
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణం బాలీవుడ్‌కు చెమటలు పట్టిస్తోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణలో టాప్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్ పేర్లు బయటకు వచ్చినట్లు ఇప్పటికే వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా నటి దియా మీర్జా పేరు తెరపైకి వచ్చింది. ఆమెకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు డ్రగ్ డీలర్స్ ఎన్‌సీబీ అధికారుల విచారణలో వెల్లడించారని, దీంతో దియాతో పాటు, ఆమె మేనేజర్‌ను కూడా విచారణకు పిలిచే అవకాశమందంటూ కథనాలు వినిపిస్తున్నాయి. (చదవండి: ఎన్‌సీబీ జాబితాలో దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్ పేర్లు)
ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన దియా తనెప్పుడూ మాదక ద్రవ్యాలను తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా నిరాధారమైన, తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. ఇలాంటి ఆరోపణలు.. తన ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా తనెంతో కష్టపడి నిర్మించుకున్న కెరీర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదంటూ వరుస ట్వీట్లు చేశారు. కాగా ఈ కేసులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు బయటపడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. (చదవండి: ముంబై డ్రగ్స్ కేసు: తెరపైకి నమ్రత పేరు)