టైటిల్: ది గోట్ లైఫ్
నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు
నిర్మాణం:జువల్ రొమాన్స్
దర్శకత్వం: బ్లెస్సీ
సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: సునీల్ కేఎస్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
విడుదల తేది: మార్చి 28, 2024
నజీబ్(పృథ్వీరాజ్ సుకుమారన్) ఊర్లో ఇసుక పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. భార్య సైను(అమలాపాల్) గర్భవతి. పుట్టబోయే బిడ్డకు మంచి భవిష్యత్ ఇవ్వాలని, అలాగే సొంత ఇంటిని కట్టుకోవాలనే ఉద్దేశంతో సౌదీ వెళ్లాలనుకుంటాడు. అక్కడ భారీగా డబ్బు సంపాదించి ఫ్యామిలీని సంతోషంగా చూసుకోవాలనుకుంటాడు. ఇంటిని తాకట్టు పెట్టి రూ. 30 వేలు అప్పు తెచ్చి మరీ సౌదీకి వెళ్లాడు. అతనితో పాటు హకీమ్(కేఆర్ గోకుల్) కూడా వెళ్తాడు. వీరిద్దరిని ఏజెంట్ మోసం చేస్తాడు. సౌదీకి వెళ్లిన తర్వాత వీరికి ఎవరూ ఉద్యోగం చూపించరు. అక్కడ కఫీల్ చేతిలో ఇరుక్కుంటారు. అతను వీరిద్దరి బలవంతంగా తీసుకెళ్లి వేరు వేరు చోట్ల పనిలో పెడతాడు. నజీబ్‌ని ఏడారిలో గొర్రెలు, మేకలు, ఒంటెలు కాసే పనిలో పెడతారు. అక్కడ నజీబ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? ఏడారి నుంచి బయటపడేందుకు నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు? ఆఫ్రికన్ ఇబ్రహం ఖాదిరి (జిమ్మీ జీన్ లూయిస్) నజీబ్‌కి అందించిన సహాయం ఏంటి? చివరకు నజీబ్ తిరిగి ఇండియాకు వెళ్లాడా లేదా? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
90వ దశకంలో పొట్టకూటి కోసం చాలామంది భారతీయులు గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు. అక్కడి వెళ్తే బాగా డబ్బు సంపాదించొచ్చని, దాంతో తమ కష్టాలన్నీ తీరుపోతాయనే ఆశతో అప్పు చేసి మరీ గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు. అలాంటివారిలో చాలా మంది ఏజెంట్ చేతిలో మోసపోయేవారు. మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి.. అక్కడికి వెళ్లిన తర్వాత రెస్పాన్స్ అయ్యేవారు కాదు. మళ్లీ తిరిగి ఇండియాకు వచ్చే స్థోమత లేక చాలా మంది అక్కడ యాచకులుగా.. గొర్రెలు, ఒంటెల కాపరిగా పని చేసేవారు. కొంతమంది అయితే అక్కడే చనిపోయేవారు కూడా. అలా ఏజెంట్ చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి కథే ‘ది గోట్ లైఫ్’. చదువు, అవగాహన లేకుండా, ఏజెంట్ చేతిలో మోసపోయి.. దొంగ వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి జీవితాలు ఎలా ఉంటాయి? అక్కడ వారు పడే కష్టాలు ఏంటి? అనేవి కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు బ్లెస్పీ.
ఇది వాస్తవంగా జరిగిన కథే. 90వ దశకంలో కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు చాలా కష్టాలు పడ్డాడు. నజీబ్ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ ప్రముఖ రచయిత బెన్యామిక్ గోట్ డేస్ అనే పుస్తకాన్ని రాశారు. కేరళలో ఈ పుస్తకం అనూహ్య పాఠక ఆదరణ పొందింది. ఆ పుస్తకం ఆధారంగానే దర్శకుడు బ్లెస్సీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. పుస్తకంలోని ప్రతి అక్షరానికి తెర రూపం ఇచ్చాడు దర్శకుడు.
సినిమా చూస్తున్నంతసేపు మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. ప్రధాన పాత్రకు ఎదురయ్యే సమస్యలు చూసి తట్టుకోలేం. ‘అయ్యో.. ఇంకెంత సేపు ఈ వేదన’ అనే ఫీలింగ్ కలుగులుతుంది. ఓ సాధారణ ప్రేక్షకుడు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రంలో ఉండదు. కానీ హీరో పాత్రకు కనెక్ట్ అయితే మాత్రం సీటులో నుంచి కదలరు.
హీరో ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీలో బానిసగా మారే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో గతాన్ని, వర్తమానాన్ని చూపిస్తూ కథనాన్ని ముందుకు నడిపించాడు. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో కథనాన్ని ఆసక్తికరంగా మలిచాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ప్రేక్షకుల మనసును మెలిపెట్టేస్తుంది. ఎడారిలో నీళ్ల కోసం అతను పడే బాధను చూపిస్తూనే.. వెంటనే గతంలో నది ఒడ్డున అతను ఎలా బతికాడనేది చూపించారు. ఈ రెండింటిని పోల్చకనే పోలుస్తూ ప్రేక్షకులను ఎమోషనల్‌కు గురి చేశాడు.
గొర్రెల మందతో కలిసి హీరో నీళ్లు తాగే సీన్ పెట్టి.. గల్ఫ్ వెళ్లిన తర్వాత అతని పరిస్థితి కూడా ఓ గొర్రెలాగే అయిందని చెప్పే ప్రయత్నం చేశాడు. అద్దంలో తన ముఖం తాను చూసుకొని హీరో పడే బాధను చూస్తుంటే మన గుండె బరువెక్కుతుంది. ఇలాంటి ఎమోషనల్ సీన్స్ ఫస్టాఫ్‌లో చాలానే ఉన్నాయి. ద్వితియార్థంలో కథ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఏడారి నుంచి బయటపడేందుకు మరో ఇద్దరితో కలిసి హీరో చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో వారికి ఎదురైన కష్టాల నేపథ్యంలో సెకండాఫ్ సాగుతుంది. దర్శకుడు ప్రతి విషయాన్ని డీటెయిల్డ్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు.
సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు కన్నీళ్లను తెప్పిస్తాయి. ముగింపు ఆకట్టుకుంటుంది. అయితే ఈ కథ అందరికి నచ్చకపోవచు. నిడివి కూడా ఇబ్బంది పెట్టొచ్చు. కానీ హీరో క్యారెక్టర్‌తో కనెక్ట్ అయి చూసేవాళ్లకి మాత్రం ‘ది గోట్ లైఫ్’ అద్భుతమైన సినిమా.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాకు ప్రధాన బలం పృథ్వీరాజ్ సుకుమారన్ నటన. నజీబ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ పడిన కష్టమంతా తెర పై కనిపించింది. నటనపై ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప ఇలాంటి పాత్రలు చేయలేరు. పృథ్వీరాజ్ నట జీవితంలో ‘ది గోట్ లైఫ్’ కచ్చితంగా ఒక బెంచ్ మార్క్ మూవీ అనొచ్చు. ఖాదిరి పాత్రకు జిమ్మిజీన్ లూయీస్ న్యాయం చేశాడు. అమలాపాల్ పాత్ర నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా నటించింది. హీరోహీరోయిన్ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నికల్‌గా సినిమా చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమా కు ప్లస్ అయింది. తనదైన బిజియం తో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు కథకు అనుగుణంగా సాగుతుంది. సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి.
చివరిగా.. ఈ సినిమా కమర్షియల్‌గా ఏ మేరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ.. ఇదొక అవార్డు విన్నింగ్ మూవీ. ఆస్వాదించేవారికి ‘ది గోట్ లైఫ్’ అద్భుతమైన సినిమా.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment