సింగర్ శ్రీను శ్రీకాకుళం 3,200కు పైగా పాటలు పాడాడు.. అవన్నీ జానపద గీతాలే! శ్రీకాకుళంలోని మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన ఆయన తనే సొంతంగా పాటలు రాసి పాడతాడు కూడా! అలా ఆయన రాసిన ఓ గీతాన్ని కాస్త అటూఇటుగా మార్చి అల వైకుంఠపురములో చిత్రంలో సిత్తరాల సిరపడుగా తీసుకొచ్చారు. సినిమాల్లోకి రావాలన్న ఆసక్తితో చిన్నతనంలోనే చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలి వచ్చేశాడు శ్రీను. తాజాగా ఆయన తన జర్నీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు .
'11 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి వెళ్లిపోయాను. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక సిద్దిపేట బస్టాండ్‌లోనే మూడు రోజులు తిండి లేకుండా గడిపాను. అప్పుడు ఉద్యమం జరుగుతున్న సమయం.. రసమయి బాలకిషన్ పరిచయం కావడంతో ఆయనతో కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. చాలా సీరియల్స్, సినిమాలకు కూడా పని చేశాను. భీమ్లా నాయక్, సరిలేరు నీకెవ్వడు సినిమాలకు బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్‌గానూ పని చేశాను. కానీ చాలామంది షూటింగ్ పూర్తయ్యాక డబ్బులివ్వకుండా మోసం చేసేవారు. ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ దసరా సినిమా డబ్బులు నాకింతవరకు ఇవ్వలేదు.
23 మంది ఆర్టిస్టులను గోదావరిఖని తీసుకెళ్లి వారం రోజులు అక్కడే ఉన్నాం. షూటింగ్ అయిపోక తిరిగొచ్చాం. కానీ చిత్రయూనిట్ పైసా ఇవ్వకపోవడంతో నేనే ఆర్టిస్టులకు సగం సగం డబ్బులిచ్చాను. దాదాపు రూ.70వేల దాకా ఖర్చయింది. నేను కూడా మొదట్లో జూనియర్ ఆర్టిస్టుగా, సెట్ బాయ్‌గా పని చేశాను. జూనియర్ ఆర్టిస్టులను చాలా చీప్‌గా చూస్తారు. చాలామంది క్యాస్టింగ్ డైరెక్టర్లు వారికిచ్చిన డబ్బులను ఆర్టిస్టులకు సమంగా పంచరు. ఐడీ కార్డు ఉన్న జూనియర్ ఆర్టిస్టులకు రూ.900, ఆ కార్డు లేని వాళ్లకు ఐదారు వందలు, ఒక్కోసారైతే మూడు వందలు కూడా ఇస్తారు. నేను మాత్రం అందరికీ రూ.900 ఇస్తాను' అని చెప్పుకొచ్చాడు సింగర్ శ్రీను.
చదవండి: అవును, నేను తండ్రినయ్యా.. ఇకపై కుటుంబానికే సమయం కేటాయిస్తా: ప్రభు దేవా
Comments
Please login to add a commentAdd a comment