Drushyam 2 Movie Review And Rating In Telugu | Venkatest Drushyam 2 Telugu Movie Review - Sakshi
Sakshi News home page

Drushyam 2 Review: దృశ్యం 2 మూవీ ఎలా ఉందంటే..?

Published Thu, Nov 25 2021 9:47 AM | Last Updated on Thu, Nov 25 2021 1:16 PM

Drushyam 2 Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : దృశ్యం2
నటీనటులు : వెంకటేష్, మీనా, కృతికా, ఈస్టర్ అనిల్, నదియా, నరేష్, పూర్ణ, వినయ్ వర్మ తదితరులు
నిర్మాణ సంస్థలు : సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్
కథ, దర్శకత్వం :  జీతు జోసెఫ్ 
సంగీతం :  అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : సతీష్ కురుప్ 
ఎడిటర్‌: మార్తాండ్ కే
విడుదల తేది : నవంబర్‌ 25,2021

ఈ ఏడాది ప్రైమ్ లో చాలా కొత్త చిత్రాలు వచ్చాయి. కాని కొన్ని మాత్రమే నెటిజన్స్ ను మెప్పించడంతో పాటు ప్రైమ్ కు బోల్డంత పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి సినిమాల్లో ఒకటి దృశ్యం 2, మలయాళ వర్షన్. దృశ్యం మొదటి భాగం థియేటర్స్ లో దుమ్మురేపింది. దృశ్యం 2 మలయాళ వర్షన్‌ ప్రైమ్ లో విడుదలై  ఓటీటీ వరల్డ్ ను షేక్ చేసింది. ఇప్పుడు అదే దారిలో తెలుగు వర్షన్ కూడా వెళ్లింది.  విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం 2 తెలుగు వర్షన్‌ నేటి (నవంబర్‌ 25)నుంచి ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఎన్నో అంచనాల మధ్య ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

 

దృశ్యం 2 కథేటంటే..?
దృశ్యం మూవీ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి 'దృశ్యం 2' సినిమా మొదలవుతుంది. తన ఇంట్లో హత్యకు గురైన వరుణ్‌ అనే కుర్రాడి శవాన్ని రాంబాబు (వెంకటేశ్) కన్ స్ట్రక్షన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో పాతిపెట్టడంతో ‘దృశ్యం’ సినిమా ముగుస్తుంది. ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన రాంబాబు ఫ్యామిలీ ఉన్నత జీవితాన్ని గడుపుతుంటుంది. కెబుల్‌ బిజినెస్‌ చేసే రాంబాబు.. అంచెలంచెలుగా ఎదిగి సినిమా థియేటర్‌ ఓనర్‌ అవుతాడు. అంతేకాదు ఏకంగా ఓ సినిమాను నిర్మించేందుకు రంగంలోకి దిగుతాడు. ఇలా వారి జీవితంగా సాఫీగా సాగుతున్నప్పటీకీ.. వరుణ్‌ కేసు తాలూకు భయాలు మాత్రం అతడి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాయి.  పోలీసులు ఎక్కడ కనిపించినా చాలు  రాంబాబు భార్య జ్యోతి(మీనా, పిల్లలు అంజు (కృతిక), అను( ఏస్తర్‌ అనిల్‌) భయంతో వణికిపోతుంటారు. ఇదే క్రమంలో  రాంబాబు జీవితంలోకి మళ్లీ పోలీస్ ఆఫీసర్ గీతా ప్రభాకర్ (నదియా), ప్రభాకర్ (నరేష్) మళ్లీ ప్రవేశిస్తారు. ఎలాగైనా రాంబాబు మీద పగ తీర్చుకోవాలని భావించిన గీత... తన స్నేహితుడు, ప్రస్తుతం ఐజీపీగా ఉన్న గౌతమ్‌ సాహు(సంపత్‌ రాజ్‌)సహాయంతో మళ్లీ ఆ కేసును రీఓపెన్‌ చేయిస్తుంది. మరి వరుణ్‌ కేసులో పోలీసులకు దొరికి ఆధారాలేంటి?  కేసు నుంచి తన ఫ్యామిలీని  కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? సరికొత్త సాక్ష్యాలతో రాంబాబు కుటుంబాన్ని కోర్టుకు ఈడ్చినప్పుడు ఈసారి అతను ఎలా బయటపడ్డాడు అనేదే ‘దృశ్యం 2’కథ.

ఎవరెలా చేశారంటే..?
రాంబాబు పాత్రలో వెంకటేశ్‌ ఒదిగిపోయాడు. దృశ్యం మాదిరే.. ఇందులో కూడా కథ మొత్తాన్ని తన భుజానా వేసుకొని నడిపించాడు.  ‘దృశ్యం’లో కంటే ఈ సీక్వెల్ లో చాలా ఈజ్ తో ఆ పాత్రను పోషించాడు. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ని అద్బుతంగా పండించాడు. ఈ మూవీతో వెంకటేశ్‌ నటుడిగా వెంకటేశ్‌ మరో మెట్టు ఎక్కాడనే చెప్పాలి. రాంబాబు భార్య జ్యోతి పాత్రకు మీనా న్యాయం చేసింది. నటన పరంగా బాగానే ఉన్నా.. డబ్బింగ్‌ అంతగా సూట్‌ కాలేదు. ఇక రాంబాబు పిల్లలుగా కృతిక, ఎస్తర్‌ అనిల్ కు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులుగా నదియా, నరేశ్‌ తమ పాత్రల్లో చక్కగా నటించారు.  ఐజీగా సంపత్‌ రాజ్‌, కానిస్టెబుల్‌గా సత్యం రాజేశ్‌, రాంబాబు లాయర్‌ గా పూర్ణ, రచయితగా తనికెళ్ల భరణితో పాటు మిగిలిన నటీ,నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే..
దృశ్యం’కు సీక్వెల్‌ ఇది. అదే తారాగణం. అదే నేపథ్యం. అదే కొనసాగింది. తల్లీకూతుళ్లు కుర్రాణ్ణి హత్య చేసిన ఆరేళ్ల తర్వాత నుంచి కథ మొదలవుతుంది. ఈ మూవీ మలయాళ వర్షన్‌ ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజై, సూపర్‌ హిట్‌ అయింది. అయినా.. మళ్లీ తెలుగు ప్రేక్షకుల కోసం దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఫ్రెష్‌ లుక్‌తో ఈ మూవీని తెరకెక్కించాడు. మాతృకతో పోలిస్తే.. తెలుగు వర్షన్‌లో కొన్ని స్వల్ప మార్పులు చేశాడు దర్శకుడు. మలయాళంలో చివరి వరకు చెప్పని కొన్ని ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌ని తెలుగులో ముందుగానే చెప్పాడు.

మొదట కొంత భాగం బోర్ కొట్టించినా.. వరుణ్‌ కేసును పోలీసులు సీక్రెట్‌గా విచారిస్తున్నారని తెలియడంతో ప్రేక్షకుడిలో ఉత్కంఠ పెరుగుతుంది. ఎవరూ ఊహించని ట్విస్టులతో సినిమాపై ఆసక్తి పెంచేశాడు దర్శకుడు. సెకండాఫ్‌లో కథ చాలా స్పీడ్‌గా వెళ్తుంది. కేసు నుంచి తన ఫ్యామిలీని  కాపాడుకునేందుకు రాంబాబు వేసే ఎత్తులు, పైఎత్తులు చాలా ఉత్కంఠభరితంగా సాగుతాయి. ముఖ్యంగా చివరిలో రాంబాబు ఇచ్చే ట్విస్ట్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. కోర్టు సన్నివేశాలు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్తాయి. మొత్తంగా దృశ్యం 2’ సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనమనే చెప్పాలి. ఇక సాంకేతిక విషయాలకొస్తే..అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం అదిరిపోయింది. సతీష్ కురూప్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ప్రతి ఫ్రేమ్‌ని అందంగా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దాడు.ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ తన కత్తెరకు  ఇంకాస్త పని చెప్పితే బాగుండేది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 



ప్లస్ పాయింట్స్
వెంకటేశ్‌ నటన
కథ, కథనం
సెకండాఫ్‌, క్లైమాక్స్‌

మైనస్‌ పాయింట్స్‌
ఫస్టాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement