
సాక్షి, ముంబై: మహిళలు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నావారి అందం, సామర‍్ధ్యంపై చవకబారు కమెంట్స్, అనుచిత వ్యాఖ్యానాలు నిరంతరం మనం చూస్తూనే ఉంటాం. దీనికి సాధారణ వ్యక్తులనుంచి సూపర్ స్టార్లు, సెలబ్రిటీలు ఎవ్వరూ అతీతులు కాదు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో వివక్షా పూరిత వ్యాఖ్య చేశారు. దీంతో ట్విటర్‌లో దుమారం రేగుతోంది.
తన పాపులర్ షోలో భాగంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ చీఫ్ ఎకనామిస్ట్‌గా ఉన్న గీతా గోపీనాథ్‌కు సంబంధించిన ప్రశ్నను ఒక మహిళా కంటెస్ట్‌కు సంధించారు అమితాబ్. 2019నుండి గీతా గోపీనాథ్ ఏ సంస్థకు ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్నారనే ప్రశ్నను అడిగారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే ఆయన తన నైజాన్ని చాటుకున్నారు. గీతా ఫోటోను తెరపై చూపిస్తూ చాలా అలవోకగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆమె ఫేస్ ఎంత అందంగా ఉంది..ఆర్థికవ్యవస్థతో ఆమె అందాన్ని ఎవరైనా జోడించి చూడగలమా ’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
దీనికి సంబంధించిన ఈ వీడియోను గోపీనాథ్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమితాబ్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌కుపెద్ద అభిమానిననీ తనకు ఈ వీడియో చాలా ప్రత్యేకమైనదంటూ ట్వీట్ చేయడం విశేషం. "గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్" అని కూడా ఆమె అభివర్ణించారు. కానీ బిగ్‌బీ సెక్సిస్ట్ వ్యాఖ్యలపై ట్విటర్ యూజర్లు మాత్రం మండిపడుతున్నారు. ఆయన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ బిజినెస్ ఛానల్ యాంకర్, సీనియర్ ఎనలిస్ట్ లతా వెంకటేష్ సహా పలువురు ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. అతి చిన్న వయసులోనే గీతా గోపీనాథ్ సాధించిన గౌరవాన్ని గుర్తించకుండా, ఆమె అందాన్ని ప్రస్తావించడం విచారకరమని విమర్శిస్తున్నారు.
Ok, I don't think I will ever get over this. As a HUGE fan of Big B @SrBachchan, the Greatest of All Time, this is special! pic.twitter.com/bXAeijceHE
— Gita Gopinath (@GitaGopinath) January 22, 2021