ఒక్కోసారి మన కళ్లు మనల్నే మోసం చేస్తున్నాయా? అనిపిస్తుంది! రంగుల ప్రపంచంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న కొందరు తారలు తర్వాత గుర్తుపట్టలేని స్థితికి మారిపోయారు. చేతినిండా డబ్బులుండే స్థితి నుంచి ఒకరి దగ్గర చేతులు చాచి అడగాల్సిన పరిస్థితికి దిగజారిపోయారు. తెలుగు, తమిళం, హిందీ అని కాకుండా అన్ని భాషల్లోనూ ఇలాంటి దుస్థితిని ఎదుర్కొన్న తారలు ఉన్నారు.
ఒకప్పటి ఆ సెలబ్రిటీయేనా ఇలాంటి హీనస్థితిలో ఉంది? అని అభిమానులు కళ్లు చెమర్చుకున్న రోజులున్నాయి. హీరోయిన్ మిథాలి శర్మ కూడా అందనంత ఎత్తుకు వెళుతుందనుకుంటే అందరి దగ్గర భిక్షమడిగే స్థాయికి దిగజారింది. అందుకు గల కారణాలేంటి? అసలు తనకు ఏమైంది? అనేది ఈ కథనంలో చదివేద్దాం..
ఇంటితో సంబంధం కట్
మిథాలి శర్మ.. భోజ్‌పురిలో ఫేమస్ హీరోయిన్. ఈమె స్వస్థలం ఢిల్లీ. ఎప్పటికైనా టీవీలో కనిపించాలనుకున్న ఆమె అందుకోసం ఇంటి నుంచి పారిపోయింది. ఒంటరిగా ముంబై వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడే ఆమెతో సంబంధాలు తెంచేసుకుంది మిథాలి కుటుంబం. ఇక ముంబైలో చెప్పులరిగేలా తిరిగిన మిథాలి తొలుత మోడలింగ్ చేసింది. తర్వాత సినిమాలు చేసింది, బాగానే క్లిక్ అయింది. దీంతో దర్శకనిర్మాతలు ఈమెతో సినిమా తీసేందుకు పోటీపడ్డారు. ఆ రేంజ్‌లో క్రేజ్ అందుకుంది.
పని దొరక్క డిప్రెషన్‌లోకి..
కానీ, సడన్‌గా అంతా మారిపోయింది. అదృష్టం బాలేకపోతే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుందన్నట్లు తన జీవితంలో బ్యాడ్ టైమ్ మొదలైంది. తను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌టాక్‌ను మూటగట్టుకున్నాయి. అవకాశాలు తగ్గిపోయాయి. చాలాకాలం చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. నెలలు కావస్తున్నా పని దొరక్కపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అలాగే కూర్చుంటే కడుపు నిండదు కదా.. పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేయాలనుకుంది. అందుకే భిక్షాటన మొదలుపెట్టింది. ముంబై వీధుల్లో కనిపించినవారినల్లా నాలుగు రూపాయలు దానం చేయమని కోరింది.
భిక్షాటన చేస్తూ పోలీసులకు దొరికిన హీరోయిన్
ఆ మధ్య ముంబై లోఖండ్‌వాలాలో భిక్షాటన చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేయగా అందులో మిథాలి శర్మ కూడా ఉంది. తన చేతికి మహిళా పోలీసు బేడీలు వేస్తుంటే మిథాలి ఆమెను తిట్టిందని, అక్కడి నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నించిందని వార్తలు వచ్చాయి. చివరకు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా మిథాలి తనకు కాస్త అన్నం పెట్టమని అడిగిందట! దీంతో ఆమెకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన పోలీసులు తన మానసిక స్థితి సరిగా లేదని గ్రహించారు. దీంతో తనను మానసిక వికలాంగుల ఆశ్రమంలో చేర్పించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం మిథాలి శర్మ ఎక్కడుంది? ఎలా ఉంది? అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.
చదవండి: సినీప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఒకే సినిమాలో ఇద్దరు లెజెండరీ హీరోలు!
Comments
Please login to add a commentAdd a comment