగులుంటే చాలు  సినిమా హిట్‌ అన్న నమ్మకాన్ని కలిగించాడు. సముద్రం, నిన్నే ప్రేమిస్తా, చిరునవ్వుతో, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు ఈ కోవలోకే వస్తాయి. ఈ విజయాలతో ఆయన  సంతృప్తి చెంది ఆగిపోలేదు. డైరెక్టర్‌గా రెండో అవతారమెత్తి శభాష్‌ అని పించుకున్నాడు.

డెబ్యూ మూవీ ‘నువ్వే నువ్వే’తో  సూపర్‌ సక్సెస్‌ అందుకున్నాడు. దీనికి తోడు ఆయన డైలాగులు ఉండనే ఉన్నాయి.  2005లో సూపర్‌ స్టార్‌మహేష్‌ బాబు హీరోగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అతడు’ ఎంత హిట్టో చెప్పాల్సిన పనేలేదు. మాటల రచయితగా త్రివిక్రమ్ నంది అవార్డులను అందుకున్నారు. అంతేకాదు ఈ సినిమా బుల్లితెరపైకూడా పెద్ద సంచలనం. త్రిష, మహేష్‌ జోడీ,  పాటలు, మ్యూజిక్‌  అన్నీ సూపర్‌డూపర్‌ హిట్టే .2004లో వచ్చిన మల్లీశ్వరి  మూవీకి కథ,మాటలు అందించారు త్రివిక్రమ్‌. పెళ్లి కాని ప్రసాద్‌ అంటూ  విక్టరీ వెంకటేష్‌తో పండిచిన కామెడీ అద్భుతంగా పండింది.  

పవన్‌ కల్యాణ్‌కు మాంచి కిక్కిచ్చిన జల్సా
2008లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు మాంచి కిక్కు ఇచ్చిన మూవీ  ‘జల్సా . వరస ప్లాపుల్లో ఉన్న పవన్‌కు ముచ్చటగా మూడో చిత్రంతో  అదిరిపోయే హిట్‌ ఇచ్చాడు త్రివిక్రమ్‌. ఈ మూవీ డీఎస్‌పీ మ్యూజిక్‌ మరో ఎసెర్ట్‌.  పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో పాత రికార్డులన్నింటినీ తిరగ రాయడమే పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు బీజం వేసింది ఈ చిత్రం. మహేష్ బాబు వాయిస్ ఓవర్‌తో చేసిన ప్రయోగం మరో హైలెట్‌గా నిలిచింది.

మహేశ్‌లోని కామెడీ యాంగిల్‌ను చూపించిన 'ఖలేజా'
ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబులోని కామెడీ యాంగిల్‌ను ఫస్ట్ టైమ్ చూపించిన సినిమా ‘ఖలేజా’. కమర్షియల్‌గా  పెద్ద సక్సెస్‌ కాకపోయినా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్మెంట్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.  యాక్షన్  అండ్‌ లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ ఉన్న టాలీవుడ్‌ ప్రిన్స్  కామెడీ టైమింగ్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు.   ఇప్పటికీ ఇది బుల్లితెర బ్లాక్‌ బస్టరే. రియల్‌ హీరో సోనూసూద్‌ విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచేయం చేసిన మూవీ జులాయి. ఖలేజా కలెక్షన్లతో నిరాసపడిన త్రివిక్రమ్‌ను దర్శకుడిగా  మళ్ళీ జులాయి ఊపుని ఇచ్చింది. కామెడీతోపాటు,  త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ , ముఖ్యంగా బన్నీ క్యారెక్టరైజేషన్,  ఇలియానా గ్లామర్ వెరసి కలెక్షన్ల వర్షం కురిసింది.

100 కోట్ల క్లబ్‌తో సరికొత్త రికార్డు
వీరు ఆరడుగుల బుల్లెట్టూ, ధైర్యం విసిరిన రాకెట్టు అంటూ 2013లో  పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో  బ్లాక్‌ బస్టర్‌మూవీ సినిమా ‘అత్తారింటికి దారేది’. వీరిద్దరి కాంబినేషన్‌లోనే వచ్చిన జల్సా రికార్డులను చెరిపేయడమే  100 కోట్లపైగా వసూళ్లతో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. అలనాటి హీరోయిన్‌ను నదియాను హీరో అత్తగా గ్లామరస్‌గా ప్రెజెంట్‌ చేసిన తీరు బాగా కనెక్ట్ అయ్యింది. ట్రెండ్‌ సెట్‌ చేసింది. అయితేపవన్ కళ్యాణ్‌తో  చేసిన మూడో చిత్రం  ‘అజ్ఞాతవాసి’  మాత్రం త్రివిక్రమ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌ అనే పేరును మూటగట్టుకుంది. 

సెంటిమెంట్‌తో..‘సన్ ఆఫ్ సత్యమూర్తి’
నాన్న అంటే మరిచిపోలేని ఓ జ్ఞాపకం అంటూ  నాన్న సెంటిమెంట్‌తో 2015లో వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’  త్రివిక్రమ్ కాంబినేషన్‌తో అల్లు అర్జున్‌కు మరో భారీ హిట్‌ ఇచ్చింది. ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ హీరో నితిన్, సమంత కాంబోలో వచ్చిన చక్కటి  చిత్రం ‘అ..ఆ కూడా సక్సెస్‌ఫుల్‌గా నడించింది. అలాగే 2020లో  వీరిద్దరి కాంబోలో ‘అల వైకుంఠపురములో’  రేపిన ప్రభంజనం మామూలుదికాదు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో ఎస్‌ ఎస్‌ థమన్‌ సంగీతంలో ‘బుట్ట బొమ్మ’‘రాములో రాములో’ సామజవరగమన పాటలు కొల్లగొట్టిన రికార్డులు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.    త్రివిక్రమ్‌ తన సినిమాల్లోకి పాటలకు, సంగీతానికి ఎంత ప్రాధాన్యం ఇస్తాడో నిరూపించిన మ్యూజికల్‌హిట్స్‌ ఇవి.

 2018లో యంగ్‌ హీరో ఎన్టీఆర్‌కు త్రివిక్రమ్‌ అందించి బిగ్గెస్ట్‌ హిట్‌ ‘అరవింద సమేత వీర రాఘవ’.  రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో  విలన్‌గా జగపతి బాబును, రాయలసీమ యాసలో ఎన్టీఆర్‌ను ఫెరోషియస్‌గా చూపించడంలో త్రివిక్రమ్ పుల్‌ మార్కులు కొట్టేశాడు. 150 కోట్లకు పైగా వసూళ్లతో తన స్టామినాను  ప్రూవ్‌ చేసుకున్నాడు త్రివిక్రమ్‌.

'బీమ్లానాయక్‌'కు మాటల తూటాలు
ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో రెండు,మహేష్‌బాబుకు మరో హిట్‌  ఇచ్చేందుకు రడీ అవుతున్నాడు.  టాలీవుడ్‌కు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన త్రివిక్రమ్ మలయాళంలో సూపర్ హిట్  మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుం’ మూవీని తెలుగు రీమేక్  బీమ్లానాయక్‌కు  మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండంటం విశేషం. ఈ మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీపై  అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. 

2002లో త్రివిక్రమ్, క్లాసికల్ డ్యాన్సర్ సౌజన్యను పెళ్లి చేసుకున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.  చిరునవ్వు మూవీకిగాను బెస్ట్ డైలాగ్ రైటర్ గా, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే, మల్లీశ్వరి, అతడు, అత్తారింటికి దారేది సినిమాలకి నంది అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఉత్తమ దర్శకుడిగా అతడు, అత్తారింటికి దారేది సినిమాలకి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లభించాయి.

-సాక్షి, వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement