‘‘నేను ఇప్పటి వరకూ గ్యాంగ్‌స్టర్ సినిమాలు చేయలేదు. తొలిసారి ‘కింగ్ ఆఫ్ కొత్త’ చేశాను. ఈ కథ రెండు పీరియడ్స్‌లో ఉంటుంది. పాటలు, యాక్షన్ సీక్వెన్స్, ఫుట్ బాల్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలున్నాయి. ఇందులో ప్రతి పాత్ర కథని మలుపు తిప్పుతుంది. అది నాకు చాలా నచ్చింది’’ అని హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, మలయాళం, తమిళ్, హిందీలో ఈ నెల 24న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ పంచుకున్న విశేషాలు....
► అభిలాష్, నేను చిన్ననాటి స్నేహితులం. ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటే ‘కింగ్ ఆఫ్ కొత్త’కి కుదిరింది. మంచి గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. స్నేహం కూడా ఉంటుంది. నేను ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను. కానీ, ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ఇవ్వాలని ఈ మూవీ కోసం ఏడాది శ్రమించా. సాంకేతికంగా ఈ మూవీ పెద్ద స్థాయిలో ఉంటుంది.
► కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. అదొక ఫిక్షనల్ టౌన్. అయితే తెలుగులో కొత్త అనే పదానికి కొత్తది అనే అర్థం వస్తుంది. అందుకే డబ్బింగ్‌లో కోత అని చెప్పాం. ప్రేక్షకులకు నేను ఎక్కువగా లవర్ బాయ్‌గా గుర్తుంటాను(నవ్వుతూ). ఒకేరకమైన కథలు, పాత్రలు చేయాలని ఉండదు. ప్రేక్షకులతో పాటు నటుడిగా నాకు నేను సర్‌ప్రైజ్ అయ్యే పాత్రలు చేయాలని ఉంటుంది. ఈ మూవీ కోసం తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను. ఓ రకంగా ఇప్పుడు నేను డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని కూడా (నవ్వుతూ).
► ఐశ్వర్య లక్ష్మి చాలా ప్రతిభ ఉన్న నటి. ఈ మూవీలో తన పాత్ర కీలకంగా ఉంటుంది. నిమేష్ రవి విజువల్స్, జాక్స్ బిజోయ్ సంగీతం సినిమాకు ప్లస్. సినిమాని కాపాడాలి, మంచి సమయంలో రిలీజ్ చేయాలంటే మనమే నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌లో ఉండాలని వేఫేరర్ ఫిల్మ్స్ స్టార్ట్ చేశాను. ప్రస్తుతం నేను, రానా కలిసి ‘కాంత’ చేస్తున్నాం. తెలుగు, ఇతర పరిశ్రమల నుంచి నేర్చుకున్న ఎన్నో విషయాలను మలయాళంలో అనుసరిస్తున్నాను. ప్రస్తుతం తెలుగులో వెంకీ అట్లూరిగారి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా చేస్తున్నాను. మరికొన్ని కథలు వింటున్నాను. ప్రభాస్‌గారి ‘కల్కి 2898 ఏడీ’లో నేను నటిస్తున్నానా? లేదా? అన్నది మేకర్సే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment