టైటిల్: ఫ్యామిలీ స్టార్
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, వాసుకి, రోహిణీ హట్టంగడి, అభినయ, అజయ్ ఘోష్
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
రచన-దర్శకత్వం: పరశురామ్ పెట్ల
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
విడుదల తేది: ఏప్రిల్ 5, 2024
కథేంటంటే..
గోవర్ధన్(విజయ్ దేవరకొండ) ఓ మిడిల్ క్లాస్ యువకుడు. ఫ్యామిలీ అంటే అతనికి చాలా ఇష్టం. ఇద్దరు అన్నయ్యలు..వదినలు..వారి పిల్లలు..బామ్మ ఇదే తన ప్రపంచం. సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. పెద్దన్నయ్య మద్యానికి బానిసవడం.. చిన్నన్నయ్య బిజినెస్ అంటూ ఇంకా స్థిరపడకపోవడంతో ఫ్యామిలీ ఆర్థిక భారానంత గోవర్ధనే మోస్తాడు. అనవసరపు ఖర్చులు చేయకుండా.. వచ్చిన జీతంతోనే సింపుల్‌గా జీవనాన్ని కొనసాగిస్తున్న గోవర్ధన్ లైఫ్‌లోకి ఇందు(మృణాల్ ఠాకూర్) వచ్చేస్తుంది. తనతో పాటు తన ఫ్యామిలీకి బాగా దగ్గరవుతుంది. ఇద్దరు ప్రేమలో కూడా పడిపోతారు.
ఈ విషయం ఇరుకుటుంబాలలో చెప్పి, పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అని భావిస్తున్న సమయంలో ఇందు రాసిన ఓ పుస్తకం గోవర్ధన్ చేతికి వస్తుంది. ఆ పుస్తకం చదివి..ఇందుపై ద్వేషం పెంచుకుంటాడు గోవర్ధన్. అసలు ఆ పుస్తకంలో ఏం ఉంది? ఇందు ఎవరు? గోవర్ధన్ ఇంటికి ఎందుకు వచ్చింది? ఇందు రాసిన పుస్తకం వీరిద్దరి ప్రేమను ఎలా ప్రభావితం చేసింది? ఉన్నంతలో సర్దుకొని జీవించే గోవర్దన్ లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యాడు? అమెరికాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు ఇందు, గోవర్దన్‌లు ఎలా ఒక్కటయ్యారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
టాలీవుడ్‌లో ఫ్యామిలీ కథలు చాలా వచ్చాయి. అన్ని సినిమాల్లోనూ కుటుంబ బంధాలు.. ప్రేమానురాగాలు.. ఇదే కథ. ఆ కథను తెరపై ఎంత కొత్తగా చూపించారనేదానిపై సినిమా ఫలితం ఆధారపడుతుంది. అందుకే కొన్ని సినిమాల కథలు రొటీన్‌గా ఉన్న ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ‘గీతగోవిందం’. సింపుల్ కథతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లను కొల్లగొట్టింది.
అలాంటి కాంబినేషన్‌లో మరో సినిమా అంటే ప్రేక్షకుల్లో కచ్చితంగా భారీ అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలను తగ్గట్టుగా ‘ఫ్యామిలీ స్టార్’ కథను తీర్చిదిద్దడంలో దర్శకుడు పరశురామ్ పూర్తిగా సఫలం కాలేకపోయాడు. హాస్యం, మాటలు, కథనంతో మ్యాజిక్ చేసే పరశురామ్.. ఈ సినిమా విషయంలో వాటిపై పెట్టిన ఫోకస్ సరిపోలేదనిపిస్తుంది.
కథ పరంగా ఈ సినిమా చాలా చిన్నది. ఫ్యామిలీ భారమంతా మోస్తున్న ఓ మిడిల్ క్లాస్ యువకుడు.. తన సొంతప్రయోజనాల కోసం అతనికి దగ్గరైన ఓ యువతి.. ఇద్దరి మధ్య ప్రేమ.. గొడవలు.. చివరికి కలుసుకోవడం.. సింపుల్‌గా చెప్పాలంటే ‘ఫ్యామిలీ స్టార్’ కథ ఇదే. అంచనాలు లేకుండా వస్తే..ఈ కథకి అందరు కనెక్ట్ అవుతారు. కానీ ‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి.. ప్రేక్షకులు అంతకు మించి ఏదో ఆశిస్తారు. దాన్ని దర్శకుడు అందించలేకపోయాడు.
భారీ అంచనాలు ఉన్న సినిమాకు కావాల్సిన సరకు, సంఘర్షణ రెండూ ఇందులో మిస్ అయ్యాయి. అయితే హీరో క్యారెక్టరైజేషన్, కొన్ని సన్నివేశాలు మాత్రం విజయ్ ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటాయి. విజయ్ లుంగి కట్టుకొని తిరగడం.. ఉల్లి పాయల కోసం ఆధార్ కార్డులు పట్టుకొని క్యూలో నిలబడడం.. హీరోయిన్ లిఫ్ట్ అడిగితే పెట్రోల్ కొట్టించమని అడగడం.. చెంపదెబ్బలు తినడం ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తాయి.
‘అతనికి కాస్త తిక్కుంటుంది.. పిచ్చి ఉంటుంది.. వెర్రి ఉంటుంది’ అంటూ హీరో గురించి హీరోయిన్ చేత చెప్పిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. మిడిక్లాస్ యువకుడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో హీరో ఎంట్రీ సీన్‌తోనే చూపించాడు. ప్యామిలీ కోసం హీరో పడే పాట్లు.. అన్నయ్యలతో వచ్చే కష్టాలు చూపిస్తూనే ఇందు పాత్రను పరిచయం చేశాడు. ఆమె వచ్చిన తర్వాత కూడా కథనం రొటీన్‌గా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు అయితే మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి.
ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సీన్స్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తినికి పెంచుతుంది. ద్వితియార్థం ఎక్కువగా అమెరికాలోనే సాగుతుంది. అక్కడ హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఒకటి రెండు సీన్స్ మినహా మిగతావన్నీ బోర్ కొట్టిస్తాయి. మిడిల్ క్లాస్ యువకుడి మీద హీరోయిన్ థీసిస్ ఎందుకు రాసిందనేదానికి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయారు. ప్రీక్లైమాక్స్ బాగుంటుంది. పతాక సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. కొన్ని సంభాషణలు మాత్రం ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. కథ, కథనాన్ని మరింత బలంగా రాసుకొని, హాస్యంపై ఫోకస్ పెడితే ‘ఫ్యామిలీ స్టార్’ మరో లెవెల్ విజయం సాధించేది.
ఎవరెలా చేశారంటే..
మిడిల్ క్లాస్ యువకుడు గోవర్ధన్ పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోయాడు. తన డైలాగ్ డెలీవరీ, మ్యానరిజం సినిమాకు ప్లస్ అయింది. కథంతా తన భుజాన వేసుకొసి సినిమాను ముందుకు నడిపించాడు. తెరపై చాలా అందంగా కనిపించాడు. ఇక ధనవంతుల కుటుంబానికి చెందిన యువతి ఇందుగా మృణాల్ చక్కగా నటించింది. తెరపై విజయ్, మృణాల్‌ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. హీరో బామ్మగా రోహిణి హట్టంగడి తనదైన నటనతో ఆకట్టుకుంది. జగపతి బాబు, వెన్నెల కిశోర్, వాసుకి, అభినయతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికత విషయానికొస్తే.. గోపీ సుందర్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. అద్భుతమైన పాటలతో మంచి బీజీఎం అందించాడు. కేయూ మోహన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment